ETV Bharat / opinion

నూతన విద్యా విధానం: బంగరు భవితకు నారుమడి!

author img

By

Published : Jul 31, 2020, 9:42 AM IST

సుదృఢ విద్యాసౌధం అవతరింపజేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానానికి ఆయువు పోసింది. నేల విడిచి సాము గరిడీలు చేసిన మునుపటి అరకొర యత్నాలతో పోలిస్తే ఈ విధానం ఎన్నో రెట్లు మెరుగ్గా గోచరిస్తోంది. జీడీపీలో ఆరుశాతం కేటాయింపులపై మేలిమి సూచనలకు నూతన విద్యావిధానంలో సముచిత ప్రాధాన్యం దక్కింది. బోధనలోనే కాకుండా పాలనలోనూ అమ్మభాషను అందలమెక్కించాలి. అలాగైతేనే నూతన విధానంలో కీలక సంస్కరణ తాలూకు స్ఫూర్తి దేశమంతటా పరిమళిస్తుంది!

goi's New education polocy: Golden linen for the future
నూతన విద్యా విధానం: బంగరు భవితకు నారుమడి!

మోదీ ప్రభుత్వ మలిదఫా పాలన తొలినాడే మానవ వనరుల మంత్రిత్వశాఖ సముఖానికి చేరి, తాజాగా మంత్రివర్గ ఆమోదం పొందిన డాక్టర్‌ కస్తూరి రంగన్‌ కమిటీ నివేదిక- దేశంలో గతిశీల విజ్ఞాన ఆధారిత నవ సమాజ నిర్మాణాన్ని లక్షిస్తోంది. నర్సరీ నుంచి ఉన్నత విద్యారంగం వరకు వివిధ అంచెల్లో నిర్ణాయక సంస్కరణల ద్వారా, 2040 నాటికి ప్రపంచ అత్యుత్తమ వ్యవస్థల్లో ఒకటిగా భారతీయ బోధన రంగం నిలవాలన్న ప్రవచిత ఆశయం, సంస్తుతి పాత్రమైనది.

ఎన్నో రెట్లు మెరుగ్గా

1986నాటి జాతీయ విద్యావిధానం 1991 నాటికే ఔచిత్యం కోల్పోయిందన్న ఘాటు విమర్శల నేపథ్యంలో కొద్దిపాటి మార్పులు 1992లో చోటుచేసుకున్నా- అది అసమగ్ర కసరత్తుగానే మిగిలిపోయింది. అనంతర కాలంలో పొటమరించిన సమస్యలు ఎదురైన సవాళ్లను పరిగణనలోకి తీసుకుని సుదృఢ విద్యాసౌధం అవతరింపజేస్తామంటున్న నూతన విధానం- నేల విడిచి సాము గరిడీలు చేసిన మునుపటి అరకొర యత్నాలతో పోలిస్తే, ఎన్నో రెట్లు మెరుగ్గా గోచరిస్తోంది.

మేలిమి సూచనలకు సముచిత ప్రాధాన్యం

విద్యారంగం బలోపేతమైతే ఉత్పాదక కార్యకలాపాల్లో మానవ వనరుల శక్తియుక్తుల్ని గరిష్ఠంగా వినియోగించుకోగల వెసులుబాటు జాతి భాగ్యరేఖల్ని తిరగరాస్తుంది. పాఠశాల విద్య పూర్తయ్యేనాటికి ఏదో ఒక వృత్తి నైపుణ్యం, మాతృభాషలోనే బోధన, బండెడు పుస్తకాల మోత తగ్గిస్తూ సిలబస్‌లో కోత, విద్యకు జీడీపీలో ఆరుశాతం కేటాయింపులపై మేలిమి సూచనలకు నూతన విద్యావిధానంలో సముచిత ప్రాధాన్యం దక్కింది. పటిష్ఠ పునాదిపై అందరికీ విద్య సాకారం కావడానికి బడ్జెట్లలో ఉదార కేటాయింపులు ప్రాణావసరం. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయీకరిస్తున్న మొత్తం (జీడీపీలో 4.4శాతం) మరో రూ.2.25లక్షలకోట్ల మేరకు పెరిగితేనే- నూతన విద్యావిధానం ఆవిష్కరిస్తుందంటున్న గుణాత్మక పరివర్తన సుసాధ్యమవుతుంది!

సంస్కరించడమే విరుగుడు

దేశంలో పునాది చదువులు ఎలా చట్టుబండలవుతున్నదీ 'అసర్‌' నివేదికలు చాటుతుండగా- ఎంత పెద్ద చదువులకు అంత నిరుద్యోగిత చందంగా వ్యవస్థ పుచ్చిపోయింది. దీనికి సరైన విరుగుడు అట్టడుగు స్థాయినుంచీ సంస్కరించడమే! అమ్మభాషలో బోధనకు పెద్దపీట వేస్తున్న జర్మనీ, జపాన్‌, ఇటలీ, ఈజిప్ట్‌ ప్రభృత దేశాలు ఉత్పాదకతలో విశేషవృద్ధిని ఒడిసిపడుతున్నాయి. సొంతభాష విశేష ప్రాముఖ్యాన్ని మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటివి ఆకళించుకున్నా- తక్కిన రాష్ట్రాలెన్నో ఆంగ్ల మాధ్యమ బోధనకు అనుచిత ప్రాధాన్యం కట్టబెట్టడం చూస్తున్నాం. దేశంలో ఆంగ్లేయుల పాలన రూపు మాసిపోయినా, ఆ భాషపై విపరీతమైన మోజు ఈ గడ్డను వదిలిపెట్టడంలేదు. నూతన జాతీయ విద్యావిధానం నిర్దేశాల మేరకు- అయిదో తరగతి వరకు, వీలైతే ఎనిమిది దాకా ఆపైన మాతృభాషా మాధ్యమంలో బోధనకు సంబంధించి సంకుచిత రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్రాలన్నీ ఏకోన్ముఖ కృషి సాగించాలి.

అమ్మభాషను అందలమెక్కించాలి

కొందరు తల్లిదండ్రుల్లో ఆంగ్ల మాధ్యమం పట్ల అనురక్తికి, మున్ముందు తమ బిడ్డల ఉద్యోగ భద్రతపై ఆశే ప్రధాన కారణం. మాతృభాషలో చదవడం, రాయడం వచ్చినవారికే ప్రభుత్వ ఉద్యోగాలు లభించేలా కేంద్రం, రాష్ట్రాలు నిబంధనల్ని ప్రక్షాళించాలి. పాలనలోనూ అమ్మభాషను అందలమెక్కించాలి. అలాగైతేనే నూతన విధానంలో కీలక సంస్కరణ తాలూకు స్ఫూర్తి దేశమంతటా పరిమళిస్తుంది! ‘దేశంలోని 20శాతం ఉపాధ్యాయులు, 45శాతం ఒప్పంద సిబ్బంది ప్రామాణిక శిక్షణ లేనివారే. అత్యున్నత ఉపాధ్యాయ విద్య గరపడానికి ఐఐటీలు, ఐఐఎమ్‌ల తరహా విశిష్ట సంస్థనొకదాన్ని కొలువు తీర్చాలి! విధాన రూపకల్పన ఒకెత్తు, సమర్థ కార్యాచరణ మరొకెత్తు. కాలం చెల్లిన చదువులు, కొరగాని గురువులు, బతికించలేని పట్టాలు, ఉసురుతీసేస్తున్న పరీక్షల ఒత్తిళ్లు... వీటినుంచి భావితరాల్ని విముక్తం చేయాలన్న పట్టుదల ప్రభుత్వాల్లో ఉట్టిపడితేనే- భారత విద్యారంగ ముఖచిత్రం తేటపడేది!

ఇదీ చదవండి: విద్యాహక్కు చట్టాన్ని విస్తరించకుండా సార్వత్రిక విద్య అందేదెలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.