ETV Bharat / opinion

'హక్కులు' లేని భారతీయులు! ఇండియా మ్యాప్​లో కనిపించని గ్రామాల గురించి తెలుసా?

author img

By

Published : Jul 27, 2023, 8:24 PM IST

వారు పేరుకే భారతీయులు.. అన్ని గుర్తింపు పత్రాలు ఉన్నా.. హక్కులు మాత్రం లేవు. భూమి తమదే అయినా.. అమ్ముకోవడం కుదరదు. అసలు వారెవరు? వారి సమస్య ఏంటి?

No mans land Five Indian villages that dont exist on the country map
No mans land Five Indian villages that dont exist on the country map

ఆ ప్రాంత ప్రజల వద్ద అన్ని అధికారిక పత్రాలూ ఉంటాయి.. ఓటర్ కార్డుతో తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు... రేషన్ కార్డుతో సరకులు తీసుకుంటారు.. కానీ వారి పరిస్థితి అగమ్యగోచరమే! వారంతా భారత్​లోని భూభాగంలోనే ఉంటారు.. కానీ పూర్తిస్థాయిలో భారతీయులమని చెప్పుకోలేని పరిస్థితి. ఉండేందుకు భూమి ఉన్నా.. యాజమాన్య హక్కులు లేక దాన్ని అమ్ముకోలేని దుస్థితి. భారతదేశ పటంలోనే లేని ఊరు వారిది. ఎవరికీ లేని వింతైన సమస్య అది. వివరాల్లోకి వెళితే...

బంగాల్​లోని జల్పాయ్​గుడి జిల్లా, దక్షిణ బేరుబాడీ గ్రామ పంచాయతీలోని ఐదు గ్రామాల ప్రజల ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. కాజల్​డిఘీ, చిలాహటీ, బారాశశి, నవతారిదేబోత్తర్, పధానీ గ్రామాలను 2015 ఆగస్టు 1న భారత్​లో విలీనం చేసినా... అధికారిక మ్యాప్​లో ఇప్పటికీ ఈ ప్రాంతాలు కనిపించడం లేదు.

ఈ సమస్యకు మూలం భారత్-పాక్ విభజనకు ముందు ఉంది. ఈ గ్రామాలు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంటాయి. రెండు దేశాలను విభజించే రాడ్​క్లిఫ్ రేఖ ప్రకారం దక్షిణ బేరుబాడీ ప్రాంతం.. తూర్పు పాకిస్థాన్​ (ప్రస్తుత బంగ్లాదేశ్) పరిధిలోకి వస్తుందనేది పాకిస్థాన్ వాదన. ఈ బేరుబాడీ ఎవరికి చెందుతుందనే అంశంపై 1958 సెప్టెంబర్​లో అంశంపై అప్పటి భారత ప్రధాని జవహర్​లాల్ నెహ్రూ, పాక్ పీఎం ఫిరూజ్ ఖాన్ నూన్​ల మధ్య చర్చలు జరిగాయి. వీరిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం దక్షిణ బేరుబాడీని భారత్, పాక్​లకు సమానంగా విభజించాలి. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన దక్షిణ బేరుబాడీ ప్రజలు.. భారత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఈ ప్రక్రియను నిలిపివేసింది. అయినప్పటికీ, 9వ రాజ్యాంగ సవరణ (1960) ద్వారా దీనిపై ముందుకెళ్లాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే, పరిస్థితులు అందుకు అనుకూలించలేదు. 1962 ఇండో-చైనా యుద్ధం, 1964లో నెహ్రూ మరణం, 1965లో పాకిస్థాన్​తో యుద్ధం వంటి పరిణామాల వల్ల బేరుబాడీ సమస్య కాలగర్భంలో కలిసిపోయింది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడగా... ఈ అంశం మాత్రం ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా అపరిష్కృత సమస్యగానే మిగిలిపోయింది.

సమస్య ఇదీ..
సరిహద్దులోని కొన్ని ప్రాంతాలలో ఉన్న ఎన్​క్లేవ్​లు ఈ సమస్యను జఠిలంగా మార్చాయి. భారత భూభాగంలో ఉండే ఎన్​క్లేవ్​లలో బంగ్లాదేశీయులు, బంగ్లాదేశ్​లో ఉండే ఎన్​క్లేవ్​లలో భారతీయులు ఉండేవారు. విస్తీర్ణంలో చిన్నగా ఉండే ఈ ఎన్​క్లేవ్​లకు నాలుగువైపులా పక్క దేశ సరిహద్దు ఉండేది. వీటిపై పాలనాపరమైన నియంత్రణ సాధించడానికి రెండు దేశాలకూ వీలు లేకుండా ఉండేది. ఫలితంగా ఈ ఎన్​క్లేవ్​లలో నివసించే ప్రజల ఆలనాపాలనా చూసేవారు కరవయ్యారు. దశాబ్దాలుగా కొనసాగిన ఈ సమస్యకు 2015లో పరిష్కారం లభించింది.

మోదీ రంగప్రవేశంతో...
2015లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య.. ల్యాండ్ బోర్డర్ అగ్రీమెంట్ కుదిరింది. ఇందులో భాగంగా భారత్​లో 17,160.63 ఎకరాల్లో ఉన్న 111 ఎన్​క్లేవ్​లను బంగ్లాదేశ్​కు, బంగ్లాదేశ్​లో 7,110.02 ఎకరాల్లో ఉన్న 51 ఎన్​క్లేవ్​లను భారత్​కు అప్పగించాలని నిర్ణయించారు. ఈ ఎన్​క్లేవ్​లలో నివసించే ప్రజలు.. బంగ్లాదేశ్ లేదా భారత పౌరసత్వాల్లో దేన్నైనా ఎంచుకునే వీలు కల్పించారు. అయితే, ఐదు గ్రామాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒప్పందం ప్రకారం వారికి భారత్​లో ఉండేందుకు అవకాశం లభించినప్పటికీ.. భూమిని కలిగి ఉండే హక్కులు వీరికి లేకుండా పోయాయి.

'1974లో భారత ప్రధాని ఇందిరాగాంధీ, బంగ్లాదేశ్ ప్రధాని ముజిబుర్ రెహ్మాన్ మధ్య ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ కుదిరింది. దాని ప్రకారం సరిహద్దులను మార్చారు. అయితే, ఐదు భారతీయ గ్రామాలు బంగ్లాదేశ్​లో, నాలుగు బంగ్లాదేశ్ గ్రామాలు భారత్​లో కలిశాయని తర్వాత తెలిసింది. ఈ గ్రామాలను 'అడ్వర్స్ పొసెషన్స్​'గా గుర్తించారు. ఓ ఆస్తిపై సుదీర్ఘకాలం నియంత్రణ కొనసాగించి యాజమాన్య హక్కులు పొందడాన్ని అడ్వర్స్ పొసెషన్స్ అంటారు. ఇది రెండువైపులా ఉన్న ఆ గ్రామాల ప్రజల్లో అయోమయాన్ని మరింత పెంచింది' అని మాజీ ఎమ్మెల్యే, చిలాహటీ గ్రామ నివాసి గోబిందో రాయ్ ఈటీవీ భారత్​కు వివరించారు.

"కామత్(చిలాహటీ) గ్రామం చాలా ఏళ్లుగా ఈ సమస్యను అనుభవిస్తోంది. ఇక్కడి ప్రజలకు ఆస్తి పత్రాలు లేవు. ఈ గ్రామానికి పొరుగున ఉన్న నాలుగు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ సమస్య పది వేల మందిపై ప్రభావం చూపుతోంది. అందులో 8 వేల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. భూపత్రాలు లేకపోవడం వల్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందించే కృషక్ బంధు, కిసాన్ నిధి సమ్మాన్ వంటి పథకాలు అందుకోలేకపోతున్నారు. ఇక్కడి ప్రజలు భారత్​లోనే ఉంటామని నిరసన చేస్తున్నారు. 2015లో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరినా.. ఈ గ్రామాల విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఈ గ్రామాలను భారత్​లో అంతర్భాగంగా ప్రకటించినా.. సరైన పత్రాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చట్టపరమైన గుర్తింపు తమకు లభించడం లేదని గ్రామస్థులు బాధపడుతున్నారు."
-గోబిందో రాయ్, మాజీ ఎమ్మెల్యే, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ

ఈ అంశంపై జల్పాయ్​గుడి జిల్లా మేజిస్ట్రేట్ మౌమితా గోదరాను సంప్రదించగా.. సమస్యపై ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు. 'దక్షిణ బేరుబాడీలోని ఈ గ్రామాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉన్నతాధికారులకు ఇందుకు సంబంధించిన సమాచారం అందించాం' అని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.