ETV Bharat / opinion

CBSE news: ప్రతిభను కొలిచే సాధనం- రెండు పరీక్షల విధానం

author img

By

Published : Aug 23, 2021, 7:31 AM IST

exams, cbse
పరీక్షలు, సీబీఎస్​ఈ

సీబీఎస్‌ఈ (CBSE latest news) రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం మంచి పరిణామమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వీటి ద్వారా విద్యార్థి ప్రతిభను అంచనా వేయడం సులువవడంతో పాటు పరీక్ష పట్ల నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుందని అంటున్నారు.

ఏడాదిన్నరగా పాఠశాల విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా కొనసాగుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో కేంద్ర విద్యాశాఖ ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతి ఇచ్చింది. ఆ తరవాత పలు రాష్ట్రాలు కరోనా నియమావళితో పాఠశాలలను పునః ప్రారంభించాయి. సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) (CBSE latest news) పది, పన్నెండు తరగతులకు పరీక్షల ప్రణాళికను విడుదల చేసింది. అంతలోనే కరోనా రెండో దశ విజృంభణతో బడులు మళ్ళీ మూతపడ్డాయి. చివరకు విద్యార్థులు, తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు కేంద్ర విద్యాశాఖ పరీక్షలను రద్దు చేసింది. పలు రాష్ట్రాలూ అదే దిశలో ముందుకుసాగాయి. దీనివల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందనే వాదన వినిపించింది. దాంతో సీబీఎస్‌ఈ 12వ తరగతి((CBSE class 12) పరీక్షల రద్దును వ్యతిరేకిస్తూ కొందరు తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

పరీక్షల రద్దును సమర్థిస్తూ మార్కులపై విద్యార్థులకు అభ్యంతరాలుంటే పరిష్కరించే వ్యవస్థ ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. బోర్డు మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులకు కరోనా తగ్గిన తరవాత మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఉన్నత విద్యాభ్యాసం పరంగా ఇంటర్‌లో కనీస మార్కుల నిబంధన కనిపిస్తుంది. అందువల్ల ఫలితాల అనంతరం కొంత మంది విద్యార్థులు అధిక మార్కుల సాధనకు పరీక్షలు నిర్వహించాలని ఆయా బోర్డులను ఆశ్రయిస్తున్నారు. అందువల్ల పరీక్షలు నిర్వహిస్తే ఇలాంటి చిక్కులేవీ రావని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో ఇటీవల సీబీఎస్‌ఈ(CBSE latest news) రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం మంచి పరిణామం.

మరింత సులువు..

ఒకరకంగా ఇవి సెమిస్టర్‌ పరీక్షల లాంటివే. వీటి ద్వారా విద్యార్థి ప్రతిభను అంచనా వేయడం సులువవడంతో పాటు పరీక్ష పట్ల నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుంది. ఈ విధానంలో విద్యా సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజించి యాభై శాతం సిలబస్‌ చొప్పున ఏడాదిలో రెండు బోర్డు/టర్మ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. దీనికనుగుణంగా ఇటీవల సిలబస్‌ను సైతం హేతుబద్ధీకరించి అంతర్జాలంలో అందుబాటులో ఉంచారు. మొదటి టర్మ్‌ పరీక్ష 90 నిమిషాల వ్యవధిలో అన్నీ బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది. రెండో పరీక్షను రెండు గంటల వ్యవధిలో వివరణాత్మకంగా రాయాల్సి ఉంటుంది.

పరిస్థితులు అనుకూలించకపోతే రెండో పరీక్షనూ బహుళైచ్ఛిక విధానంలో నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలతో పాటు అంతర్గత పరీక్షలు, ప్రాక్టికల్స్‌ ఆధారంగా తుది ఫలితాలను వెల్లడిస్తారు. మరోవైపు విద్యార్థుల అభ్యసన ఫలితాల మదింపు విధానంలో మార్పులు చేయాలని, తూతూ మంత్రంగా పరీక్షలు జరిపి ఇష్టారాజ్యంగా మార్కులు/గ్రేడ్‌లు ఇవ్వొద్దని ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ ఆయా రాష్ట్రాలకు సూచించింది. అందువల్ల సీబీఎస్‌ఈ విధానాన్ని పలు రాష్ట్రాలు అనుసరించే అవకాశం ఉంది. ఇప్పటికే పదో తరగతి పరీక్షల్లో ఈ విధానాన్ని తేవాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది.

పారదర్శకంగా నిర్వహించాలి..

నేటి విద్యావ్యవస్థలో విద్యార్థి ప్రతిభకు కొలమానం పరీక్షలు. ఇవి విద్యా ప్రణాళికలో భాగం కాబట్టి, పరీక్షల నిర్వహణ అత్యావశ్యకం. కరోనా మూడో దశ ముప్పు పిల్లలపై అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో ఈ ఏడాది సైతం వార్షిక పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో సీబీఎస్‌ఈ 10, 12 తరగతులకు రెండు దశల్లో పరీక్షలు నిర్వహిస్తే మదింపు ప్రక్రియ సజావుగా సాగుతుంది. మార్కుల కేటాయింపుపై స్పష్టత ఏర్పడి, విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఎదురైనా కనీసం ఒక టర్మ్‌ పరీక్ష జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నూతన విధానాన్ని విద్యార్థికి అర్థమయ్యేలా ఎలాంటి అవకతవకలు లేకుండా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలి. విద్యార్థి మొదటి టర్మ్‌ పరీక్ష ఫెయిల్‌ అయితే సప్లిమెంటరీకి అవకాశం కల్పించాలి. లేకుంటే ఆ ప్రభావం తరవాతి పరీక్షపై పడి నష్టపోవాల్సివస్తుంది.

రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. దీన్ని అధిగమించడానికి సకాలంలో పాఠ్యాంశాలు పూర్తి చేసి నమూనా పరీక్షలు నిర్వహించాలి. ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నాటికి ప్రత్యక్ష లేదా ఇళ్ల నుంచే ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌లో పరీక్షలు జరపాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. ఇప్పటికే అధికశాతం విద్యార్థులకు అభ్యసన నష్టం జరిగినందువల్ల ప్రత్యేక అభ్యసన కార్యక్రమం చేపట్టాలి. ఒకవేళ ఆన్‌లైన్‌ అభ్యాసమే విద్యా సంవత్సరమంతా కొనసాగితే ఓపెన్‌ బుక్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఇటీవల ఇది విస్తృతంగా ప్రాచుర్యంలోకి వస్తోంది. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ విధానంలో ప్రశ్నలు అడిగే విధానంలో మార్పులు తేవడం తప్పనిసరి.

- సంపతి రమేష్‌ మహారాజ్‌

ఇదీ చదవండి:Andhra Kesari: జన హృదయ విజేత.. ఈ 'ఆంధ్రకేసరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.