ETV Bharat / opinion

తెలంగాణలో హిట్- రాజస్థాన్, ఛత్తీస్​గఢ్​లో పవర్​ కట్​​- 2024లో కాంగ్రెస్ దారెటు?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 6:22 PM IST

Election Results Today Congress Situation : దక్షిణాదిలోని మరో రాష్ట్రంలో కాంగ్రెస్​ హిట్​- ఉత్తరాదిలోని రెండు రాష్ట్రాల్లో అధికారం ఫట్- కాంగ్రెస్​ ప్రస్తుత పరిస్థితి ఇదే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో గెలిచిన హస్తం పార్టీ.. రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​ పీఠాలను కోల్పోయింది. మధ్యప్రదేశ్​లోనూ ఓడిపోయింది. కాంగ్రెస్​ ఓటమికి అసలు కారణాలేంటి? భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఎలా ఉండనుంది?

Election Results Today Congress Situation
Election Results Today Congress Situation

Election Results Today Congress Situation : 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలతో కలిసి అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న కాంగ్రెస్​ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి షాక్​ తగిలింది. బీజేపీ దెబ్బకు రెండు ఉత్తరాది రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. మరో రాష్ట్రంలోనూ విజయతీరాలకు చేరలేకపోయింది. ఫలితంగా మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైంది. మరో దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలో అధికారం పీఠం దక్కించుకున్నప్పటికీ ఉత్తరాదిలో పట్టు కోల్పోయినట్లైంది.

కాంగ్రెస్​ అగ్రనేతలు రాహుల్​ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే పెద్ద ఎత్తున ఎన్నికల సభలు, ప్రచారాలు నిర్వహించినా.. గ్యారెంటీల పేరుతో హామీలు కురిపించినా అనుకున్నది సాధించలేకపోయింది. రాజస్థాన్​లో మార్పు సంప్రదాయం పునరావృతం​ కాగా ఛత్తీస్​గఢ్​లో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. మధ్యప్రదేశ్​లో కమలం పార్టీ మరోసారి గెలిచింది. అయితే స్వీయ తప్పిదాలే కాంగ్రెస్​కు షాక్​ తగిలేలా చేశాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే మధ్యప్రదేశ్​, రాజస్థాన్, చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్​ ఓటమికి కారణాలేంటి? భవిష్యత్తులో హస్తం పార్టీకి కష్టమేనా?

  1. రాజస్థాన్​లో కాంగ్రెస్​ ఓటమికి ఆ పార్టీ నేతల్లో కుమ్ములాటలే ప్రధాన కారణం. సీఎం అశోక్​ గహ్లోత్​, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య కలహాలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. వీరి మధ్య ఉన్న విబేధాలను తొలగించేందుకు అధిష్ఠానం ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
  2. పరీక్షా ప్రతాల లీకులు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్​కు ఓడిపోయేలా చేశాయి. నాలుగేళ్లలో 18 సార్లు పేపర్లు లీక్​లు కావడం వల్ల యువతలో భారీ వ్యతిరేకత కనిపించింది. రెడ్​ డైరీ వ్యవహారం కూడా కాంగ్రెస్​ను దెబ్బతీసింది.
  3. రాష్ట్ర ప్రజలకు హామీలు కురిపించినా వాటిని ప్రచారం చేసుకోలేకపోయారు కాంగ్రెస్​ నేతలు. వంట గ్యాస్​పై సబ్సిడీ వంటి స్కీమ్​లతో ప్రభుత్వ వ్యతిరేకతను గహ్లోత్​ తగ్గించుకునే ప్రయత్నం చేసినా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది.
  4. ఛత్తీస్​గఢ్​లో కాంగ్రెస్​దే విజయమని ఎగ్జిట్​ పోల్స్​ చెప్పినా అనూహ్యంగా అధికార పీఠం కోల్పోయింది. అయితే ఎన్నికలకు 10 రోజుల ముందు వెలుగులోకి వచ్చినా మహదేవ్​ బెట్టింగ్ యాప్​ కేసు వ్యవహారం హస్తం పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్​ ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది!
  5. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్​ నెరవేర్చలేదని బీజేపీ విస్త్రత ప్రచారం చేసింది. మద్యాన్ని నిషేధిస్తామనే కీలక ఎన్నికల వాగ్దానాన్ని బఘేల్​ ప్రభుత్వాన్ని మరిచిందని విమర్శలు గుప్పిస్తూ బీజేపీ సానుకూలత మూటగట్టింది. ఇది కూడా కాంగ్రెస్​ ఓటమికి కారణమే.
  6. మధ్యప్రదేశ్​లో హిందూ ఓట్లను సమీకరించేందుకు తన వైఖరికి భిన్నంగా కాంగ్రెస్ అనుసరించిన సాఫ్ట్ హిందుత్వ వైఖరి బెడిసికొట్టింది. హిందుత్వ కార్డును బీజేపీ పక్కాగా ప్రయోగించింది. ఎన్నికలకు నెలల ముందు నుంచే హిందూ ఆలయాల అభివృద్ధిపై శివరాజ్ సర్కారు దృష్టిసారించింది.
  7. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్ తీసుకొచ్చిన వివిధ సంక్షేమ పథకాలు కాంగ్రెస్​ను దెబ్బతీశాయి. మరోవైపు శివరాజ్​కు ఉన్నంత కరిష్మా ఏ కాంగ్రెస్​ నాయకుడికి లేకపోవడం పార్టీకి ఎదురుదెబ్బే!
  8. పైవన్నీ రాష్ట్రాల వారీగా కారణాలు అయినప్పటికీ బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్​ ప్రచార పర్వంలో వెనకపడిందని చెప్పొచ్చు. కమల దళ అగ్రనేతలంతా ఆయా రాష్ట్రాల్లో భారీగా ప్రచార సభలు, ర్యాలీ నిర్వహించగా కాంగ్రెస్​ నుంచి పలువురు మాత్రమే రంగంలోకి దిగారు.
  9. కర్ణాటకలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అదనంగా జోడించి అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్​ హామీలు కురిపించినా ప్రజలను ఆకట్టుకోలేకపోయారు. వివిధ కారణాలతో బీజేపీకే అధికార పీఠాలను అప్పజెప్పారు ఓటర్లు. కులగణన పక్కాగా చేపడతామని కాంగ్రెస్​ చెప్పినా ప్రజలు ఆదరించలేదు.

భవిష్యత్తులో హస్తం పార్టీకి కష్టమేనా?
ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సారథ్య బాధ్యతలను నిర్వర్తిస్తున్న కాంగ్రెస్​కు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అతిపెద్ద సవాల్​ అని చెప్పొచ్చు. కూటమికి 'పెద్దన్న'గా కాంగ్రెస్​ బాధ్యతలు నిర్వహించడం పలు పార్టీలకు ఇష్టం లేకపోయినప్పటికీ కర్ణాటక విజయం తర్వాత ఒప్పుకున్నట్లు కనిపించింది. మళ్లీ ఇప్పుడు మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఓటమి తర్వాత హస్తం పార్టీ నాయకత్వ బాధ్యతలపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. భారత్​ జోడో యాత్రతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్​కు రాహుల్​ గాంధీ ఊపు తెప్పించినప్పటికీ ఎన్నికల సమయంలో ఆ ప్రభావం కనిపించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుదామని భావించిన కాంగ్రెస్​కు ఆదివారం వెలువడ్డ ఫలితాలు భంగపాటే!

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దేశంలోని కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రమే అధికారంలో ఉంది. తెలంగాణ విజయంతో మూడు రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగనుంది. బిహార్, ఝార్ఖండ్‌లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. తమిళనాడులో అధికార డీఎంకేతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అధికార ఏర్పాటులో భాగం కాలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.