ETV Bharat / opinion

రోడ్డెక్కని ప్రయాణికుల భద్రత

author img

By

Published : May 23, 2021, 8:21 AM IST

మన దేశంలో ప్రమాదాలు పెచ్చుమీరి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా.. రహదారి భద్రత భావన కాగితాలు దాటి రోడ్డెక్కడం లేదు. ట్రాఫిక్‌ నిబంధనలను సరిగ్గా పాటించలేదంటూ టంచనుగా అపరాధ రుసుములు విధించే అధికార యంత్రాంగాలు.. రహదారులను ప్రమాదరహితంగా చేయడంలో మాత్రం చేతులెత్తేస్తున్నాయి. రాష్ట్రాలు బడ్జెట్‌ రూపకల్పన సమయంలో రహదారి భద్రతకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చేసిన సిఫార్సులు ఆచరణకు ఆమడ దూరంలోనే ఉంటున్నాయి.

road safety
రోడ్డు భద్రత

సురక్షిత ప్రయాణాల దిశగా అందరిలో అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి ఏటా రోడ్డుభద్రతా వారోత్సవాలు (ఈ ఏడాది మే 17-23) నిర్వహిస్తోంది. మన దేశంలో ప్రమాదాలు పెచ్చుమీరి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా- రహదారి భద్రత భావన కాగితాలు దాటి రోడ్డెక్కడం లేదు. ట్రాఫిక్‌ నిబంధనలను సరిగ్గా పాటించలేదంటూ టంచనుగా అపరాధ రుసుములు విధించే అధికార యంత్రాంగాలు- రహదారులను ప్రమాదరహితంగా చేయడంలో మాత్రం చేతులెత్తేస్తున్నాయి. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో కేరళ ప్రభుత్వం- ప్రమాదాల నియంత్రణకు వ్యూహాత్మక ప్రణాళికలతో చట్టాన్ని రూపొందించింది. ఇతర రాష్ట్రాలేవీ ఆ మేరకు చొరవ చూపలేదు. తెలంగాణ రాష్ట్రంలో చట్టం ముసాయిదా సిద్ధమైనా అది కాగితాలు దాటలేదు. ఆంధ్రప్రదేశ్‌లో చట్టం రూపకల్పనకు సంవత్సరాల కిందట అడుగులు పడినా అవి ముందుకు సాగలేదు.

విస్తరణకు నోచుకోని ప్రయోగం

మునుపటితో పోలిస్తే ఇటీవలి కాలంలో ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్‌ స్పాట్స్‌) గుర్తింపు ప్రక్రియ కొనసాగడం కాస్తంత ఊరట కలిగించే అంశం. ప్రతి రాష్ట్రంలోనూ రహదారి భద్రతకు ప్రత్యేక నిధిని కేటాయించాలంటూ సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చేసిన సిఫార్సులు సైతం కేరళలోనే అమలవుతున్నాయి. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు తక్షణ వైద్య సదుపాయాలు అందించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో కొన్ని ఆస్పత్రులను 'ట్రామాకేర్‌' కేంద్రాలుగా గుర్తించారు. బాధితులను సాధ్యమైనంత వేగంగా ఆస్పత్రులకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తొలి గంటను వైద్య పరిభాషలో 'స్వర్ణ సమయం'గా వ్యవహరిస్తారు. ఆలోపు బాధితులకు సరైన ప్రాథమిక వైద్యం అందితే- ప్రాణాలు కాపాడే అవకాశాలు అధికంగా ఉంటాయి.

అడుగు ముందుకు పడలేదు..

తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌ నగర శివారు పరిసరాల్లో 'యాక్టివ్‌ బ్లీడ్‌ కంట్రోల్‌ (ఏబీసీ)' పేరిట 108 సంస్థ చేసిన ప్రయోగం ఫలితాన్ని ఇచ్చింది. హైదరాబాద్‌ శివార్లలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్న ప్రాంతాల్లో సేవాభావం ఉన్న యువకులు, ఆటో డ్రైవర్లు తదితరులను గుర్తించి, వారికి అత్యవసర ప్రాథమిక వైద్యంలో ఈ సంస్థ శిక్షణ ఇచ్చింది. వైద్య కిట్లనూ అందజేసింది. 108కి ప్రమాద సమాచారం రాగానే ఆ ప్రాంతానికి వాహనం పంపడంతోపాటు ఆ పరిసరాల్లో సుశిక్షితులైన ఔత్సాహికులకూ సమాచారం వెళుతుంది. వారు తక్షణం అక్కడికి చేరుకుని బాధితులకు వైద్య సేవలు అందించడం ద్వారా ప్రాణాలకు ముప్పు తప్పుతోంది. కొన్ని సందర్భాల్లో వైద్య కిట్లను డ్రోన్ల ద్వారా నిర్దేశిత ప్రాంతాలకు పంపుతున్నారు. ఈ ప్రయోగాన్ని మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినా అడుగు ముందుకు పడలేదు.

ఆమడ దూరంలోనే..

రాష్ట్రాలు బడ్జెట్‌ రూపకల్పన సమయంలో రహదారి భద్రతకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్న సిఫార్సులు ఆచరణకు ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. అపరాధ రుసుముగా వాహనదారుల నుంచి వసూలు చేస్తున్న సొమ్ము నుంచి కొంత మొత్తాన్నయినా రహదారి భద్రతకు కేటాయిస్తే ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుంది. జిల్లా స్థాయిలోని రహదారి భద్రతా కమిటీలు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నాయి కానీ, ప్రత్యేకించి నిధులు లేకపోవటంతో రహదారులు-భవనాల శాఖ కేటాయింపులే శరణ్యమవుతున్నాయి. ఆ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ప్రాంతాల్లో మాత్రమే ప్రమాద సూచికలు, జనావాసాల వద్ద వేగ నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు అవుతున్నాయి. ప్రతి జిల్లా కలెక్టర్‌ వద్ద కొంత ప్రత్యేక నిధి ఉంటుంది. అందులో నుంచి కొంత మొత్తాన్ని రహదారి భద్రతకు వెచ్చించవచ్చు.

తెలుగు రాష్ట్రాలకు దక్కని అవకాశం

ప్రమాదాల నివారణలో తమిళనాడు విధానం ఆధారంగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ... 'సమీకృత రహదారి ప్రమాద సమాచార వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ డేటాబేస్‌ ప్రాజెక్ట్‌... ఐ-రాడ్‌)'కు నిరుడు శ్రీకారం చుట్టింది. ఐఐటీ మద్రాస్‌తోపాటు జాతీయ సమాచార కేంద్రం సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఇవి మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తాయి. ప్రమాదాల సమాచారాన్ని ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది. వాటిని విశ్లేషించిన అనంతరం దిద్దుబాటు చర్యలను చేపట్టాలన్నది వ్యూహం. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఒక్కో జిల్లాను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా అధ్యయనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కలేదు. దేశవ్యాప్తంగా ఏటా జరుగుతున్న ప్రమాదాల్లో సుమారు లక్షా యాభై వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మూడున్నర లక్షల మంది క్షతగాత్రులు అవుతున్నారు. తెలంగాణలో ఏటా సగటున ఇరవై వేల రోడ్డు ప్రమాదాల్లో ఆరున్నర వేల మందికిపైగా మృత్యువాత పడుతున్నారు. సుమారు 20 వేల మంది క్షతగాత్రులు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏటా సగటున 25 వేల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎనిమిది వేల మంది విగతజీవులవుతున్నారు. సుమారు 26 వేల మంది గాయపడుతున్నారు.

ఇండియా వాటా 11శాతం..

ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని రకాల వాహనాల్లో భారతదేశం వాటా ఒక శాతమే. రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి విషయంలో మాత్రం ఇండియా వాటా 11శాతమని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడిస్తోంది. దేశంలోని రహదారి ప్రమాదాల సామాజిక-ఆర్థిక నష్టాల విలువ సుమారు రూ.1.47 లక్షల కోట్లు. ఇది భారత స్థూల దేశీయోత్పత్తిలో 0.77 శాతం. నమోదు చేస్తున్న ప్రమాదాల గణాంకాల్లో వాస్తవికత లోపిస్తోందన్న ఆరోపణ ఉంది. అనధికారిక సమాచారం ప్రకారం ప్రమాదాల సామాజిక, ఆర్థిక నష్టాల విలువ రూ.5.96 లక్షల కోట్లని అంచనా. ఇది స్థూల దేశీయోత్పత్తిలో 3.14 శాతానికి సమానం. ప్రమాదాల వల్ల చోటుచేసుకునే నష్టాలను అంచనా వేయవచ్చు కానీ- ప్రమాద బాధితుల కుటుంబాల్లో రేగే క్షోభను అంచనా వేయడం అసాధ్యం! ఇంటి యజమానిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్న ఉదంతాలు కోకొల్లలు. రోడ్డు ప్రమాదాల విషయంలో మానవీయ కోణంలో స్పందించి, రహదారులపై రక్తపుటేళ్లు పారకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఫలించిన తమిళనాడు వ్యూహం

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో తమిళనాడు విధానం పలువురి ప్రశంసలు పొందింది. ప్రమాదాల సమాచార విశ్లేషణకు తమిళనాడు పెద్దపీట వేసింది. ఇందుకోసం ఆ రాష్ట్రం ఐఐటీ మద్రాసు సహాయం తీసుకుంది. రహదారి ప్రమాదాల్లో దేశంలోనే తొలి నాలుగైదు స్థానాల్లో ఉండే తమిళనాట- ఈ ప్రయోగానంతరం ప్రమాదాలు, మృతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రమాద స్థలంలో రహదారి నిర్మాణం ఎలా ఉంది, వాహన సామర్థ్యం, వేగం, డ్రైవర్‌ తీరుతెన్నులు, గతంలో ఆ ప్రాంతంలో ప్రమాదాలు జరిగాయా, దిద్దుబాటు చర్యలు తీసుకున్నారా... ఇలా సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తారు. తెలంగాణ పోలీసు అధికారుల బృందం ఇటీవల తమిళనాడు విధానాన్ని అధ్యయనం చేసి వచ్చింది. ఇక్కడ అది ఎప్పటికి ఆచరణలోకి వస్తుందో మరి!

- ఐ.ఆర్‌.శ్రీనివాసరావు

ఇదీ చూడండి: కొరవడిన ముందు చూపు- అసమానతల్లో ప్రజారోగ్యం

ఇదీ చూడండి: 'కరోనా మృతుల పట్ల మోదీ మొసలి కన్నీరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.