ETV Bharat / opinion

బొమ్మల పరిశ్రమకు చేయూతగా కేంద్రం ప్రణాళిక!

author img

By

Published : Mar 7, 2021, 8:01 AM IST

దాదాపు రూ.9 వేల కోట్ల విలువైన భారతీయ ఆటబొమ్మల పరిశ్రమ రాబోయే అయిదేళ్లలో ఏడాదికి 12.2 శాతం చొప్పున అభివృద్ధిని సాధించే అవకాశముంది. ప్రస్తుతం పాతిక లక్షల మంది కార్మికులకు (వీరిలో సగం మంది మహిళలు) ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం బాగా విస్తరిస్తే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. అభివృద్ధికి అపార అవకాశాలున్న దేశీయ ఆటబొమ్మల పరిశ్రమను ప్రోత్సహిస్తూ, తద్వారా ఉపాధి కల్పన, సంపద సృష్టికి ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

eenadu editorial about toy manufacturing industries in india
బొమ్మల పరిశ్రమకు చేయూతగా కేంద్రం ప్రణాళిక!

చిన్నారుల సంతోషమే మూలధనంగా ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ విస్తరిస్తున్న బొమ్మల పరిశ్రమ ప్రస్తుత మార్కెట్‌ విలువ ఏడు లక్షల కోట్ల రూపాయల పైమాటే. ఇందులో మన దేశం వాటా 0.5 శాతంకంటే తక్కువే. దేశంలో అమ్ముడవుతున్న ఆటవస్తువుల్లో అత్యధికం విదేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి వస్తున్నవే. అభివృద్ధికి అపార అవకాశాలున్న దేశీయ ఆటబొమ్మల పరిశ్రమను ప్రోత్సహిస్తూ, తద్వారా ఉపాధి కల్పన, సంపద సృష్టికి ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. భారతీయ ఆటబొమ్మల పరిశ్రమకు చేయూతనివ్వడంలో మొదటి అడుగుగా 'ఇండియా టాయ్‌ ఫెయిర్‌-2021' నిర్వహించింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి రెండో తేదీ వరకు అంతర్జాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో వెయ్యి మంది తయారీదారులు వారి ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ- చిన్నారుల మానసిక ఎదుగుదలకు ఉపకరించే పర్యావరణహితకరమైన ఆటవస్తువులను రూపొందించాలని పిలుపిచ్చారు.

ఉపాధికి ఊతం
నూట ముప్ఫై కోట్ల దేశ జనాభాలో 20 శాతంపైగా పన్నెండేళ్లలోపు చిన్నారులే. జనాభాలో 30-40 శాతంగా ఉన్న మధ్యతరగతి ప్రజలు 2030 నాటికి మరో 10-15 శాతానికి పెరుగుతారని అంచనా. ఈ క్రమంలో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైన భారతీయ ఆటబొమ్మల పరిశ్రమ రాబోయే అయిదేళ్లలో ఏడాదికి 12.2 శాతం చొప్పున అభివృద్ధిని సాధించే అవకాశముంది. ప్రస్తుతం పాతిక లక్షల మంది కార్మికులకు (వీరిలో సగం మంది మహిళలు) ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం బాగా విస్తరిస్తే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. 'ప్రస్తుతం దేశంలో బొమ్మల చిల్లర విపణి విలువ రూ.16 వేల కోట్లు. అమ్ముడవుతున్న వాటిలో 75 శాతం చైనా నుంచి వస్తున్నవే. దేశీయ ఉత్పత్తుల అమ్మకం విలువ ఆరు వేల కోట్ల రూపాయలకు మించి లేదు' అని పేర్కొన్న భారత బొమ్మల సంఘం (టీఏఐ) ప్రధాన కార్యదర్శి శరద్‌ కపూర్‌ మాటలు ఈ రంగంలో మన వెనకబాటుకు అద్దంపట్టేవే. దేశీయ మార్కెట్‌ అవసరాలకు, ఉత్పత్తికి, మొత్తం అమ్మకాలకు, వాటిలో స్థానిక ఉత్పత్తుల వాటాకు మధ్య ఉన్న ఈ భారీ అంతరాలను తగ్గించడానికి కేంద్రం చొరవ ఉపకరిస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

బొమ్మల క్లస్టర్ల ఏర్పాటు..

దేశీయ ఆటవస్తువుల్లో 75 శాతం సూక్ష్మ పరిశ్రమల్లోనే తయారవుతున్నాయి. మరో 22 శాతం బొమ్మలు చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో రూపొందుతున్నాయి. స్థానికంగా ఉత్పత్తి పెంచడానికి కేంద్రం ప్రత్యేకంగా బొమ్మల క్లస్టర్లను ఏర్పాటు చేస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ (కాకినాడ)ల్లో ఇప్పటికే ఉన్న రెండు క్లస్టర్లకు తోడు మరో ఎనిమిదింటికి అనుమతులిచ్చింది. మధ్యప్రదేశ్‌లో మూడు, రాజస్థాన్‌లో రెండు, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడుల్లో ఒక్కొక్కటి చొప్పున ఇవి ఏర్పాటుకాబోతున్నాయి. సంప్రదాయ పరిశ్రమల పునరుజ్జీవ నిధి పథకం ('స్ఫూర్తి'గా 2005-06లో ప్రారంభమైన ఈ పథకానికి 2014లో కొన్ని మార్పుచేర్పులు చేశారు) కింద రూ.2300 కోట్ల వ్యయంతో నెలకొల్పుతున్న ఈ క్లస్టర్లలో పర్యావరణహితకరమైన బొమ్మలు తయారవుతాయి.

దేశవ్యాప్తంగా 35 క్లస్టర్లు

రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 35 క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన జరుపుకొన్న కొప్పళ (కర్ణాటక) క్లస్టరులో రిమోట్‌ కార్లు వంటి ఆధునిక ఆటవస్తువులు భారీయెత్తున తయారు కాబోతున్నాయి. నాలుగు వందల ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ క్లస్టర్లో ఇప్పటికే ఆరు సంస్థలు రూ.1,540 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి దీని నిర్మాణ పనులు పూర్తి చేయాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. అనుకున్న ప్రణాళికల మేరకు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటైతే ప్రత్యక్షంగా 30 వేల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గుజరాత్‌ ప్రభుత్వం కూడా ఇలాంటి పారిశ్రామిక వాడను నెలకొల్పే ఆలోచనలో ఉంది. దిల్లీ యమునా ఎక్స్‌ప్రెస్‌ మార్గం సమీపంలో ప్రభుత్వం కేటాయించిన వందెకరాల భూమిలో ఇప్పటికే 115 బొమ్మల కర్మాగారాలు ఏర్పాటయ్యాయి.

దిగుమతి సుంకం పెంపు
'భారత్‌లో తయారీ'ని ప్రోత్సహించడానికి విదేశాల నుంచి వచ్చే బొమ్మల మీద దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 60 శాతానికి పెంచారు. కరోనా సంక్షోభం వేళ చైనా నుంచి దిగుమతులు కొంత తగ్గడంతో ఈ అవకాశాన్ని దేశీయ ఆటబొమ్మల పరిశ్రమలు అందిపుచ్చుకొని నిలదొక్కుకోవడానికి యత్నిస్తున్నాయి. వాటికి చేయూతనందిస్తూ ఈ లక్ష్యసాధనకు ఉపకరించేలా బొమ్మల పరిశ్రమను 24 ప్రాధాన్య రంగాల్లో ఒకటిగా కేంద్రం గుర్తించింది. అంతర్జాతీయ సంస్థలతో మన పరిశ్రమలు పోటీపడగలిగేలా ప్రోత్సహించడానికి 'జాతీయ ఆటబొమ్మల కార్యాచరణ ప్రణాళిక'ను రూపొందించింది. 15 మంత్రిత్వ శాఖలు, విభాగాలను అనుసంధానిస్తూ రూపొందించిన ఈ ప్రణాళిక- దేశీయ మార్కెట్‌ అవసరాలకు తగిన ఉత్పత్తులను స్థానికంగానే తయారు చేసుకోవడంతో పాటు విశ్వవిపణిలో విస్తరించేందుకూ అక్కరకొస్తుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బొమ్మల క్లస్టర్ల ఏర్పాటుతోపాటు తయారీ, ఎగుమతులకు సాయం చేసే ప్రత్యేక పథకాలను ప్రకటిస్తారు. గణితం, సామాన్యశాస్త్రం, చరిత్ర అంశాలతో అనుసంధించి సృజనాత్మక ఉత్పత్తులను రూపొందించడం ద్వారా భారతీయ బొమ్మలకు ఓ ప్రత్యేకత ఉండేలా చూడనున్నారు. బొమ్మల భాండాగారాలు, ప్రదర్శన- ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తారు. యాంత్రిక, ఎలెక్ట్రానిక్‌ బొమ్మల తయారీని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూనే పునర్వినియోగ సామగ్రితో రూపొందించే వాటికి పెద్దపీట వేస్తారు. వార్షిక టాయ్‌ఫెయిర్ల నిర్వహణ నుంచి పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాల వరకు విభిన్న ఆలోచనలను ప్రతిపాదించిన ఈ ప్రణాళిక విజయవంతమైతే దేశీయ ఆటబొమ్మల పరిశ్రమ అభివృద్ధికి ఆకాశమే హద్దవుతుంది.

నాణ్యతా పరీక్షలు

ఇటీవల భారత నాణ్యతా సమాఖ్య(క్యూసీఐ) చేపట్టిన పరీక్షల్లో విదేశీ బొమ్మల్లో 67 శాతం హానికరమైనవిగా తేలాయి. ముప్ఫై శాతం ప్లాస్టిక్‌ బొమ్మల్లో థలేట్స్‌ వంటి రసాయన సమ్మేళనాలు పలు వ్యాధులకు కారణమవుతాయన్నది పరిశోధకుల మాట. భారలోహాలు నిర్దేశిత పరిమాణాల కంటే చాలా ఎక్కువ మొత్తాల్లో ఉన్నాయి. ఎనభై శాతం బొమ్మలు యాంత్రిక, భౌతిక నాణ్యతా పరీక్షల్లో విఫలమయ్యాయి. సాఫ్ట్‌ టాయ్స్‌లోని 45 శాతం వాటిలో థలేట్స్‌ ఎక్కువగా ఉంటే, 75 శాతం ఎలెక్ట్రానిక్‌ బొమ్మల్లో యాంత్రిక నాణ్యత తీసికట్టుగా ఉన్నట్లు వెల్లడైంది. రసాయనాలు ఎక్కువగా ఉన్న బొమ్మల వల్ల క్యాన్సర్‌ లాంటి జబ్బులు వచ్చే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. క్యూసీఐ ఫలితాల అనంతరం స్పందించిన విదేశీ వాణిజ్య విభాగం దిగుమతయ్యే బొమ్మలకు నాణ్యతా పరీక్షలు తప్పనిసరి చేసింది. దేశీయ ఉత్పత్తులకు కూడా బీఐఎస్‌ ధ్రువపత్రం ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది.

- శైలేష్‌ నిమ్మగడ్డ

ఇదీ చూడండి:గట్టెక్కే దాకా పరిశ్రమలకు గట్టి చేయూత అవసరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.