ETV Bharat / opinion

Rape victims: అత్యాచార బాధితులకు పరిహారం ఏది?

author img

By

Published : Aug 30, 2021, 8:54 AM IST

లైంగిక, భౌతిక దాడుల్లో పరిహారం గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని సుప్రీంకోర్టు నొక్కి వక్కాణించింది. నేటికీ చాలా మందికి దీని గురించి అవగాహన ఉండటంలేదు. లైంగికదాడి(sexual assault), శారీరక హింస(physical violence against women) బాధిత మహిళలకు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిహారం అందిస్తుంది. ఠాణాలో కేసు నమోదయ్యాక తాత్కాలిక పరిహారాన్ని, ఆ తరవాత విడతల్లో మిగిలిన మొత్తాన్ని విడుదలచేస్తారు. పరిహారం కోసం బాధితులు ఎఫ్‌ఐఆర్‌ కాపీని జతపరచి మహిళా శిశు సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి.

rape victims
అత్యాచార బాధితులు

లైంగిక దాడి(sexual assault), శారీరక హింసకు(physical violence against women) గురై తీవ్ర ఆవేదనలో కూరుకుపోయిన బాధితులకు న్యాయబద్ధంగా అందాల్సిన పరిహారమూ దక్కడంలేదు. మైనర్‌ అత్యాచార బాధితుల్లో 99శాతానికి పరిహారం ఎండమావే అవుతోంది. ఈ విషయమై గతంలో సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. లైంగిక దాడి బాధితులకు పరిహారం అందించే విషయమై జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం 2018లో సూచించింది. ఆ మేరకు ఏర్పాటైన కమిటీ లైంగిక దాడులు, ఇతర నేరాల్లో బాధిత మహిళలకు అందించాల్సిన పరిహారాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ప్రాణాలు కోల్పోవడం, గ్యాంగ్‌రేప్‌ వంటి ఘటనల్లో అయిదు లక్షల రూపాయల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం అందించాలి.

అత్యాచారం, అసహజ లైంగిక దాడి బాధితులకు నాలుగు లక్షల రూపాయల నుంచి ఏడు లక్షల రూపాయలు, దాడిలో ఎనభైశాతం అంగవైకల్యం ఏర్పడితే రెండు లక్షల రూపాయల నుంచి అయిదు లక్షల రూపాయలు, యాసిడ్‌ దాడి తీవ్రతనుబట్టి మూడు లక్షల రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు పరిహారం దక్కాలి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ మేరకు తమ పరిహార విధానాన్ని సవరించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు జారీచేసింది. మైనర్‌ అత్యాచార బాధితుల విషయంలో 'లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం (పోక్సో)-2012'(Pocso act-2012) ఎలాంటి పరిహారాన్ని పేర్కొనలేదు. నల్సా సూచించిన పరిహారాన్నే ఈ కేసులకూ వర్తింపజేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

అవగాహన లేమి..

లైంగిక, భౌతిక దాడుల్లో పరిహారం గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని సుప్రీంకోర్టు నొక్కి వక్కాణించింది. నేటికీ చాలా మందికి దీని గురించి అవగాహన ఉండటంలేదు. లైంగికదాడి, శారీరక హింస బాధిత మహిళలకు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిహారం అందిస్తుంది. ఠాణాలో కేసు నమోదయ్యాక తాత్కాలిక పరిహారాన్ని, ఆ తరవాత విడతల్లో మిగిలిన మొత్తాన్ని విడుదలచేస్తారు. పరిహారం కోసం బాధితులు ఎఫ్‌ఐఆర్‌ కాపీని జతపరచి మహిళా శిశు సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కాపీ వెంటనే ఇవ్వకపోవడంవల్ల పరిహారం అందడంలేదు. కుటుంబ సభ్యుడే లైంగిక దాడి జరిపిన సందర్భంలో చాలా కేసుల్లో రాజీలు జరిగిపోతున్నాయి. ఇలాంటప్పుడు బాధితులకు రిక్తహస్తాలు తప్పడంలేదు. దేశంలో 2020 అక్టోబర్‌ నాటికి 1273 యాసిడ్‌ దాడి బాధితుల్లో 799 మందికి పరిహారం దక్కలేదని గతంలో జాతీయ మహిళా కమిషన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. పోక్సో చట్టం ప్రకారం కేసు విచారణను ఏడాదిలోగా ముగించాలి. ఇరవై శాతం కేసుల్లో ఇది జరగడంలేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మైనర్‌ అత్యాచార బాధితుల సంరక్షణ, భద్రత కోసం బాలల రక్షణ సేవలు (సీపీఎస్‌) పథకాన్ని కేంద్రం తెచ్చింది. దీని కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇదీ సరిగ్గా అమలు జరగడంలేదు. మరోవైపు పెండింగ్‌ పోక్సో కేసుల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది.

పోక్సో చట్టం ప్రకారం..

పోక్సో చట్టం కింద 2019లో దేశంలో 47,335 కేసులు నమోదు కాగా, 6994 మందికి శిక్ష పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆ ఏడాది చివరి నాటికి 1,33,068 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2018లో 39,827 కేసులు నమోదయ్యాయి. 5297 మందికి శిక్ష విధించారు. ఆ సంవత్సరం చివరి నాటికి పెండింగులో ఉన్న కేసులు 1,08,129. తెలంగాణలో 2019లో పోక్సో చట్టం కింద 1998 కేసులు నమోదైతే, 108 మందికి శిక్ష పడింది. ఆ ఏడాది చివరి నాటికి 3806 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో 502 కేసులు నమోదయ్యాయి. 20 మందికి శిక్ష విధించారు. 1542 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పోక్సో కేసుల పరంగా ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు ముందు వరసలో ఉన్నాయి. మరోవైపు నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినా దేశంలో మహిళలపై అకృత్యాలు ఆగడంలేదు.

మొత్తం నేరాల్లో..

భారత్‌లో 2019లో రోజుకు 87 అత్యాచార కేసులు నమోదయ్యాయి. మహిళలపై మొత్తం నేరాల్లో ఇవి దాదాపు 7.3శాతం. ఆ ఏడాది మహిళలపై నేరాలు నాలుగు లక్షలు దాటినట్లు జాతీయ నేర గణాంక సంస్థ లెక్కలు చెబుతున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే (3.78 లక్షల కేసులు) ఇది ఏడు శాతం అధికం. అత్యాచార బాధితులకు తప్పనిసరిగా పరిహారం అందించడంతో పాటు, మహిళల భద్రత దృష్ట్యా చట్టాలను మరింత పదునుతేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

- ఎం.అక్షర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.