ETV Bharat / opinion

సుప్రీంకోర్టు కొలీజియం చొరవ- న్యాయవ్యవస్థలో నారీశక్తి

author img

By

Published : Aug 21, 2021, 7:26 AM IST

భారత సర్వోన్నత న్యాయస్థానానికి ఒక నారీమణి నేతృత్వం వహించాలనే ఆకాంక్షలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం తాజా నిర్ణయాలు అద్దంపట్టాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తొమ్మిది మందిని సిఫార్సు చేసిన కొలీజియం- గతానికి భిన్నంగా ఒకేసారి ముగ్గురు మహిళలకు ఆ జాబితాలో చోటు కల్పించింది. అన్నీ అనుకూలిస్తే వారిలోని జస్టిస్‌ బి.వి.నాగరత్న ఆరేళ్ల తరవాత భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కొత్త చరిత్ర లిఖించే అవకాశం ఉంది.

sc collegium
సుప్రీంకోర్టు కొలిజీయం

భారత సర్వోన్నత న్యాయస్థానానికి ఒక నారీమణి నేతృత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని నాలుగు నెలల క్రితం నాటి సీజేఐ బాబ్డే వ్యాఖ్యానించారు. దేశీయంగా మహిళా న్యాయమూర్తుల సంఖ్య ద్విగుణీకృతమయ్యేలా సుప్రీంకోర్టే చొరవ తీసుకోవాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ లోగడ సూచించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం తాజా నిర్ణయాలు ఈ ఆకాంక్షలకు అద్దంపట్టాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తొమ్మిది మందిని సిఫార్సు చేసిన కొలీజియం- గతానికి భిన్నంగా ఒకేసారి ముగ్గురు మహిళలకు ఆ జాబితాలో చోటు కల్పించింది.

కొత్త చరిత్ర లిఖించే అవకాశం!

అన్నీ అనుకూలిస్తే వారిలోని జస్టిస్‌ బి.వి.నాగరత్న ఆరేళ్ల తరవాత భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కొత్త చరిత్ర లిఖించే అవకాశం ఉంది. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కోసం కొలీజియం సభ్యులు ఎంచిన ఏడుగురు న్యాయమూర్తుల్లో సైతం నలుగురు మహిళలు కావడమూ హర్షణీయం. గడచిన ఏడు దశాబ్దాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలువుతీరిన వారిలో మహిళలు కేవలం ఎనిమిది మంది! హైకోర్టులు అన్నింటిలోనూ కలిపి 78 మంది మహిళా న్యాయమూర్తులే పనిచేస్తున్నట్లు కేంద్రం నిరుడు సెప్టెంబరులో పార్లమెంటులో ప్రకటించింది. పట్నా, మేఘాలయ, మణిపూర్‌, త్రిపుర, ఉత్తరాఖండ్‌ హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తీ కనిపించరు!

భారత్​లో మాత్రం తద్భిన్నంగా..

కెనడా, న్యూజిలాండ్‌లు రెండు దశాబ్దాల క్రితమే అత్యున్నత న్యాయపాలికల్లో స్త్రీమూర్తులకు పట్టంకట్టాయి. ఇథియోపియా, సూడాన్‌, జాంబియా, యూకే, మలేసియా, కెన్యా తదితర దేశాలు ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకొన్నాయి. 66 కోట్లకు పైగా మహిళలు ఉన్న ఇండియాలో మాత్రం తద్భిన్నమైన పరిస్థితులు రాజ్యంచేస్తున్నాయి. అన్ని స్థాయుల్లో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం ఇనుమడిస్తేనే- భిన్న రంగాల్లో స్త్రీలకు సమాన అవకాశాలు లభించాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి మన్నన దక్కుతుంది. సుప్రీంకోర్టు కొలీజియం చొరవ- ఈ దిశగా గొప్ప ముందడుగు!

అదే రోజున ఎన్​డీఏ ప్రవేశ పరీక్షల్లో..

కొలీజియం సిఫార్సులు వెలువడిన రోజే జాతీయ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ) ప్రవేశ పరీక్షల్లో మహిళలకు అవకాశం కల్పించాలంటూ సర్వోన్నత న్యాయపాలిక చరిత్రాత్మక తీర్పిచ్చింది. సైన్యం, నావికాదళంలో మహిళలకు శాశ్వత కమిషన్‌పై సైతం 'సుప్రీం' లోగడ విశిష్ట ఆదేశాలిచ్చింది. ఎన్‌డీఏలో మహిళలకు ప్రవేశాలను నిరాకరించడమంటే లింగపరమైన దుర్విచక్షణను పాటించడమేనని న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ వైఖరి మారాలని గట్టిగా సూచించింది. స్త్రీలను అబలలుగా చిత్రించడమంటే వారిని అవమానించడమేనని మహాత్ముడు ఏనాడో హితవు పలికారు. మహిళలు తమ సామర్థ్యానికి తగ్గట్టుగా ఎదగడానికి సామాజిక కట్టుబాట్లే ఆటంకాలవుతున్నాయని పూర్వ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆవేదన వ్యక్తంచేశారు.

ఆ అభిప్రాయం సరైంది కాదని..

ఇంటి బాధ్యతలు, పిల్లల చదువులు తదితరాలతో చాలామంది మహిళా న్యాయవాదులు జడ్జీలుగా నియమితులు కావడానికి ఆసక్తి చూపడంలేదని జస్టిస్‌ బాబ్డే గతంలో పెదవి విరిచారు. ఆ అభిప్రాయం సరైంది కాదని, అవకాశాలు కల్పించకపోవడమే అసలు సమస్య అంటూ సీనియర్‌ మహిళా న్యాయవాదులు అప్పట్లో ప్రతిస్పందించారు. న్యాయవ్యవస్థలో స్త్రీల ప్రాతినిధ్యం పెరిగితే- లైంగిక హింసపై నమోదయ్యే కేసులను మరింత మెరుగ్గా పరిష్కరించడానికి అవకాశముంటుందని అటార్నీ జనరల్‌ అభిప్రాయపడ్డారు. ఆ మేరకు మహిళలకు సమధిక ప్రాధాన్యం కల్పిస్తూ న్యాయస్థానాల్లో భారీగా పేరుకుపోయిన ఖాళీలను త్వరితగతిన భర్తీచేయాలి. రక్షణ రంగంలోనూ ఇప్పుడిప్పుడే సత్తా చాటుతున్న నారీశక్తికి ఇతోధికంగా అండదండలు అందించాలి. అప్పుడే మహిళా సాధికారత, లింగ దుర్విచక్షణ లేని సమాజం సాకారమవుతాయి!

ఇదీ చూడండి: 'సుప్రీం' జడ్జిలుగా తొమ్మిది మంది న్యాయమూర్తుల పేర్లు సిఫారసు

ఇదీ చూడండి: New Judges: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.