ETV Bharat / opinion

కర్ణాటక నేర్పిన పాఠం- '75ఏళ్ల రూల్' బ్రేక్- ఎంపీలో బీజేపీ భారమంతా వృద్ధనేతలపైనే!

author img

By PTI

Published : Nov 13, 2023, 3:09 PM IST

Updated : Nov 13, 2023, 3:16 PM IST

bjp age limit for election
bjp age limit for election

BJP Age Limit For Election : ఎన్నికల బరిలో ఏడుగురు ఎంపీలు, ముగ్గురు కేంద్ర మంత్రులు, ఓ జనరల్ సెక్రెటరీ.. ఓవైపు ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు.. మరోవైపు రాష్ట్ర నేతల ప్రచారాలు.. మధ్యప్రదేశ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) బలమైన సంస్థాగత యంత్రాంగాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తోంది. అదేసమయంలో తాను పెట్టుకున్న ఓ నిబంధనను సైతం పక్కనబెట్టింది. అదేంటంటే?

  • 70 ఏళ్లకు పైబడిన 14 మందికి టికెట్
  • 80 ఏళ్ల వయసున్న నాయకుడికీ అవకాశం
  • వయసుతో సంబంధం లేకుండా గెలుపు గుర్రాలకే పెద్ద పీట

మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అనుసరిస్తున్న వ్యూహమిది! కర్ణాటక ఎన్నికల్లో ప్రయోగం విఫలమైన నేపథ్యంలో ఈసారి తన పంథాను మార్చుకొని సీనియర్లను రంగంలోకి దించింది. ఎట్టిపరిస్థితుల్లోనైనా మధ్యప్రదేశ్​లో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఏకైక లక్ష్యంతో పని చేస్తున్న బీజేపీ.. ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదని భావిస్తోంది.

BJP Age Limit For Election : సాధారణంగా తర్వాతి తరం నేతలను ప్రోత్సహిస్తుంటుంది బీజేపీ. కానీ, తన పద్ధతికి భిన్నంగా ఈసారి తలపండిన సీనియర్లను నమ్ముకుంది. 70 ఏళ్లు దాటిన నేతలను ఏకంగా 14 మందిని బరిలో దించింది. అందులో ఓ నాయకుడి వయసైతే 80 ఏళ్లు. కొత్త నాయకుల కంటే.. గెలిచేవారికే పట్టం కట్టాలన్న ఉద్దేశంతో ఈ మేరకు వృద్ధనేతలకు అవకాశం ఇస్తోంది కమలం పార్టీ.

సత్నా జిల్లా నాగోద్ నియోజకవర్గం నుంచి నాగేంద్ర సింగ్ నాగోద్(80)ను బరిలోకి దింపిన బీజేపీ.. రీవా జిల్లా గూఢ్​ స్థానం నుంచి నాగేంద్ర సింగ్(79)ను పోటీ చేయిస్తోంది. దామోహ్ నుంచి జయంత్ మాలవీయ(76), చందేరీ నుంచి జగన్నాథ్ సింగ్ రఘువంశీ(75), హోశంగాబాద్ నుంచి సీతాశరణ్ శర్మ(73), అనుప్పుర్ నుంచి బిసాహులాల్ సింగ్, గ్వాలియర్-తూర్పు నుంచి మాయా సింగ్​(73)ను రంగంలోకి దించింది. గూఢ్ స్థానంలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఆప్ తరఫున ప్రఖార్ ప్రతాప్ సింగ్ అనే 25 ఏళ్ల అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఉద్యోగం వదిలి అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆయన.. 79 ఏళ్ల నాగేంద్ర సింగ్​ను ఢీకొంటున్నారు. రాష్ట్రంలోనే యువ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

"నాగేంద్ర సింగ్ నాగోద్, నాగేంద్ర సింగ్​ ప్రస్తుతం సిట్టింగ్​ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో పోటీ చేయబోమని ఐదు నెలల క్రితం వారు ప్రకటించారు. కానీ, ఇప్పుడు వారికే టికెట్లు దక్కాయి" అని రాజకీయ పండితులు గుర్తు చేస్తున్నారు.

యువకులకు ఛాన్స్ ఇచ్చి.. దెబ్బ తిని..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక మంది సీనియర్లను తప్పించింది బీజేపీ. మాజీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి స్థాయి సీనియర్ నాయకులను సైతం పక్కనబెట్టింది. మాజీ సీఎం జగదీశ్ శెట్టర్(67), మాజీ డిప్యూటీ సీఎం కేఎస్ ఈశ్వరప్ప(75) వంటి నాయకులను కాదని.. వారి స్థానాల్లో యువకులకు అవకాశం ఇచ్చింది. కానీ, అక్కడ ఆశాజనక ఫలితాలు రాలేదు. అంతేకాకుండా, మధ్యప్రదేశ్ గత ఎన్నికల్లోనూ టికెట్ రాని సీనియర్ నాయకులు బీజేపీని గట్టిగా దెబ్బ కొట్టారు. ఈసారి అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా జాగ్రత్త పడుతోంది కాషాయదళం.

"ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఫలితాల ఆధారంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. గత ఎన్నికల్లో రామకృష్ణ కుసుమారియా(81)కు బీజేపీ టికెట్ కేటాయించలేదు. దామోహ్, పథ్​రియా స్థానాల నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఫలితంగా బుందేల్​ఖండ్ ప్రాంతంలో బీజేపీ ఓట్లకు గండిపడినట్లైంది. దామోహ్​, పథ్​రియాలో రామకృష్ణ వరుసగా.. 1133, 13,000 ఓట్లు సాధించారు. ఆ రెండు స్థానాలను బీజేపీ స్వల్ప తేడాతో చేజార్చుకుంది. దామోహ్​లో 798 ఓట్ల తేడాతో కాంగ్రెస్​ గెలవగా.. 2,205 ఓట్ల తేడాతో పథ్​రియాను బీఎస్​పీ కైవసం చేసుకుంది. రామకృష్ణ తిరిగి బీజేపీలో చేరారు. ఈసారి బీజేపీ ముందుగానే జాగ్రత్తపడింది. బుందేల్​ఖండ్​లో మరోసారి ఆయన ప్లేట్ ఫిరాయించకుండా ఎన్నికలకు ముందు ఆయన్ను రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్​గా నియమించింది."

-జైరాం శుక్లా, రాజకీయ విశ్లేషకులు, చరవతి మంత్లీ మేగజీన్ మాజీ సంపాదకులు

2020 ఫిబ్రవరిలో వీడీ శర్మ(50)ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది బీజేపీ అధిష్ఠానం. అప్పటి నుంచి యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. జిల్లా అధ్యక్షులుగానూ అనేక మంది యువకులకే బాధ్యతలు అప్పగించింది. అయితే, ఈ పరిణామాలు పార్టీలోని సీనియర్లకు మింగుడు పడలేదని శుక్లా వివరించారు. జూనియర్ నేతలు ఏర్పాటు చేసిన పార్టీ సమావేశాలకు కూడా రావడం మానేశారని తెలిపారు.

సీనియర్లకు టికెట్లు ఇవ్వడంపై అనేక మంది రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 75 ఏళ్లు దాటినవారికి టికెట్లు ఇవ్వకూడదని 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఈ నిర్ణయం వల్ల.. సీనియర్ నేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలు ఎన్నికలకు దూరమయ్యారు. "అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సీనియర్ నేతలపైనే బీజేపీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. రాజకీయంగా తనకు పరిస్థితులను అనుకూలంగా ఉంచుకోవాలని భావిస్తోంది" అని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు రాకేశ్ దీక్షిత్ తెలిపారు.

అయితే, 75 ఏళ్లు దాటిన వారికి టికెట్లు ఇవ్వమని బీజేపీ ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదని మరో రాజకీయ పరిశీలకులు గిరిజా శంకర్ చెప్పుకొచ్చారు. 'వయసు విషయంలో బీజేపీ ఎప్పుడూ అధికారికంగా నిబంధన పెట్టుకోలేదు. రాజకీయ పార్టీకి ఎప్పుడైనా విజయావకాశాలే ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొనే టికెట్లు ఇస్తుంటాయి. రాజకీయ పార్టీలు ప్రయోగాలు చేస్తూనే వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటాయి' అని శంకర్ వివరించారు.

ఈసారి ఎన్నికల్లో సీనియర్లతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలను సైతం రంగంలోకి దించింది బీజేపీ. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లద్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్థేతో పాటు, జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గియాను సైతం అసెంబ్లీ బరిలో నిలిపింది. మొత్తం ఏడుగురు ఎంపీలు అసెంబ్లీ బరిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా రాష్ట్ర నేతలు సైతం ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.

9 మంది వెటరన్​లకు కాంగ్రెస్ టికెట్లు
సాధారణంగా వయోవృద్ధుల పార్టీ అంటూ బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కొనే కాంగ్రెస్ మాత్రం.. 70 ఏళ్లు పైబడిన వారిలో 9 మందికి మాత్రమే టికెట్లు ఇచ్చింది. 77 ఏళ్ల నరేంద్ర నహతా(77)ను మానస(నీముచ్ జిల్లా) నుంచి బరిలో ఉంచింది. ఛింద్వాడా నుంచి కమల్​నాథ్(76), బద్నావర్ నుంచి భన్వర్ సింగ్ షెకావత్(73), అమర్​పాటన్ నుంచి రాజేంద్ర కుమార్ సింగ్(73), హోశంగాబాద్ నుంచి గిరిజాశంకర్ శర్మ(73), లాహర్ నుంచి గోవింద్ సింగ్(72), కోలారస్ నుంచి బైజ్​నాథ్ సింగ్ యాదవ్(72)ను రంగంలోకి దించింది. 71 ఏళ్ల వయసున్న సజ్జన్ సింగ్ వర్మ, సుభాష్ సజోతియాను వరుసగా సోన్​కచ్, గరోఠ్ స్థానాల నుంచి పోటీ చేయిస్తోంది.

Madhya Pradesh Assembly Election 2023 : కమల్​నాథ్ కంచుకోటలో పాగాకు బీజేపీ ప్లాన్​.. దేవుని విగ్రహాల చుట్టూ రాజకీయం!

MP Election Vindhya Region : ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్​.. బీజేపీ-కాంగ్రెస్​ 'ఢీ'.. వింధ్యలో విజయం ఎవరిదో?

Last Updated :Nov 13, 2023, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.