ETV Bharat / opinion

బైడెన్​ గెలిస్తే భారత్​- అమెరికా మైత్రి భద్రమేనా?

author img

By

Published : Aug 9, 2020, 5:45 PM IST

A Biden White House unlikely to roll back US policies on India, China: Experts
బిడెన్​ అధ్యక్షుడైతే భారత్​-అమెరికా బంధం సురక్షితమేనా!

ప్రపంచం మొత్తం కరోనాతో ఇబ్బందులు పడుతుంటే అమెరికాను మాత్రం మరో సమస్య వేధిస్తోంది. అదే 2020 అధ్యక్ష ఎన్నికలు. ట్రంప్​ మరోసారి బాధ్యతలు చేపడతారా? లేదంటే బైడెన్​ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి సమయంలో అగ్రరాజ్యం ఎన్నికలు భారత్​కు కీలకంగా మారాయి. అదెలాగో ఓసారి చూద్దాం.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్​ మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. ఇప్పటికే ట్రంప్​ అధ్యక్షతన అమెరికా​- మోదీ సారథ్యంలోని భారత్​ మధ్య సత్సంబంధాలు ఎన్నడూ లేనంతగా పుంజుకున్నాయి. ట్రంప్​ మరోసారి అధ్యక్షుడైతే ఆ బంధానికి సమస్య లేదు. కానీ బైడెన్​ అధ్యక్షుడైతే పరిస్థితి ఏంటి? ఇరుదేశాల మధ్య ఇదే సాన్నిహిత్యం కొనసాగుతుందా? ముగిసిపోతుందా? అనేది సందిగ్ధంగా మారింది.

బైడెన్​దే గెలుపు!

పలు సర్వేల ప్రకారం చూస్తే.. ఈసారి అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్​ అభ్యర్థి జో బైడెన్​ ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనాన్సియల్​ టైమ్స్​ పోల్​ ట్రాకర్​ విడుదల చేసిన నివేదిక ప్రకారం జో బైడెన్ 538 సీట్లలో​ 308 సీట్లు కైవసం చేసుకోవచ్చు. ట్రంప్​కు​ కేవలం 113 సీట్లు వస్తాయి. 538 సీట్లలో 270 సీట్లు సంపాదిస్తే ఆ వ్యక్తి అధ్యక్షుడు అయినట్లే.

అమెరికన్​ యూనివర్సిటీలోని ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్​ అయిన్​ అలన్​ లిచ్​మెన్ కూడా బైడెన్​ గెలుస్తారనే జోస్యం చెప్పారు. తను రూపొందించిన కీస్​ మోడల్​ ఆధారంగా 13 చారిత్రక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫలితాలు అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. గత నాలుగు దశాబ్దాలుగా లిచ్​మెన్​ అధ్యక్ష ఎన్నికల గురించి దాదాపు కచ్చితమైన వివరాలు చెప్తున్నారు.

కరోనా నియంత్రణలో విఫలమవడం వల్లే ట్రంప్​పై వ్యతిరేకత ఎక్కువైనట్లు పలు నివేదికలు తెలిపాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోస్టల్​ ఓటింగ్​ పెడితే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని.. ఫలితంగా ఎన్నికలను వాయిదా వేయాలని ట్రంప్​ అభిప్రాయపడటం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

అదే బాటలో...!

ప్రస్తుతం వాషింగ్టన్​, బీజింగ్​ మధ్య వాణిణ్య యుద్ధం​ జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో కొత్త అధ్యక్షుడు వచ్చాక.. భారత్​-అమెరికా మధ్య సత్సంబంధాలు ఎలా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు బైడెన్​ ఆధ్వర్యంలోని కొత్త వైట్​హౌస్ ఈ అంశంలో ట్రంప్​ అడుగుజాడల్లోనే నడుస్తుందని, భారత్​తో సత్సంబంధాల విషయంలో వెనక్కితగ్గదని పరిశీలకులు భావిస్తున్నారు.

చైనా అధ్యక్షుడిగా జిన్​పింగ్​ బాధ్యతలు చేపట్టాక ప్రపంచ నంబర్​ వన్​గా ఎదగాలన్న ఆ దేశ ఆశయాన్ని అమెరికా ​అడ్డుకుంది. ఫలితంగా ఆ దేశానికి దీటైన భారత్​తో రెండు దశాబ్దాలుగా మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలను నెరుపుతోంది అగ్రరాజ్యం. బైడెన్​ ఎన్నికైతే దక్షిణ చైనా సముద్రంలో వివాదం కారణంగా చైనాతో వాణిజ్య యుద్ధం​, ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నిలువరించడంలో ట్రంప్​ పాటిస్తున్న విధానాలనే అమలు చేస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అతిపెద్ద రక్షణ భాగస్వామి​...

భారత్​, అమెరికా కలిసి అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాల్లో పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ఈ బంధం ఏర్పడింది. అందుకే వాషింగ్టన్​ కూడా భారత్​ను అతిపెద్ద రక్షణ భాగస్వామిగా ఎంచుకుంది. రక్షణ, దౌత్య సంబంధాల్లోనూ దిల్లీతో చాలా సాన్నిహిత్యంగా ఉంది అమెరికా.

"బైడెన్​ అధికారంలోకి వస్తే భారత్​-అమెరికా మధ్య సంబంధాలు అలాగే కొనసాగుతాయి. ప్రజల్లోనూ ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు అంత బలంగా ఉన్నాయి. అయితే అవి మరింత పుంజుకోవచ్చు. అయితే బైడెన్​ వచ్చాక ఆ సంబంధాలు ఎంత వేగంగా, ఎంత పురోగతితో పయనిస్తాయి అనేది కీలకం. ఎన్నికలు​ అనేవి యూఎస్​ కాంగ్రెస్​లోని ఎగువ, దిగువ సభకు ఉంటాయి. ప్రస్తుతం దిగువ సభలో డెమొక్రాట్లు ఆధిపత్యం చెలాయిస్తే, సెనేట్​లో రిపబ్లికన్​ ఆధిపత్యం ఉంది. ఒకవేళ సెనేట్​లోనూ డెమొక్రాట్లు మెజారిటీ సాధించి.. బైడెన్​ అధికారంలో ఉంటే భారత్​-అమెరికా బంధం గతంలోలా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది డెమొక్రాట్లకు భారత్​తో సమస్యలున్నాయి".

- రాబిన్​ సచ్​దేవ్, యూఎస్-ఇండియా పొలిటికల్​ యాక్షన్​ కమిటీ ఫౌండర్​ మెంబర్​

చైనాపై అమెరికా తీరు...

వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్​-అమెరికా చూస్తున్నాయి. 2019లో రెండు దేశాల మధ్య వస్తు, సేవల వాణిజ్యం విలువ 149 బిలియన్​ డాలర్లను అందుకుంది. యూఎస్ ఇంధన ఎగుమతులు వాణిజ్య సంబంధంలో వృద్ధికి మరింత కీలకం. అయితే బైడెన్​ అధ్యక్షుడయ్యాక చైనాతో అగ్రరాజ్యం సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.

"చైనా వుహాన్‌లో ఉద్భవించిన కొవిడ్-19 మహమ్మారి అమెరికాను ఇబ్బందులకు గురిచేసింది. ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. కాబట్టి బైడెన్ చైనాపై ట్రంప్​ సర్కార్ వైఖరిని కొనసాగించాల్సిందే. అంతేకాదు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్.. చైనాపై సుంకాలు, ఇతర వాణిజ్య ఆంక్షలు విధించడం వల్ల ఇరుదేశాల మధ్య ఆర్థిక వివాదాలు కొనసాగుతున్నాయి. వాణిజ్య లోటు పెరుగుదల, మేథో సంపత్తి దొంగతనం, అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనాకు బలవంతంగా బదిలీ చేయడం వంటి అంశాలపై ఇప్పటికే చైనాపై అగ్రరాజ్యం మండిపడుతోంది. వ్యూహాత్మకంగా పెద్ద సవాలుగా చైనా మారడం వల్ల బైడెన్​ బీజింగ్​పై తన వైఖరిని మార్చుకోలేరు. మహమ్మారి సమయంలోనూ చైనా నిర్ణయాల వల్ల అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది."

-- పినాక్ రంజన్ చక్రవర్తి, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి

మరో కారణం...

ఇండో-పసిఫిక్​ రీజియన్​లో బీజింగ్​ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. జపాన్​ తూర్పు తీరం నుంచి ఆఫ్రికా తూర్పు తీరం వరకు తన ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది చైనా. ఇది కూడా అమెరికా-చైనా బంధాన్ని దెబ్బకొట్టొచ్చు. అమెరికాతో కలిసి భారత్​, జపాన్​, ఆస్ట్రేలియా ఈ ప్రాంతంలో శాంతి, ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అలాగే దక్షిణ చైనా సముద్రంలో అనేక దేశాలతో ప్రాదేశిక వివాదాలు పెట్టుకుంటున్న చైనా తీరుపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

2017లో విడుదలైన యూఎస్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో.. చైనాను 'రివిజనిస్ట్ శక్తి'గా అభివర్ణించారు. ట్రంప్​ కూడా దక్షిణ చైనా సముద్రంపై వాషింగ్టన్ విధానాన్ని మార్చారు. ప్రస్తుతం యూఎన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ (యూఎన్‌క్లోస్)కు భారత్​, జపాన్, ఆస్ట్రేలియా మద్దతివ్వడంపై చైనా నిరసన తెలుపుతోంది.

దూకుడు యథావిధిగా..?

చైనా సహా ప్రపంచ భౌగోళిక రాజకీయాలపై ఇప్పటివరకు ట్రంప్ దూకుడుగానే వ్యవహరించారు.

"నవంబర్​లోగా ప్రపంచ భౌగోళిక రాజకీయాలు మారిపోతాయి. ఎందుకంటే ఒక మార్గంలోకి వెళ్లిన తర్వాత కొన్ని విషయాల్లో వెనకడుగు వేయలేం. ఏ అధ్యక్షుడు వచ్చినా, అది ట్రంప్ లేదా బైడెన్ అయినా విస్తృత కోణంలో వాళ్లు చైనా వ్యతిరేక విధానాన్ని కొనసాగిస్తారు. 2050 లేదా 2060 నాటికి చైనా ప్రపంచ ఆర్థిక, సాంకేతిక శక్తిగా మారాలని భావిస్తోంది. అయితే వాషింగ్టన్ ఎప్పట్నుంచో చైనా సూపర్ పవర్‌గా ఎదగడాన్ని ఆలస్యం చేసే ప్రయత్నాలు చేస్తోంది" అని సచ్​దేవ్ వెల్లడించారు.

ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం వచ్చినా ట్రంప్​ మార్గంలోనే కొనసాగాలి. ఎందుకంటే చైనా నంబర్​ వన్​ కావడాన్ని అగ్రరాజ్యం ఎప్పటికీ అంగీకరించదు.

(-అరూనిమ్​ భూయాన్​)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.