ETV Bharat / lifestyle

చేయూత ఇచ్చింది.. చేయందుకున్నాను!

author img

By

Published : Mar 27, 2021, 1:28 PM IST

ఇంటర్​తో చదువు మానేసి బట్టలకొట్టులో పనిచేస్తున్న నేను ఇప్పుడు ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో టీంలీడర్ కావడానికి కారణం మాధురి. ఆమె ఇచ్చిన ప్రోత్సాహం.. చూపిన ప్రేమ.. చేసిన సాయం నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. మూడేళ్ల కిందట తను పెళ్లిచేసుకోమని అడిగినప్పుడు.. తన స్థాయికి నేనూ తగినవాడిని కాదని తిరస్కరించాను. నేడు అకస్మాత్తుగా నా కళ్లెదుట కనిపించింది.

love, manasulo maata
మనసులో మాట, ప్రేమ మాధుర్యం

నాంపల్లి నుమాయిష్‌ నుంచి బయటికొస్తున్నా. ‘హేయ్‌ రవీ.. ఇటు చూడోసారి’ అనే పిలుపు. మూడేళ్ల కిందట నా గుండెను వదిలి వెళ్లిన గొంతు. రోజూ గుర్తు చేసుకునే రూపం. గిల్లి చూసుకున్నా. ఔను.. తను మాధురీనే. బయటికొచ్చి కాసేపు మాట్లాడుకున్నాం. ‘వారం రోజులుంటా. వీలైతే కలుద్దాం.. బై’ చెబుతూ వెళ్లింది.

నేను ఐటీ కంపెనీలో టీం లీడర్‌ని. సమాజంలో గౌరవం. ఇదంతా మాధురి చలవే. ఆలోచనలు గతంలోకి వెళ్లాయి. మాది వరంగల్‌ దగ్గర పల్లెటూరు. ఇంటర్‌తో చదువాపి ఓ బట్టల కొట్టులో గుమాస్తాగా చేరా. సీతాకోక చిలకల్లా అమ్మాయిలంతా మా పక్కనుండే కాలేజీకొస్తుండేవాళ్లు. చుడీదార్‌లు.. హాఫ్‌ శారీలు.. కొందరు జీన్స్‌లో. వాళ్లలో మాధురి నన్నాకట్టుకుంది. మరీ అందగత్తేం కాదుగానీ ఆకర్షించే రూపం. తొమ్మిది కాగానే నా కళ్లు తనకోసం వెతికేవి. ఏడాది చూపులతోనే గడిచిపోయింది. ఆరోజు వేలంటైన్స్‌ డే. నాకు బాగా గుర్తుంది. రోడ్డుమీద వెళ్తూ ఎందుకనో ఓసారి తలెత్తి నావైపే చూసింది. కళ్లతోనే నవ్వింది. అది మొదలు. చూపులతోనే రోజూ ‘హాయ్‌’ చెప్పేది. నా గుండె తనకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చేది.

మరో ఏడాది కరిగింది. ఆరోజు నేరుగా నా దగ్గరికొచ్చింది. ‘నీతో మాట్లాడాలని ఉంది. ఈ ఆదివారం కలుద్దామా?’ అంది. నేను షాక్‌. తేరుకోగానే మనసు మబ్బుల్లో తేలిపోయింది. టిప్‌టాప్‌గా తయారై వెళ్లా. కొన్ని కబుర్లు చెప్పుకున్నాక ‘రేపట్నుంచి నాకు ఎగ్జామ్స్‌. అవి పూర్తైతే బహుశా మళ్లీ నీకు కనపడనేమో’ అంది. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘నీ గురించి నాకు తెలుసు. కుటుంబం కోసం చదువు మానేశావు. అక్క పెళ్లి కోసం పనిలో చేరావు. నీ కేరక్టర్‌ నాకు నచ్చింది. నువ్వంటే నాకిష్టం’ అంటుంటే.. సంతోషాల వరదనయ్యా. చెప్పినట్టే తర్వాత కనపడలేదు. సిటీలో బీటెక్‌లో చేరానంది. అప్పుడప్పుడు ఫోన్‌ చేసేది. ఊరొచ్చినప్పుడు కలిసేది. అంతేకాదు.. పట్టుపట్టి నాతో ప్రైవేటుగా డిగ్రీ కట్టించింది. ఖర్చుల కోసమని డబ్బులిచ్చేది. తన నమ్మకాన్ని నిలబెట్టాలని పొద్దంతా షాపులో పని చేస్తూనే రాత్రుళ్లు కష్టపడి చదివేవాణ్ని.

దసరా పండక్కి మా ప్లేస్‌లో కలుసుకున్నాం. పిచ్చాపాటీ ముచ్చట్లయ్యాక ‘రవీ.. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అనడిగింది. నాకు నోట మాట రాలేదు. నిజానికి నేను ఎగిరి గంతులేసే క్షణం అది. కానీ ఒక్కసారిగా నా నేపథ్యం కళ్లముందు మెదిలింది. వాళ్లు ధనవంతులు. నన్ను పెళ్లాడితే తనూ పస్తులతో సావాసం చేయాలి. ‘మధూ.. నువ్వంటే గుండెల్నిండా ప్రేమ ఉంది. నువ్వు నా సొంతం కావాలనే ఆశ ఉంది. కానీ నీతో ఏడడుగులు నడిచే అర్హత నాకు లేదనిపిస్తోంది’ అంటూ కన్నీళ్లాపుకుంటూ తిరిగొచ్చేశా.

డిగ్రీ పూర్తవగానే సిటీకొచ్చా. పార్ట్‌టైం పనులు చేస్తూ సాఫ్ట్‌వేర్‌ కోర్సు నేర్చుకొని ఉద్యోగంలో సెటిలయ్యా. ఇదిగో.. ఇన్నాళ్లకి తను కనిపించింది. ఈసారి నేనే ఫోన్‌ చేసి కలుద్దాం రమ్మన్నా. మనసు విప్పా. ‘మధూ.. అప్పుడు నిన్ను పోషించే స్తోమత లేదు. సొంత నిర్ణయం తీసుకునే ధైర్యమూ లేదు. ఇప్పుడు రెండూ ఉన్నాయి. నీ చేయి అందుకునే అవకాశం ఇస్తావా?’ అన్నా. ‘ఇస్తా.. మా ఆయన ఒప్పుకుంటే’ అంది. నా గుండె ముక్కలైంది. మౌనంగా ఉండిపోయా. ‘జోక్‌ చేశాను బాబూ. నాకేం పెళ్లవలేదు. ఇలాంటి రోజొస్తుందని తెలుసు. అందుకేగా ఇంట్లోవాళ్లు బలవంతం చేసినా ఏడాదిగా పెళ్లి మాట వాయిదా వేస్తున్నా’ అనడంతో తనని అమాంతం ఎత్తుకొని గిరగిరా తిప్పా. పెద్దల్ని ఒప్పించడం పెద్ద కష్టమేం కాలేదు. అలా నా జీవితాన్ని నిలబెట్టిన అమ్మాయే నా జీవిత భాగస్వామి అయ్యింది. ఈమధ్యే మా మొదటి పెళ్లిరోజు కూడా జరుపుకున్నాం. రోజులు గడుస్తున్నకొద్దీ మా ప్రేమలో మాధుర్యం పెరుగుతూనే ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.