ETV Bharat / lifestyle

parenting tips: చిన్నారుల వికాసానికి పంచసూత్రాలు..!

author img

By

Published : Jun 21, 2021, 3:15 PM IST

పిల్లలకు ఏ లోటు లేకుండా చూస్తున్నాం.. అడిగిందల్లా కొనిస్తున్నాం.. మంచి పాఠశాలల్లో చదువు చెప్పిస్తున్నాం… ఇంతటితో మా బాధ్యత తీరిపోయిందని అనుకుంటారు చాలా మంది తల్లిదండ్రులు. పిల్లల అవసరాలతో పాటు వారిని మంచి వ్యక్తులుగా తీర్చి దిద్దే బాధ్యత కన్నవాళ్లదేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. వారిని అన్ని రకాలుగా తీర్చిదిద్దాలని అంటున్నారు. అందుకు పంచసూత్రాలను సూచించారు. అవేంటో తెలుసుకుందామా?

parenting tips, Psychiatrist References for kids
పిల్లల పెంపకం, మానసిక నిపుణులు

పిల్లల అవసరాలను తీర్చడం, వారికి చదువు చెప్పించడంతో అమ్మానాన్నల బాధ్యత తీరిపోదంటున్నారు మానసిక నిపుణులు. వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. అందుకు ఈ సూత్రాలను పాఠాలుగా చెప్పమంటున్నారు. అవేంటో చూద్దాం రండి...

1 డబ్బు నిర్వహణ : పిల్లలకు అడిగినవీ, అడగనివీ... అన్నీ కొనివ్వడం వారి మీద ఉన్న ప్రేమ అనుకుంటున్నారు చాలామంది. అలా చేస్తే వారికి డబ్బు విలువ, దాని నిర్వహణ తెలియదు. రూపాయి సంపాదించాలన్నా... ఎంతో కష్టపడాలన్న విషయం వారికి అర్థమయ్యేలా చేయాలి. అంతేకాదు.. ఇంటి ఖర్చులను వారితో రాయించండి. అవసరాలు, సౌకర్యాలు, విలాసాల మధ్య తేడా అర్థమయ్యేలా చేయండి. అప్పుడే వారు అనసవర ఖర్చులవైపు అడుగులేయరు.

2 కథలు చెప్పండి: మీ భార్యాభర్తలిద్దరూ రోజంతా ఎంత తీరిక లేకుండా గడిపేసినా... రాత్రి మాత్రం వారితో గడపండి. ముఖ్యంగా నిద్రకు ముందు పిల్లల్లో ఆలోచనా శక్తిని, స్ఫూర్తిని అందించే కథలను ఆసక్తికరంగా చెప్పండి. ఓ మంచి విషయాన్ని చర్చించండి. ఓ గొప్ప వ్యక్తి గురించి మాట్లాడండి. ఇవన్నీ వారి భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపిస్తాయి.

3 సమయపాలన : చేయాల్సిన ప్రతిపనీ ఎవరో ఒకరు చెప్పాల్సిన అవసరం లేకుండా... వారి దినచర్యను వారు పాటించేలా చేయాలి. ఇందుకోసం వారి సమయాల్ని నిర్దేశించాలి. కొన్నాళ్లు మీరు నేర్పిస్తే తర్వాత వాటిని వారే కొనసాగిస్తారు.

4 బాధ్యత : పిల్లలు ఏ పనిచేసినా దానికి సంబంధించిన బాధ్యత వారే తీసుకునేలా అలవాటు చేయాలి. చిన్నారులు చేసే పొరబాట్లను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. అప్పుడే వారు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మారతారు. తప్పు చేసినప్పుడు క్షమించమని అడగడం, ఇతరులకు సందర్భానుసారం ‘కృతజ్ఞత’ చెప్పడం, అలాగే తాను చేయాల్సిన పనికి సంకోచించకుండా ‘ఎస్‌’ అని అనగలగాలి. తను చేయలేని పనికి ‘నో’ చెప్పగలగడం చిన్నారులకు బాల్యం నుంచి నేర్పించాలి. దీంతోపాటు ‘ప్లీజ్‌/ దయచేసి’ అనే పదం వారిలో ఇగో పెరగకుండా కాపాడుతుంది. వీటిని అలవాట్లుగా మార్చితే చాలు. ఇతరులతో వారికి అనుబంధాన్ని పెంచుతాయి. అలాగే ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనే శక్తిని అందిస్తాయి.

5 స్పందించే గుణం: తల్లిదండ్రులను చూసే పసివాళ్లు నేర్చుకుంటారు. మన్నన, సున్నితంగా మాట్లాడటం, ఇతరుల కష్టానికి స్పందించడం వంటివి తెలుసుకునేలా చేయాలి. అప్పుడే వారు అందరికీ ఆదర్శంగా ఉండగలుగుతారు.

ఇదీ చదవండి: Bonalu: జులై 11న గోల్కొండ, 25న లష్కర్ బోనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.