ETV Bharat / lifestyle

health tips in telugu: తరుచూ ఆ సమస్యలు వేధిస్తున్నాయా? ఇలా చేయండి మరి..!

author img

By

Published : Oct 24, 2021, 12:26 PM IST

health tips in telugu, telugu health tips
తెలుగు ఆరోగ్య చిట్కాలు, టిప్స్ ఫర్ గుడ్ హెల్త్

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరిలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మతిమరుపు, కీళ్ల నొప్పులు, ఐరన్ లోపం, ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. మీకూ ఇలాంటి సమస్యలు(health tips in telugu) ఉన్నాయా? అయితే ఇలా చేయండి మరి..!

యుక్త వయసులోనూ మధ్యవయసులోనూ సంతోషంగా జీవించేవాళ్లకి వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చే అవకాశాలు తక్కువని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. 20 నుంచి 90 ఏళ్లలోపు 15 వేలకు పైగా వ్యక్తుల్ని ఎంపికచేసి నిశితంగా గమనించారట. ఇందుకోసం వాళ్లను మూడు వర్గాలుగా విభజించారట. యుక్తవయసు, మధ్య వయసు, వృద్ధాప్యం... ఇలా మూడు దశలుగా విభజించి వాళ్ల జీవనశైలినీ మెదడు పనితీరునీ పదేళ్లపాటు గమనిస్తూ వచ్చారట. అందులో- డిప్రెషన్‌తో ఉన్నవాళ్లలో ఆనందంగా ఉన్నవాళ్లకన్నా వయసు పెరిగేకొద్దీ ఆలోచనా శక్తి తగ్గుతున్నట్లు గుర్తించారు. మధుమేహం, బరువు, చదువు, ఉద్యోగం... ఇలా ఏ కారణం వల్ల డిప్రెషన్‌ వచ్చినా వయసు పెరిగేకొద్దీ వాళ్ల మెదడులోని హిప్పోక్యాంపస్‌ భాగం క్రమంగా దెబ్బతింటున్నట్లు గుర్తించారు. దాంతో వృద్ధాప్యంలో వాళ్లు కొత్త విషయాలను సరిగ్గా గుర్తుంచుకోలేకపోతున్నారట. ముఖ్యంగా డిప్రెషన్‌ కారణంగా మహిళల్లో మతిమరుపు మరీ ఎక్కువగా ఉందట. అంతేకాదు, డిప్రెషన్‌ శాతం పెరిగేకొద్దీ మతిమరుపూ ఎక్కువవుతున్నట్లు తేలిందట.

కీళ్లవ్యాధికీ వ్యాక్సిన్‌ చికిత్స!

కీళ్లవ్యాధికీ వ్యాక్సిన్‌ చికిత్స

కీళ్ల జబ్బులకు వ్యాక్సీన్‌ ఏమిటా అనిపిస్తోంది కదూ. కానీ టొలెడొ యూనివర్సిటీ పరిశోధకులు రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ను నివారించేందుకు సరికొత్త వ్యాక్సీన్‌ చికిత్సను రూపొందించారు. దీన్ని ప్రయోగాత్మకంగా జంతువుల్లోనూ పరిశీలించారట. అదెలా అంటే- జెటా 14-3-3 అనే ప్రొటీన్‌ ఎక్కువ కావడం వల్లే రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ వస్తున్నట్లు ఇంతకాల శాస్త్ర బృందం భావించింది. దాంతో జీన్‌ ఎడిటింగ్‌ ద్వారా ఆ ప్రొటీన్‌ను తొలగించాలనీ అనుకున్నారు. అయితే ఎలుకల్లో ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు- ఈ ప్రొటీన్‌ తగ్గినప్పుడు కూడా కీళ్లనొప్పులు వస్తున్నట్లు గుర్తించారు. దాంతో ఈ ప్రొటీన్‌ను ప్రేరేపించే వ్యాక్సీన్‌ను పరిశోధక బృందం తయారుచేసి కొన్ని జంతువుల్లో ప్రయోగపూర్వకంగా పరిశీలించిందట. ఆశ్చర్యకరంగా వాటిల్లో ఈ వ్యాధి పూర్తిగా తగ్గిందట. దాంతో త్వరలోనే కీళ్లవాతాన్ని నివారించడానికి ఈ వ్యాక్సీన్‌ చికిత్సను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది సదరు నిపుణుల బృందం.

ఐరన్‌ లోపం ఉంటే...

ఐరన్‌ లోపం ఉంటే.

మధ్యవయసులో ఐరన్‌ లోపం లేకుండా చూసుకోగలిగితే భవిష్యత్తులో గుండెజబ్బులు రాకుండా ఉంటాయని యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆ వయసులో తలెత్తే గుండె మరణాల్లో పది శాతం ఆ కారణం వల్లే సంభవిస్తున్నాయని గుర్తించారు. ఆకస్మిక గుండె పోటుతో ఆసుపత్రిలో చేరినవాళ్లలో అనేకమందికి ఐరన్‌ లోపం ఉన్నట్లు గుర్తించారట. అంతేకాదు, అలా చేరినవాళ్లలో కొందరికి చికిత్సలో భాగంగా రక్తంలోకి ఐరన్‌ని ఎక్కించినప్పుడు వాళ్ల పరిస్థితి మెరుగై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు సైతం వాళ్ల అధ్యయనంలో తేలింది. ఇలాంటి కేసుల్లో 55 శాతం మహిళలే ఉన్నారనీ అదీ 59 సంవత్సరాల వయసు వాళ్లలో ఈ రకమైన గుండెజబ్బులు ఎక్కువగా వస్తున్నాయనీ గుర్తించారు. కాబట్టి ఐరన్‌ లోపాన్ని తేలికగా తీసుకోవద్దు అని హెచ్చరిస్తున్నారు.

స్వీటెనర్లతో ఊబకాయం!

స్వీటెనర్లతో ఊబకాయం

బరువు పెరగకుండా, మధుమేహం రాకుండా ఉండేందుకూ ఈమధ్య చాలామంది పంచదారకు బదులుగా కృత్రిమ స్వీటెనర్లను వాడుతున్నారు. కానీ జీరో క్యాలరీలతో ఉన్న ఈ కృత్రిమ స్వీటెనర్లు బరువును తగ్గించడానికి బదులు పెరగడానికి దోహదపడుతున్నాయి అంటున్నారు కెక్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు. అంతేకాదు, వీటివల్ల మహిళల్లో మధుమేహం కూడా వస్తోంది అంటున్నారు. ఈ విషయమై వీళ్లు రకరకాలుగా పరిశీలించారట. ముఖ్యంగా ఈ పదార్థాలను వాడిన వాటిని తిన్నప్పుడు మెదడు పనితీరుని పరిశీలించారట. వాటిని తిన్నప్పుడే కాదు, స్వీటెనర్లను వాడి చేసే శీతలపానీయాలూ ఇతరత్రా పదార్థాలను చూసినప్పుడు కూడా మెదడులోని కొన్ని భాగాలు చురుగ్గా మారి, ఆకలిని పెంచినట్లు గుర్తించారు. దాంతో వాళ్లు వాటిని మరింత ఎక్కువగా తీసుకున్నారట. అంటే- తీపి పదార్థం అది సహజంగా తయారైనదైనా కృత్రిమమైనదైనా- వాటిని చూసినప్పుడు క్రేవింగ్‌ పెరిగి, మామూలుకన్నా ఎక్కువగా తీసుకుంటారనీ తద్వారా ఊబకాయులుగా మారుతున్నారనీ అంటున్నారు. కాబట్టి తీపి వస్తువులతో జాగ్రత్త సుమీ!

ఇదీ చదవండి: Sleep Time By Age: ఏ వయసులో ఎంత నిద్ర పోవాలంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.