ETV Bharat / lifestyle

Health Tips in Telugu: చన్నీటి స్నానం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?

author img

By

Published : Nov 7, 2021, 8:07 AM IST

Health Tips in Telugu, cold bath benefits
చన్నీటి స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు, తెలుగు ఆరోగ్య చిట్కాలు

'ఓ పక్క ఎముకలు కొరికే చలి.. మరో పక్క చన్నీటి స్నానం..' ఇది వింటేనే ఒళ్లు చలితో బిగుసుకుపోతుంది కదూ.. మరి స్నానం చేసేస్తే? అమ్మో! మేం అంత సాహసం చేయలేం అంటారా.. కానీ చలికాలంలో చాలామంది ఈ పద్ధతిని ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా కార్తిక మాసంలో ఇలా చన్నీళ్లతో చేసే స్నానాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు కూడా.. కేవలం పవిత్రతే కాదు.. చన్నీటి స్నానం(Health Tips in Telugu) వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం రండి...

కార్తిక మాసం శివుడికి అత్యంత పవిత్రమైంది. కాబట్టి ప్రతిరోజూ శివలింగానికి ఈ పవిత్ర జలంతో ఎలాగైతే అభిషేకం చేస్తుంటారో.. అలాగే మన దేహాన్ని కూడా శివలింగంలాగా భావించి ఆ నీటితోనే స్నానం చేస్తుంటాం. దీనివల్ల గతంలో చేసుకున్న పాప కర్మలన్నీ సమసిపోతాయని భక్తులందరి విశ్వాసం. అలాగే కొంతమంది రోజుకు మూడుసార్లు కూడా చన్నీటి స్నానం(Health Tips in Telugu) చేస్తుంటారు. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా మనలో ఉండే మలినాలను కడిగివేసే లక్షణం కేవలం నీటికే ఉంటుందన్నది కూడా చాలామంది అభిప్రాయం!

శారీరక, మానసిక ఆరోగ్యం

మెరుగయ్యే రక్త ప్రసరణ..

చన్నీటి స్నానం(Health Tips in Telugu) వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు ఒక క్రమపద్ధతిలో రక్తప్రసరణ జరుగుతుంది. దీనివల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఉంటాయి. అలాగే ధమనుల్లో కూడా రక్తప్రసరణ బాగా జరిగి గుండెను సురక్షితంగా ఉంచడంలో చల్లటి నీళ్లు తోడ్పడతాయి. ఈ స్నానం వల్ల బీపీ అదుపులో ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.. ఈ క్రమంలో శరీరంలోని మలినాలు, విషపదార్థాలు సులభంగా వేరై తొలగిపోతాయి.

శక్తినిస్తుంది..

చలికాలంలో ఉదయాన్నే చల్లటి నీళ్లు(Health Tips in Telugu) శరీరంపై పడగానే ఒళ్లు బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంటుంది. దీంతో శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది. ఫలితంగా ఎక్కువ ఆక్సిజన్‌ను పీల్చుకుంటాం. అలాగే దీని వల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగి శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఆ రోజంతటికీ కావలసిన శక్తి శరీరానికి లభిస్తుంది.

వ్యాయామం తర్వాత..

వ్యాయామం చేసే క్రమంలో కాసేపటి తర్వాత మన శరీరంలోని కండరాలు అలసిపోయి 'విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది..' అనే భావన మనలో కలుగుతుంది. అలాగే ఎక్కువసేపు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో కండరాలలో నొప్పిగా కూడా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు కండరాల పైన చల్లటి నీళ్లు పోస్తే ఉపశమనం లభిస్తుంది.

ఆరోగ్యకరం

మెరుగయ్యే జీవక్రియలు..

వాతావరణం చల్లగా అనిపిస్తే ఎలాగైతే మనం వెచ్చదనం కోసం స్వెట్టర్లు, శాలువాలు ధరిస్తామో.. అలాగే శరీరంపై చల్లటి నీళ్లు పడగానే శరీరంలోని కార్బోహైడ్రేట్లు, కొవ్వులు కరిగి వేడి పుడుతుంది. దీనివల్ల కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు.. శరీరంలోని జీవక్రియల పనితీరు కూడా మెరుగవుతుంది.

మానసిక ప్రశాంతతకు..

ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా?? అయితే ఒకసారి చన్నీళ్లతో(Health Tips in Telugu) స్నానం చేయండి. తేడా మీకే తెలుస్తుంది. దీనివల్ల ఒత్తిళ్లన్నీ మాయమై మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. కాబట్టి ప్రతిరోజూ చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల రోజంతా ప్రశాంతంగా ఉండచ్చు.

సో.. చన్నీటి స్నానం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసుకున్నారు కదా! అయితే.. ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలు ఉన్నవాళ్లు; జలుబు, జ్వరం, సైనసైటిస్.. వంటి సమస్యలతో బాధపడే వాళ్లు మాత్రం చన్నీటి స్నానం చేయడం మంచిది కాకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వైద్య నిపుణులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు పాటించడం మంచిది.

ఆ మాటకొస్తే- స్నానం విషయంలో- చన్నీళ్లు, వేణ్ణీళ్లు.. ఆరోగ్య పరంగా వేటి ప్రయోజనాలు వాటికున్నాయి. ప్రత్యేకించి వేడి నీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరో సందర్భంలో తెలుసుకుందాం.

ఇదీ చదవండి: Parents be alert about Drugs in hyderabad: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.. మత్తు మనదాకా రాలేదనుకోవద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.