ETV Bharat / lifestyle

శిరోజాలను సహజంగా సంరక్షించుకోండిలా..!

author img

By

Published : Mar 20, 2021, 5:42 PM IST

Bollywood diva madhuri dixit tips for thick Hair
శిరోజాలను సహజంగా సంరక్షించుకోండిలా..!

ఆడవారి ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కురుల పాత్ర ఎంతో కీలకం. కానీ యాంత్రిక జీవనానికి తోడు పోషకాహార లోపం, తీవ్ర పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం కారణంగా చాలామందికి చిన్న వయసులోనే కేశ సౌందర్య సమస్యలు తలెత్తుతున్నాయి. తమ అందం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే కురులను కాపాడుకునేందుకు పార్లర్లు, స్పాలకు వెళుతున్నారు. అదేవిధంగా బయట మార్కెట్లో దొరికే వివిధ రకాల కృత్రిమ ఉత్పత్తులు, నూనెలను ఆశ్రయిస్తున్నారు. అయితే వీటికి బదులు ఇంట్లోనే కొన్ని మెలకువలు పాటిస్తే ఆరోగ్యవంతమైన కేశ సంపద సొంతం చేసుకోవచ్చంటున్నారు అందాల తార మాధురీ దీక్షిత్. ఈ క్రమంలో శిరోజాల సంరక్షణకు సంబంధించి కొన్ని చిట్కాలతో పాటు సహజసిద్ధంగా హెయిర్‌ ఆయిల్‌, హెయిర్‌ మాస్క్‌ తయారీ గురించి ఓ సుదీర్ఘ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారామె.

అసమాన నటన, అందం, డ్యాన్స్‌తో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది మాధురీ దీక్షిత్‌. డ్యాన్సింగ్‌ క్వీన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార... ప్రస్తుతం సోషల్‌ మీడియా ద్వారా తన ఫ్యాన్స్తో నిత్యం టచ్ లో ఉంటున్నారు. 53 ఏళ్ల వయసులోనూ తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ అందం, ఆరోగ్యానికి సంబంధించి పోస్ట్‌లు పెడుతూ ఆయా విషయాల్లో అందరిలో అవగాహన పెంచుతున్నారు. కొద్ది రోజుల క్రితం తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఎప్పుడూ ఉండే వస్తువుల గురించి చెప్పుకొచ్చిన మాధురి తాజాగా తన హెయిర్‌ కేర్‌ సీక్రెట్స్‌ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జుట్టు ఆరోగ్యానికి సంబంధించి తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఓ సుదీర్ఘమైన వీడియోను షేర్‌ చేశారు. ఈ క్రమంలో శిరోజాల సంరక్షణకు సంబంధించి కొన్ని చిట్కాలతో పాటు సహజసిద్ధంగా హెయిర్‌ ఆయిల్‌, హెయిర్‌ మాస్క్‌ తయారీ గురించి వివరించారు. మరి వాటి గురించి మనమూ తెలుసుకుందాం రండి...

హెయిర్‌ ఆయిల్

కావాల్సినవి

కొబ్బరినూనె- అరకప్పు

కరివేపాకు - 15 నుంచి 20 రెబ్బలు

మెంతులు -టేబుల్‌ స్పూన్

ఉల్లిపాయ- (సన్నగా తరుక్కోవాలి)

తయారీ

పైన చెప్పిన పదార్థాలన్నింటిని తీసుకుని ఓ మందమైన ప్యాన్లో మీడియం మంటపై మరగనివ్వాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని కిందకు దించి చల్లార్చాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టి ...ఆ నూనెను ఒక బాటిల్‌లో నింపాలి. స్టోర్‌ చేసినప్పటి నుంచి రెండు రోజుల్లోపు ఎప్పుడైనా ఈ నూనెను తలకు పట్టించుకుంటే మంచి ఫలితం ఉటుంది.

ఉపయోగాలు!

  • ఈ హెయిర్‌ ఆయిల్‌ తయారీ గురించి వీడియోలో వివరంగా చెప్పుకొచ్చిన మాధురి... ఇందులోని పదార్థాల వల్ల కురులకు ఎలాంటి మేలు చేకూరుతుందో కూడా షేర్‌ చేసుకున్నారు.
  • కరివేపాకులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు కావాల్సిన తేమను అందించి సహజమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. ఇందులోని ప్రొటీన్లు జుట్టుకు పటుత్వాన్ని అందిస్తాయి.
  • వాతావరణ కాలుష్య ప్రభావం కురులపై పడకుండా కొబ్బరి నూనె రక్షణ కలిగిస్తుంది. కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు చిట్లిపోకుండా కాపాడుతుంది.
  • మెంతుల్లో ఉండే ప్రొటీన్‌, నికోటినిక్‌ యాసిడ్‌ చుండ్రు, చికాకు సమస్యలను బాగా తగ్గిస్తాయి.
  • ఇక ఉల్లిపాయ జుట్టు రాలడాన్ని బాగా నిరోధిస్తుంది.

హెయిర్‌ మాస్క్

కావాల్సినవి

అరటి పండు-1

పెరుగు- 2 టీస్పూన్లు

తేనె - టీస్పూన్

తయారీ

ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నింటిని తీసుకొని బాగా కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని కుదుళ్లు, జుట్టుకు పట్టించాలి. అనంతరం జుట్టును పైకి ముడేసుకుని షవర్‌ క్యాప్‌ పెట్టుకుని 30-40 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. జుట్టు మృదుత్వం సంతరించుకోవడానికి, ప్రకాశవంతంగా మెరవడానికి ఈ మాస్క్‌ ఎంతో సహకరిస్తుంది. ఈ మాస్క్‌ను ఉపయోగించిన తర్వాత కండిషనర్‌ను వాడకపోవడం మంచిది.

ఈ చిట్కాలు పాటించండి !

  • వీటితో పాటు జుట్టు ఆరోగ్యానికి ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాల్ని వీడియోలో పంచుకుందీ అందాల తార. అవేంటంటే...
  • శరీరానికి హెల్దీ లైఫ్‌స్టైల్‌ ఎంత అవసరమో...శిరోజాల సంరక్షణకు కూడా ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. ఇందులో భాగంగా మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో నీటి స్థాయులు పెరగడమే కాకుండా చర్మంలోని మలినాలు, వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా జుట్టు కూడా ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. వైద్యులను సంప్రదించి విటమిన్‌ సప్లిమెంట్స్, బయోటిన్‌, ఒమేగా-3 ఫిష్ ఆయిల్‌ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఇందులోని పోషకాలు జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయి.
  • జుట్టు బాగా ఆరోగ్యంగా పెరగాలంటే క్రమం తప్పకుండా హెయిర్‌ను ట్రిమ్‌ చేసుకోవాలి.
  • స్నానం చేసిన తర్వాత సాధ్యమైనంతవరకు జుట్టును సహజంగానే ఆరనివ్వాలి. వేడి కలిగించే హెయిర్‌ డ్రయర్స్‌ను అధికంగా వాడడం వల్ల కుదుళ్లలో దురద, అలర్జీలు, జుట్టు చివర్లు చిట్లడం... వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే తలస్నానం చేశాక జుట్టును తుడుచుకునేందుకు రెగ్యులర్‌ టవల్స్ బదులు మైక్రోఫైబర్‌ ర్యాపర్స్‌ను వినియోగిస్తే మేలు.
  • తలస్నానానికి బాగా వేడిగా ఉండే నీళ్లు ఉపయోగించడం వల్ల జుట్టు కుదుళ్లకు నష్టం కలుగుతుంది. కాబట్టి గోరువెచ్చని నీటినే తలస్నానానికి ఉపయోగించాలి. వెంట్రుకలు దృఢత్వాన్ని సంతరించుకోవాలంటే స్నానం తర్వాత కండిషనర్‌ను రాసుకోవడం తప్పనిసరి.
  • తలస్నానం చేసిన వెంటనే జుట్టును దువ్వకూడదు. అలా చేస్తే వెంట్రుకలు తెగిపోవడం, ఎక్కువ జుట్టు రాలిపోవడం... వంటి సమస్యలొస్తాయి. జుట్టు దువ్వుకోవడానికి కూడా మెత్తటి బ్రిజిల్స్ ఉండే దువ్వెనను ఉపయోగించడం ఉత్తమం.
  • చల్లటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఉన్నితో తయారుచేసిన టోపీలతో జుట్టును కవర్‌ చేయడం ఉత్తమం. లేకపోతే చల్లటి గాలులు కురులకు నష్టం కలిగిస్తాయి.
  • కేశ సౌందర్య సమస్యలన్నింటినీ దూరం చేసుకుని ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకోవాలంటే మసాజ్‌కు మించిన సాధనం లేదు. కాబట్టి కనీసం వారానికోసారైనా హెయిర్‌ మసాజ్‌ చేసుకోవాలి.

చూశారుగా... ఇంట్లోనే ఉండి ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకునేందుకు ఎన్ని మార్గాలున్నాయో! మరి మాధురి చెప్పినట్లు మనమూ ఈ హెయిర్‌ టిప్స్‌ను పాటించేద్దాం... కేశ సౌందర్యాన్ని కాపాడుకుందాం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.