ETV Bharat / lifestyle

కొవిడ్​ తగ్గిన నెల తర్వాత... పాదాల మంట!

author img

By

Published : Sep 28, 2021, 2:55 PM IST

after-covid-health-issues-in-human-body
పాదాల మంట

సమస్య: నాకు ఇటీవల కొవిడ్‌ వచ్చి తగ్గింది. నెల తర్వాత పాదాల్లో మంటలు మొదలయ్యాయి. దీనికి కారణమేంటి? ఇది తగ్గేదెలా?- చాణక్య (ఈమెయిల్‌)

సలహా: కొవిడ్‌-19 బారినపడ్డ కొందరిలో నాడులు దెబ్బతినటం చూస్తున్నాం. కాళ్లలో నాడులు దెబ్బతింటే (పెరిఫెరల్‌ న్యూరోపతీ) పాదాలు మండినట్టు, సూదులు పొడిచినట్టు అనిపించొచ్చు. దీన్నే పారస్తీషియా అంటారు. ముందు నుంచే నాడులు దెబ్బతిన్నవారికి కొవిడ్‌ తర్వాత ఇలాంటి లక్షణాలు మరింత ఎక్కువయ్యే అవకాశముంది. మీకు మధుమేహం వంటి సమస్యలేవైనా ఉన్నాయేమో తెలపలేదు. మధుమేహం నియంత్రణలో లేనివారిలోనూ కాళ్లలో నాడులు దెబ్బతినొచ్చు.

కొవిడ్‌-19 మూలంగా.. ముఖ్యంగా స్టిరాయిడ్లు వాడినవారిలో కొత్తగా మధుమేహం రావటం, మధుమేహం ఉంటే మరింత ఎక్కువ కావటం చూస్తున్నాం. కాబట్టి మీరు పరగడుపున, భోజనం చేశాక రక్తంలో గ్లూకోజు మోతాదులను పరీక్షించుకోవటం మంచిది. అలాగే మూడు నెలల గ్లూకోజు సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్ష కూడా చేయించుకోవాలి. గ్లూకోజు ఎక్కువగా ఉంటే నియంత్రణలో ఉంచుకోవటం ముఖ్యం. ఆహారంలో పిండి పదార్థాలు తగ్గించాలి. కొవిడ్‌ అనంతరం తలెత్తే పాదాల మంట చాలావరకు క్రమంగా దానంతటదే తగ్గే అవకాశముంది. భయపడాల్సిన పనిలేదు. ఒకవేళ పాదాల మంట తగ్గకుండా వేధిస్తున్నా, మరింత ఎక్కువవుతున్నా మందులు వేసుకోవాల్సి ఉంటుంది. విటమిన్లు.. ముఖ్యంగా బి విటమిన్‌ మాత్రలు, ఇంజెక్షన్లు ఉపయోగపడతాయి. అప్పటికీ తగ్గకపోతే ప్రిగాబాలిన్‌, గాబాపెంటిన్‌, కార్బమజెపిన్‌ రకం మందులు అవసరమవ్వచ్చు. అందువల్ల పాదాల మంట బాగా ఇబ్బంది పెడుతుంటే దగ్గర్లోని నాడీ నిపుణులను సంప్రదించండి. ఆయా లక్షణాలను బట్టి మందులు సూచిస్తారు.

ఇదీ చూడండి: కొవిడ్‌ టీకాలకూ నకిలీ బెడద- కట్టడి బాధ్యత ప్రభుత్వాలదే

కొవిడ్​ నుంచి కోలుకున్నా.. రుచీపచీ లేని జీవితం!

Vaccination In India: దేశంలో 80 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.