ETV Bharat / lifestyle

ATLA TADDE SPECIAL STORY: అట్లతద్ది పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఎలా చేస్తారు?

author img

By

Published : Oct 23, 2021, 9:20 AM IST

అట్ల తద్ది అనేది తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ. ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది (Atla Tadde 2021) అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు ఓ చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు. ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు.. ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం.

ATLA TADDE SPECIAL STORY
ATLA TADDE SPECIAL STORY: అట్లతద్ది పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఎలా చేస్తారంటే?

అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌...

ముద్దపప్పోయ్‌ మూడట్లోయ్‌...

చప్పట్లోయ్‌ తాళాలోయ్‌...

దేవుడి గుళ్ళో మేళాలోయ్‌...

పప్పూ బెల్లం దేవుడికోయ్‌...

పాలూ నెయ్యీ మనకేనోయ్‌...

ఈ పాట వినని తెలుగువారుండరు. అట్లతద్ది పైపైకి ఏదో సాదాసీదా జానపద సంబరంలా కనిపిస్తున్నా దీనివెనుక శక్తి ఆరాధన, జ్యోతిషపరంగా కలిగే గ్రహదోషాలను నివారించే అంశాలూ ఉన్నాయంటారు పండితులు. ఇది అచ్చమైన సంప్రదాయ సంబరం. చిరకాల సౌభాగ్యాన్ని సిద్ధింపచేసే ఆటపాటల అట్లతద్దిని స్త్రీలెంతో ఇష్టపడతారు.

చల్లంగ చూడమ్మ.. మా గౌరమ్మ..

అట్లతద్ది ఆశ్వయుజ బహుళ తదియ నాడు వస్తుంది. పండుగకు ముందురోజును భోగి అంటారు. ఇందులో ప్రధానాంశం గౌరీపూజ. స్త్రీలకు మాంగల్య సౌభాగ్యాన్ని, కుటుంబానికి సుఖశాంతులను ప్రసాదించే అమ్మ గౌరి. ఈ తల్లిని ఉమ, పార్వతి తదితర పేర్లతోనూ ఆరాధిస్తారు. గౌరీ అంటే ఆదిపరాశక్తికి ప్రతిరూపం. ఆరోజు సాయంత్రం అంటే చంద్రోదయ వేళ ఉమాదేవీ వ్రతం చేస్తారు. మాంగల్యధారణకు ముందు పెళ్లికూతురు గౌరీపూజ చేస్తుంది. ఆ ప్రకారంగా, మాంగల్య సౌభాగ్యదాయిని గౌరీమాత. ఆదర్శ దాంపత్యం గురించి చెప్పే సందర్భంలో, ఆది దంపతులైన శివపార్వతుల ప్రస్తావన వచ్చి తీరుతుంది. ప్రత్యేకించి ఈ వ్రతాన్ని చేయడమంటే గౌరీదేవి అనుగ్రహాన్ని పొందటమే.

పూజావిధానం

అట్లతద్దె నాడు తెల్లవారుఝామున నిద్రలేచి సూర్యోదయం లోపలే, సంప్రదాయాన్ని అనుసరించి తినాల్సిన పదార్థాలను తినేసి, ఇక ఆ తర్వాత ఉపవాసం ఉంటారు. రోజంతా ఆటపాటలతో కాలం గడిపి, చంద్రోదయ సమయానికి స్నానాలు ముగించి గౌరీపూజ చేస్తారు. ముత్తైదువులకు వాయనాలిచ్చి, ఆ తర్వాత భోజనం చేస్తారు.

పూజ సమయంలో పసుపు గణపతికి, పసుపుతో చేసిన గౌరీదేవికి షోడశోపచార పూజ చేస్తారు. అమ్మవారికి పదకొండు అట్లను నివేదిస్తారు. బియ్యం పిండితో దీపం చేసి జ్యోతిని వెలిగిస్తారు. పూజకు ముందే పదకొండు ముళ్లు వేసిన తోరాన్ని అమ్మవారికి, తమకు, పేరంటాలకు కూడా సిద్ధం చేస్తారు. పలురకాల పిండివంటలను నైవేద్యంగా పెడతారు. పదకొండు రకాల కూరగాయలతో వంటలు నివేదనలో ఉంటాయి. పూజ ముగిసిన తర్వాత.. వాయనం ఇచ్చేవారు అట్ల మీద చీర కొంగును కప్పి, ‘ఇస్తినమ్మ వాయనం’ అని ఇవ్వగా, పుచ్చుకునేవారు చీరకొంగుపట్టి ‘పుచ్చుకుంటినమ్మ వాయనం’ అంటూ పుచ్చుకోవడం సంప్రదాయం. ఆ తర్వాత ‘వాయనం పుచ్చుకున్నది ఎవరు?’ అని ఇచ్చిన ముత్తైదువు అడుగుతుంది. ‘పుచ్చుకున్నామె నేనే.. గౌరీదేవిని!’ అని సమాధానం ఇస్తుంది. ఇలా వాయనాలు ఇవ్వటం అయ్యాక చంద్ర దర్శనం చేసుకుని భోజనాలు ముగిస్తారు.

ఇదీ అట్ల సంగతి

అట్లతద్దెలో అట్లదే ముందు మాట. అట్లకింత శక్తి ఏమిటి? అని ఆలోచిస్తే అట్లతద్దె స్వరూపం ఎంత గొప్పదో తెలుస్తుంది. అట్లు వేయటానికి మినప్పిండి, బియ్యప్పిండి కలిపి వాడతారు. స్త్రీలకు కుజదోషం గనుక ఉంటే ఆలస్యంగా పెళ్లవడం, రుతుక్రమంలో సమస్యలు, గర్భధారణలో దోషాలు వాటిల్లుతుంటాయని జ్యోతిష పండితులు చెబుతుంటారు. అలాగే, చంద్రగ్రహ దోషం ఉన్నవారికి మనశ్శాంతి కరువవుతుందంటారు. ఇలాంటి జ్యోతిష శాస్త్రాల గురించి చెబితే అందరికీ పూర్తిగా అర్థం కాకపోవచ్చు. కనుక పరోక్షంగా ఆ దోష నివారణలకు సంబంధించిన పదార్థాలను నివేదించి వాయనాల రూపంలో దానం ఇస్తే దోషాలు తొలగిపోతాయనే సదాశయంతో జరుపుకుంటారీ పండుగ. స్త్రీల శ్రేయస్సు కోసమే అట్లతద్దె అవతరించిందని భావిస్తారు.

అంతరార్థం

పైపైకి విందూ వినోదాల పండుగలా కనిపించినా, వ్రత కథనూ అందులోని అంతరార్థాలనూ పరిశీలిస్తే ఇదెంతో విశిష్ట పండుగగా కనిపిస్తుంది. పూర్వం నారదుడి సూచన మేరకు గౌరీదేవి ఈ అట్లతద్ది వ్రతాన్ని చేసి, తాను వలచిన శివుడిని భర్తగా పొందిందట. చంద్రోదయ ఉమావ్రతంలో చంద్రుడిని ఆరాధించటం కూడా ఉంది. దీనికి కారణం చంద్రుడి పదహారు కళలలో శక్తి ఉండటమే. తదియనాటి ఆ శక్తి, స్త్రీ సౌభాగ్యానికి కారణం అవుతుందని ఓ నమ్మకం. దీంతో కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని చెబుతారు పెద్దలు. అదలా ఉంచితే రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని పీల్చుకున్నట్లవుతుంది. ఉపవాసంతో జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ అంతరార్థాలలో మరొకటి.

ఉయ్యాలలు.. ఉల్లాసాలు..

అట్లతద్దెలో అంతర్గతంగా గౌరీపూజ కనిపిస్తున్నా అసలా పేరు వినగానే అందరికీ ఉయ్యాలలూ ఉల్లాసాలే కళ్లముందు మెదులుతాయి. ఈ పండుగకు ముందు భోగినాడే తలస్నానం చేసి గోరింటాకు పెట్టుకోవటం, పండుగ తెల్లవారుజామున తమ ఇంటికి రమ్మని ఇరుగుపొరుగు ముత్తైదువులనూ, ఆడపిల్లలనూ ఆహ్వానించటం ఓ సందడిగా కనిపిస్తుంది. అప్పటినుంచే వరుసైనవారి సరస సల్లాపాలు ప్రారంభమవుతాయి. ఇక పండుగనాడు తెల్లవారుఝామున చేసే భోజనాలు మరీ మరీ ఆనందదాయకంగా ఉంటాయి. అట్లతద్దె భోజనంలో నువ్వుల పొడి, గోంగూర పచ్చడి, కందిపచ్చడి, పొట్లకాయ కూర, ఉల్లిపాయ ముక్కలు, చింతపండుతో చేసిన పచ్చి పులుసు, పెరుగు తదితర రుచికర పదార్థాలన్నీ ఉంటాయి. సూర్యోదయానికి ముందే భోజనాలు ముగుస్తాయి. ఆ తర్వాత ఆడవారంతా కలిసి ఓ పెద్ద చెట్టు దగ్గరకు చేరుతారు. పెద్ద పెద్ద ఊపులతో ఉయ్యాలలూగుతారు. కేరింతలు కొడుతూ సరదా సరదాగా కాలం గడుపుతారు. ఈ అట్లతద్ది నాడు ఉయ్యాల ఊపటానికి పోతురాజు అనే పేరుతో, ఒక పురుషుణ్ని ఏర్పాటు చేసి, అతడికి కూడా అట్ల వాయనం ఇవ్వటం కనిపిస్తుంది. వాయనాలు తీసుకొనే ముత్తైదువులలో గౌరీదేవిని చూసినట్టే, ఉయ్యాల ఊపే పోతురాజులో శివుణ్ని దర్శిస్తారు. ఇలా లౌకిక, పారలౌకిక భావనల నేపథ్యంలో అవతరించిందీ అట్లతద్ది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.