ETV Bharat / jagte-raho

భూమి తీసుకున్నారు కానీ ఉద్యోగం ఇవ్వలేదని నిరుద్యోగి ఆత్మహత్య

author img

By

Published : Jan 8, 2021, 12:51 PM IST

భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన.. భూ నిర్వాసిత కుటుంబానికి చెందిన ఓ యువకుడు, ఒప్పందం ప్రకారం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం దక్కలేదనే మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో చోటుచేసుకుంది.

unemployee suicide with the mindset that he wont get govt job as per contract
భూ నిర్వాసిత నిరుద్యోగి బలవన్మరణం

భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం భూ నిర్వాసిత కుటుంబానికి చెందిన రూపిరెడ్డి సతీశ్ అనే యువకుడు.. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం రావాల్సిన ఉద్యోగం దక్కలేదనే మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పినపాక మండల సరిహద్దున ప్రభుత్వం 1080 మెగావాట్ల సామర్ధ్యంతో బీటీపీఎస్​ నిర్మాణం చేపట్టింది. 2015-16లో అందుకోసం అవసరమైన వేల ఎకరాల భూమిని సేకరించింది. భూ నిర్వాసితుల్లో అర్హులకు బీటీపీఎస్​లోనే శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. మండలంలోని సాంబయ్య గూడెంకు చెందిన రూపిరెడ్డి వెంకట్​రెడ్డి అనే రైతు నుంచి ఇలాగే 1.2 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది.

భూ నిర్వాసితుడు వెంకట్​రెడ్డి, కుమారుడు సతీశ్ 2015-16 సమయానికి కనీస అర్హత వయస్సుకు నెల రోజులు తక్కువగా ఉండటంతో​.. అధికారులు అతడిని అనర్హుడిగా తేల్చారు. అనంతరం బాధితుడు తనకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలంటూ పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఏ లాభం లేకపోయింది.

గతేడాది బీటెక్ పూర్తి చేసిన సతీశ్.. ప్రస్తుతం ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. తనకు రావాల్సిన ఉద్యోగం దక్కదేమోనన్న ఆందోళనతో.. తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు. మంగళవారం నాడు అర్ధరాత్రి పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రాణపాయస్థితిలోకి వెళ్లిన అతడిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ గురువారం కన్నుమూశాడు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చదవండి: ఉద్యోగం రాలేదని.. ఊరికే ఉండిపోలేదు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.