ETV Bharat / jagte-raho

పోలీసులకు చిక్కిన రుణయాప్​ల ప్రధాన నిందితుడు

author img

By

Published : Jan 14, 2021, 6:06 AM IST

రుణయాప్‌ల కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. ఇదివరకు నమోదైన కేసుల్లో పలువురిని అరెస్టు చేసిన పోలీసులు... నిందితుల ఖాతాల్లోని కోట్లాది రూపాయలు తాత్కాలిక జప్తు చేశారు. రుణయాప్‌లు తొలగించాలని గూగుల్‌కు లేఖ రాసినా ఆ సంస్థ నుంచి సానుకూల స్పందన రాలేదు.

యాప్​లతో సులభ రుణాలు.. కఠిన వసూళ్లు
యాప్​లతో సులభ రుణాలు.. కఠిన వసూళ్లు

యాప్​లతో సులభ రుణాలు.. కఠిన వసూళ్లు

సులభంగా రుణాలిచ్చి వేధింపులకు పాల్పడుతున్న ప్రధాన సూత్రధారి చైనీయుడు హి- జియాన్‌ సహా అతనికి సహకరించిన వివేక్‌ను... రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 2019లో వ్యాపారవీసాపై భారత్‌కు వచ్చిన హీ-జియాన్‌... మరో ముగ్గురు చైనీయులతో కలిసి రుణవ్యాపారం మొదలుపెట్టాడు. జియా లియాంగ్ ఇన్ఫోటెక్‌తోపాటు మరోమూడు సూక్ష్మరుణ సంస్థలు స్థాపించి... 24 యాప్స్‌ రూపొందించాడు. తద్వారా కోట్ల రుణాలిచ్చి... వాటిని వసూలు చేసేందుకు మహారాష్ట్రకు చెందిన అజయ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రుణాలు తీసుకున్న వ్యక్తుల నుంచి డబ్బులు... 50శాతం వడ్డీ వసూలు చేసే బాధ్యత ఆ కాల్‌సెంటర్ నిర్వాహకులే చూస్తున్నారు. 15 రోజుల క్రితం ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు... వారి నుంచి సేకరించిన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కీలక పాత్ర పోషించిన జియాలియాంగ్ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ. 28 కోట్లు తాత్కాలిక జప్తు చేయడం సహా హి-జియాన్‌కు చెందిన పాస్‌పోర్టు, 4 ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.

ఎక్కడి నుంచి ఎక్కడికి

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోనూ రుణయాప్‌ల కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇదివరకే లాంబో అనే చైనీయుడితోపాటు నాగరాజును అరెస్టు చేశారు. నాగరాజుకు చెందిన 1,515 ఖాతాల్లోని నగదు స్తభింపజేశారు. లాంబో నిర్వహిస్తున్న 4 కంపెనీల పేరిట ఓ ప్రైవేట్‌ బ్యాంకులో దాదాపు 108 ఖాతాలు తెరిచినట్లు దర్యాప్తులో తేలింది. ఆ ఖాతాల ద్వారా ఎక్కడెక్కడికి నగదు బదిలీ అయిందనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

గూగుల్​కు లేఖ..

హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 350కిపైగా రుణయాప్‌లను గుర్తించి... వాటిని తొలగించాలని 15 రోజుల క్రితం గూగుల్‌కు లేఖ రాశారు. ఆ సంస్థ 50లోపు యాప్‌లను మాత్రమే తొలగించింది. రుణయాప్‌లలో 90శాతానికి పైగా చైనీయులు భాగస్వాములుగా ఉన్నారని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. రుణయాప్‌లు, కాల్‌సెంటర్ల నిర్వాహకుల నుంచి ఒత్తిడి వస్తే... బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: 5 కిలోల గోధుమ గింజలతో కరోనా సందేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.