ETV Bharat / jagte-raho

వేధిస్తున్నారా..? ఒక్క ట్వీట్‌ చాలు!

author img

By

Published : Sep 23, 2020, 2:37 PM IST

Updated : Sep 23, 2020, 3:38 PM IST

మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నారా? పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలో తెలవటం లేదా? మీకు ట్విట్టర్ ఖాతా ఉంటే చాలు. ఓ ట్వీట్ చేస్తే... దాన్నే ఫిర్యాదుగా భావించి... పోకిరీలను వెంటనే పట్టుకుంటామంటున్నారు హైదరాబాద్ పోలీసులు.

hyderabad police invite complaints in twitter
వేధిస్తున్నారా..?ఒక్క ట్విట్‌ చాలు!

‘మీకు ట్విటర్‌ ఖాతా ఉందా? స్నేహితులు... బంధుమిత్రులకు తెలియని విషయాలు... తెలిసిన వివరాలూ ట్వీట్ల ద్వారా చెబుతున్నారా? మీ సన్నిహితులతో పాటు పోలీసులకూ చెప్పండి.. మిమ్మల్ని ఎవరైనా వేధించినా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినా.. ట్వీట్ చేస్తే చాలు పోకిరీల భరతం పడతాం. హైదరాబాద్‌ పోలీసు శాఖతో పాటు ప్రతి ఠాణా ఇన్‌స్పెక్టర్‌ పేరుతో ట్విటర్‌ ఖాతాలున్నాయి. నిమిషాల వ్యవధిలో మేం స్పందిస్తాం.. ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలే కాదు... ట్విట్టర్‌ను ఉపయోగించుకోండి..’ అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులను ఎదుర్కొంటున్న వారికి హైదరాబాద్‌ పోలీసులు భరోసా ఇస్తున్నారు. ఒక్క ట్వీట్‌ చేస్తే... దాన్నే ఫిర్యాదుగా భావించి చర్యలు చేపడుతున్నారు.

వెంటపడి.. భయపెట్టి.. వేధించి...

వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌ చేస్తున్నవారిని ‘షి’ బృందాలు పట్టుకుంటున్నాయి. ఇది కొనసాగుతుండగానే.. చరవాణులు, అంతర్జాలం ద్వారా యువతను వేధిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వేర్వేరు నంబర్లతో ఫోన్‌ చేసి బాధితులను భయపెడుతున్నారు. పైశాచిక మనస్తత్వం ఉన్న కొందరు నేరగాళ్లు బూతులు తిడుతున్నారు. అసభ్య, అశ్లీల వీడియోలను చరవాణులకు పంపుతున్నారు. మరికొందరైతే అర్ధరాత్రి దాటాక ఒంటి గంట నుంచి మూడు గంటల వరకూ విరామం లేకుండా ఫోన్లు చేస్తూ హింసిస్తున్నారు. ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో వేధిస్తే బాధితులు ఫిర్యాదు చేస్తేనే తప్ప పోలీసుల దృష్టికి సమస్య రాదు. బాధితులు మిన్నకుండి పోతుండడంతో వేధింపుల పర్వం ఇంకా కొనసాగుతోంది.

ఫిర్యాదులు.. సంభాషణలు గోప్యం..

చరవాణులు, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు ఎదుర్కొంటున్న వారి కోసమే వాట్సాప్‌, ట్విటర్‌ సేవలను పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నిందితుల మాటలు(రికార్డు చేసుంటే), అసభ్య సందేశాలు, వీడియోలను వాట్సాప్‌, ట్విటర్‌ ద్వారా పంపితే చాలు. మిగిలిన వ్యవహారమంతా ‘షి’బృందం సభ్యులు చూసుకుంటారు. బాధితుల వివరాలపై పోలీసులు గోప్యత పాటిస్తారు. బాధితులు ఏ చరవాణి నుంచి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేస్తున్నారు.

ఇదీ చూడండి: నాని వ్యాఖ్యలపై దుమారం.. బర్తరఫ్​ చేయాలని విపక్షాల డిమాండ్

Last Updated : Sep 23, 2020, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.