ETV Bharat / jagte-raho

బాలికపై దారుణానికి ఒడిగట్టిన కర్కశుడికి 14రోజుల రిమాండ్

author img

By

Published : Oct 6, 2020, 8:37 PM IST

ఖమ్మం జిల్లాలో కలకలం రేపిన 13ఏళ్ల బాలికపై అత్యాచార, హత్యాయత్నం కేసులో నిందితుడికి ప్రథమ శ్రేణి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. బాలికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలించారు.

బాలికపై దారుణానికి ఒడిగట్టిన కర్కశుడికి 14రోజుల రిమాండ్
బాలికపై దారుణానికి ఒడిగట్టిన కర్కశుడికి 14రోజుల రిమాండ్

సంచలనం రేపిన 13 ఏళ్ల బాలికపై అత్యాచార, హత్యాయత్నం కేసులో నిందితుడికి ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. బాలికపై కర్కశంగా ప్రవర్తించిన నిందితుడు మారయ్య కటకటాలపాలయ్యాడు. దాదాపు 70 శాతం కాలిన గాయాలతో తల్లడిల్లుతున్న బాలికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. 17 రోజుల పాటు పోలీసులకు సమచారం ఇవ్వకుండా బాలికకు వైద్యం చేసిన ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఖమ్మం జిల్లా కేంద్రం పార్శీబంధం కాలనీలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనలో 13 ఏళ్ల బాలికపై కర్కశంగా ప్రవర్తించిన నిందితుడికి జిల్లా ఒకటో అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

ప్రత్యేక బృందం...

ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. పోక్సో, అత్యాచార, హత్యాయత్నం, బెదిరింపుల చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఒకటో పట్టణ పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించగా జైలుకు తరలించారు.

ఆందోళనకరంగా బాలిక పరిస్థితి...

దాదాపు 70 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 17 రోజుల పాటు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన బాధితురాలిని తొలుత ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక మాట్లాడుతున్నప్పటికీ దాదాపు 70 శాతం ఒంటిపై కాలిన గాయలైనట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్సులో హైదరాబాద్​కు తరలించారు.

గతనెల 18న ఘటన...

బాలికపై అత్యాచార, హత్యాయత్నం ఘటన గత నెల 18న జరిగింది. అదేరోజు బాలికను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించినట్లు నిందితుడి కుటుంబమే చెబుతోంది. బాలిక ఒంటి నిండా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరి 17 రోజులు గడిచింది. అసలే మైనర్ బాలిక, ఆపై ఒంటి నిండా కాలిన గాయాలతో ఉంది. ఆస్పత్రిలో చేర్పించిన సమయంలో బాలిక తల్లిదండ్రులు కానీ కుటుంబీకులు కానీ ఎవరూ పక్కన లేరు. అయినప్పటికీ బాలికను ఆస్పత్రిలో చేర్పించుకుని చికిత్స అందించారు.

మెడికో లీగల్ కేసు...

మెడికో లీగల్ కేసు కింద నేరపూరితమైన ప్రతి కేసుకు సంబంధించిన సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్​కు అందించాలన్న కచ్చితమైన నిబంధన ఉంది. కానీ సదరు ప్రైవేటు ఆస్పత్రి ఈ నిబంధనలేమీ పట్టించుకోలేదు. రోజుల తరబడి వైద్య సేవలు అందించడమే కాకుండా భారీగా డబ్బులు గుంజడంపై శ్రద్ధ వహించింది తప్ప.. సామాజిక బాధ్యతను మరుస్తున్నామన్న సంగతి మాత్రం విస్మరించింది. 17 రోజుల పాటు విషయం బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచే విషయంలో ప్రైవేటు ఆస్పత్రి కూడా పాలుపంచుకున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై పోలీసులు దృష్టి సారించారు. 17 రోజుల పాటు వైద్యం అందించినప్పటికీ ఆస్పత్రి యాజమాన్యం తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఒకటో పట్టణ పోలీసులు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి లేఖ రాశారు.

భట్టి పరామర్శ...

మైనర్ బాలిక నివాసానికి వెళ్లిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క... బాలిక తల్లిదండ్రులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ బిడ్డ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని బాలిక తల్లి బోరుమంది. కూతురు ఆరోగ్యం మెరుగుపడేందుకు చొరవ చూపాలని తల్లిదండ్రులు కోరారు. బాలిక కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 13 ఏళ్ల బాలికపై దుర్మార్గంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇవీచూడండి: అమానుషం: బాలికపై పైశాచికం... హత్యాచారయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.