ETV Bharat / international

'స్వతంత్రంగా భారత న్యాయవ్యవస్థ.. ఆర్బిట్రేషన్‌కు పూర్తి అనుకూలం'

author img

By

Published : Mar 20, 2022, 6:44 AM IST

arbitration law
CJI N V Ramana

CJI Ramana on Arbitration: న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని కల్పించేందుకు బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. ప్రపంచీకరణ శకంలో మధ్యవర్తిత్వం అనే అంశంపై దుబాయ్​లో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత న్యాయవ్యవస్థ ఆర్బిట్రేషన్‌కు పూర్తి అనుకూలమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

CJI Ramana on Arbitration: "నేను ప్రపంచంలో ఎక్కడికెళ్లినా.. భారత న్యాయవ్యవస్థ ఎంతమేర పెట్టుబడిదారులకు స్నేహపూర్వకమని అడుగుతుంటారు. దీనికి 'భారత న్యాయవ్యవస్థకున్న సంపూర్ణ స్వతంత్రతపై మీరు పూర్తి విశ్వాసం పెట్టుకోవచ్చు.. అంతర్లీనంగా దానికున్న రాజ్యాంగశక్తి అన్ని పక్షాలనూ సమానంగా చూస్తుంది' అన్నదే నేనిచ్చే సమాధానం" అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. ఫిక్కీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఆధ్వర్యంలో శనివారం దుబాయ్‌లో 'ఆర్బిట్రేషన్‌ ఇన్‌ ద ఎరా ఆఫ్‌ గ్లోబలైజేషన్‌' అంశంపై నిర్వహించిన నాలుగో అంతర్జాతీయ సదస్సులో సీజేఐ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత న్యాయవ్యవస్థ ఆర్బిట్రేషన్‌కు పూర్తి అనుకూలమని ఈ సందర్భంగా స్పష్టంచేశారు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే సమర్థవంతమైన వివాద పరిష్కార వ్యవస్థ ఉండాలన్నారు.

"నేను న్యాయవాద వృత్తి జీవితం ప్రారంభించిన 1980లతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నాడు ప్రపంచ వాణిజ్య విలువ 2 లక్షల కోట్ల డాలర్లుంటే 2019 నాటికి 19 లక్షల కోట్ల డాలర్లను దాటిపోయింది. ఈ వృద్ధి మరింత వేగాన్ని సంతరించుకోనుంది. ఇదే సమయంలో పరస్పర ఆధారం పెరిగిపోవడం మనల్ని దుర్బలంగా మార్చింది. ప్రపంచంలో ఒక మూలన తలెత్తే సంక్షోభ ప్రభావం అన్నిచోట్లా పడుతోంది. అది సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన వివాద పరిష్కార యంత్రాంగాన్ని నెలకొల్పేటప్పుడు ప్రస్తుతం ఉన్న వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉమ్మడి లక్ష్యాన్ని సాధించే క్రమంలో విభిన్నమైన ప్రయోజనాల మధ్య సమతౌల్యం సాధించడం పెద్ద సవాల్‌. దీన్ని అధిగమించేందుకు ఇలాంటి సదస్సులు ఎంతో ప్రయోజనకరం"

-జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సీజేఐ

ప్రస్తుత ప్రపంచానికి ఆర్బిట్రేషనే అత్యుత్తమ వివాద పరిష్కార యంత్రాంగమని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పష్టంచేశారు. ఇందులో నిబంధనల సరళత (ప్రొసీజరల్‌ ఫ్లెక్సిబిలిటీ), నిపుణుల భాగస్వామ్యం ఉంటుందని.. ఇది నిర్దిష్ట సమయాన్ని అనుసరించి కొనసాగే యంత్రాంగం కాబట్టి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుందన్నారు.

దేశమంతటా వివాద పరిష్కార సంస్థలు..

"అంతర్జాతీయ వాణిజ్య యవనికపై మధ్యవర్తిత్వ ప్రభావం క్రమంగా పెరుగుతోంది. భారత్‌లో సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య వివాదాల పరిష్కారం కోసం ఒక ప్రత్యామ్నాయ వేదిక ఉండాలన్న భావన సర్వత్రా ఏర్పడింది. అందులో భాగంగానే 1996లో ఆర్బిట్రేషన్‌ అండ్‌ కన్సీలియేషన్‌ చట్టం రూపుదిద్దుకొంది. దాన్ని మరింత సమర్థవంతంగా, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ చట్టాలకు సమానంగా తీసుకురావడానికి సవరణలు కూడా చేశారు. చట్టబద్ధ పాలనకు అత్యున్నత గౌరవం ఇవ్వడమే ప్రపంచస్థాయికి ఎదగడానికి ముందస్తు అర్హత. చట్టబద్ధ పాలన, ఆర్బిట్రేషన్‌.. వీటి లక్ష్యం న్యాయం అందించడమే. వాణిజ్య వివాదాలను వేగవంతంగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో భారత పార్లమెంటు వాణిజ్య కోర్టుల చట్టాన్ని తీసుకొచ్చింది. దేశమంతటా పలు అంతర్జాతీయ వివాద పరిష్కార సంస్థలు ఏర్పడ్డాయి" అని సీజేఐ వివరించారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో.. తాను, పలువురు న్యాయమూర్తులు, వృత్తి నిపుణులతో కలిసి ఇటీవల హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని స్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రస్తావించారు. అలాగే భారత ప్రభుత్వం గుజరాత్‌లో ఆర్బిట్రేషన్‌ కేంద్ర ఏర్పాటుకు భారీ మొత్తంలో బడ్జెట్‌ కేటాయించిందని, ఇలాంటి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడానికి భారత్‌లో విస్తృతావకాశాలున్నాయని పేర్కొన్నారు.

మారిన పరిస్థితుల్లో..

"భారత్‌ను ఒకప్పుడు ఆర్బిట్రేషన్‌కు అనుకూలమైన దేశంగా చూసేవారు కాదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆర్బిట్రేషన్‌ను అన్ని వ్యవస్థలూ ప్రోత్సహిస్తున్నాయి" అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ హిమా కోహ్లీ కూడా పాల్గొన్నారు.

ఇదీ చూడండి: prathidhwani: న్యాయస్థానాల్లో ఆర్బిట్రేషన్‌ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.