ETV Bharat / international

'అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాం.. ఇకపై కూడా కొనసాగిస్తాం'.. రష్యా వ్యాపారి కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Nov 8, 2022, 7:50 AM IST

అమెరిగా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దానిపై ప్రముఖ రష్యన్‌ వ్యాపారవేత్త యెవ్జెనీ ప్రిగోజిన్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.

america-presidential-elections
యెవ్జెనీ ప్రిగోజిన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ప్రముఖ రష్యన్‌ వ్యాపారవేత్త యెవ్జెనీ ప్రిగోజిన్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నానని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని ఆయన పేర్కొనడం గమనార్హం. తమ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు యత్నించారని అమెరికా అధికారికంగా ఆరోపించిన వ్యక్తి నుంచి ఈ తరహాలో బహిరంగ వ్యాఖ్యలు రావడం ఇదే మొదటిసారి.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పొలిటికల్‌ సర్కిల్‌లో యెవ్జెనీ ప్రిగోజిన్‌ అంటే తెలియని వారుండరు. ఆయన క్యాటరింగ్ కంపెనీ.. క్రెమ్లిన్ ఫుడ్‌ కాంట్రాక్టులను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే అతన్ని 'పుతిన్‌ చెఫ్‌'గానూ పిలుస్తుంటారు. పుతిన్‌ ఆంతరంగికుల్లో ప్రిగోజిన్‌ ఒకరు. 'మేం అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాం. భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగిస్తాం. అది కూడా ఎంతో కచ్చితత్వంతో కూడిన మా దైన శైలిలో. అది ఎలా చేయాలో మాకు తెలుసు' అని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యంలో మధ్యంతర ఎన్నికల వేళ ఆయన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

అమెరికా రాజకీయాలను ప్రభావితం చేసేందుకు రష్యా ఆధారిత సంస్థలకు స్పాన్సర్ చేసినట్లు ప్రిగోజిన్‌పై అమెరికా అధికారికంగా ఆరోపణలు చేసింది. ఆయనపై రివార్డు కూడా ప్రకటించింది. ఇప్పటికే ఆయన అమెరికా, బ్రిటన్‌, యూరోపియన్ యూనియన్‌ల ఆంక్షల జాబితాలో ఉన్నారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో రష్యా జనరల్స్ పనితీరునూ ఆయన విమర్శించారు. రష్యా ప్రైవేటు సైన్యం 'వాగ్నర్‌ గ్రూప్‌'ను స్థాపించినట్లు కూడా సెప్టెంబరులో ఆయన అంగీకరించారు. సిరియా, మొజాంబిక్‌, మాలి, సుడాన్‌, వెనుజువెలా వంటి దేశాల్లో ఈ గ్రూప్‌ కదలికలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.