ETV Bharat / international

'చైనా పరిస్థితి ఆందోళనకరం.. మరిన్ని వేవ్‌లు తప్పవు'.. WHO హెచ్చరిక

author img

By

Published : Dec 30, 2022, 10:39 PM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్
world health organization covid

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌కు చెందిన 500 ఉపరకాలు వ్యాప్తిలో ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఇవి మరిన్ని వేవ్‌లకు దారితీయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం చైనాలో పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందని వెల్లడించింది.

చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోంది. కొంత కాలంగా వైరస్‌ వ్యాప్తికి కొవిడ్‌ ఆంక్షలు సడలింపుతో పాటు అనేక కారణాలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే ఒమిక్రాన్‌కు చెందిన 500 ఉపరకాలు వ్యాప్తిలో ఉన్నాయనే వాస్తవాన్ని మరవొద్దని.. రానున్న రోజుల్లో మరిన్ని వేవ్‌లు తప్పవని హెచ్చరించింది. ప్రస్తుతానికి చైనాలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోన్న కొవిడ్‌.. ఆందోళన కలిగించే విషయమని స్పష్టం చేసింది.

చైనాలో కొవిడ్‌ ఉద్ధృతికి గల కారణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మరియా వాన్‌ కెర్ఖోవ్‌ వెల్లడించారు. "ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలు సడలించారు. ఇదే సమయంలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ ప్రాబల్యం అధికంగా కనిపిస్తోంది. విశ్వవ్యాప్తంగా ఒమిక్రాన్‌కు చెందిన 500 ఉపరకాలు వ్యాప్తిలో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని వేవ్‌లకు దారితీయవచ్చు" అని మరియా వాన్‌ కెర్ఖోవ్‌ పేర్కొన్నారు. ఒమిక్రాన్‌లో కొన్ని వేరియంట్లకు రోగనిరోధకత నుంచి తప్పించుకునే గుణం ఉండటం ఆందోళనకర విషయం. అయినా.. వీటిపై పోరాడేందుకు ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోవడం ఉపశమనం కలిగించే అంశమని చెప్పారు.

"కొవిడ్‌ ప్రభావం తగ్గిన తీరును చూశాం. ప్రజల్లో ఇమ్యూనిటీ పెరగడమే అందుకు కారణం. ప్రస్తుతం చైనాతోపాటు ఇతర దేశాల్లో వృద్ధులు, రోగనిరోధకత తక్కువగా ఉండేవారితోపాటు ముప్పు అధికంగా ఉండే ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ప్రస్తుతం చైనాలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న తీరు మాత్రం ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్‌తోపాటు తీవ్ర అనారోగ్యం బారినపడిన వారికి చికిత్స అందించేందుకు అవసరమైన ఔషధాలు, వైద్య పడకలు అక్కడ అందుబాటులో ఉంచుకోవాలి" అని వాన్‌ కెర్ఖోవ్‌ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.