ETV Bharat / international

'దగ్గు మందు వల్ల 66మంది పిల్లలు మృతి!'.. ఇండియన్ కంపెనీపై WHO దర్యాప్తు

author img

By

Published : Oct 6, 2022, 8:45 AM IST

Updated : Oct 6, 2022, 4:18 PM IST

దగ్గు, జలుబు సిరప్​ల కారణంగా 66 మంది చిన్నారులు చనిపోయారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఆయా సిరప్​లు ఉత్పత్తి చేసిన భారతీయ ఫార్మా సంస్థకు అలర్ట్ జారీ చేసింది. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది.

who gambia cough syrup
గాంబియా దగ్గు మందు మరణాలపై డబ్ల్యూహెచ్​ఓ స్పందన

Gambia cough syrup death : భారత్​కు చెందిన ఓ ఔషధాల తయారీ సంస్థకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ జారీ చేసింది. ఆ సంస్థ భద్రతా ప్రమాణాలు పాటిస్తుందా లేదా అని తేల్చేందుకు దర్యాప్తు చేపట్టింది. హరియాణా కేంద్రంగా పనిచేసే మెయిడెన్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు 'కలుషిత' సిరప్​లు ఆఫ్రికన్​ దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి, మరికొందరు కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడేందుకు కారణం కావచ్చొన్న వార్తల నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టింది డబ్ల్యూహెచ్​ఓ.

WHO Gambia cough syrup : "ఈ నాలుగు ఔషధాలు.. భారత్​లోని మెయిడెన్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్​ ఉత్పత్తి చేసిన దగ్గు, జలుబు మందులు. ఆ కంపెనీతోపాటు భారత్​లోని నియంత్రణ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఈ వ్యవహారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు చేపడుతోంది." అని బుధవారం తెలిపారు డబ్ల్యూహెచ్​ఓ డైరక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనోమ్. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబీకుల బాధ వర్ణనాతీతం అన్నారు.

ప్రొమెతజైన్​ ఓరల్ సొల్యూషన్​, కాఫెక్స్​మాలిన్ బేబీ కాఫ్​ సిరప్, మాకాఫ్​ బేబీ కాఫ్​ సిరప్, మేగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్​ విషయంలో మెయిడెన్ ఫార్మాకు అలర్ట్ జారీ చేసింది డబ్ల్యూహెచ్​ఓ. వీటి ఉత్పత్తిలో పూర్తిస్థాయిలో భద్రత, నాణ్యతా ప్రమాణాల్ని పాటించినట్టుగా ఇప్పటివరకు ఆ సంస్థ తమకు తగిన ఆధారాలు సమర్పించలేదని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ 'కలుషిత' ఔషధాలు ప్రస్తుతానికి గాంబియాలోనే వెలుగు చూసినా.. ఇతర దేశాలకూ వాటిని సరఫరా చేసి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నాలుగు సిరప్​లు మార్కెట్​లో లేకుండా చేయాలని అన్ని దేశాలకు డబ్ల్యూహెచ్​ఓ సూచించింది.

గాంబియాలో చిన్నారుల మరణాల నేపథ్యంలో ఈ నాలుగు ఔషధాలపై సెప్టెంబర్​లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఫిర్యాదు అందింది. ఆయా సిరప్​లలో అధిక మోతాదుల్లో డైఎథిలీన్​ గ్లైకాల్​, ఎథిలీన్ గ్లైకాల్​ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఆ రెండూ చాలా ప్రమాదకరమని, మరణానికీ కారణం కావచ్చని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. "డైఎథిలీన్​ గ్లైకాల్​, ఎథిలీన్ గ్లైకాల్ కారణంగా కడుపు నొప్పి, వాంతులు, డయేరియా, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, తల నొప్పి, మానసికంగా అనిశ్చితి, తీవ్రమైన కిడ్నీ సమస్యలు తలెత్తి.. చివరకు మరణానికి దారి తీయవచ్చు" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. సంబంధిత సంస్థలు ఆయా సిరప్​లను విశ్లేషించి, క్లియరెన్స్​లు ఇచ్చే వరకు వాటిని హానికరమైన ఔషధాలగానే పరిగణించాలని సూచించింది.

భారత్​లో లేవు!
కాగా, ఈ ఔషధం భారత్​లో సరఫరా చేయడం లేదని ఆల్ఇండియా ఆరిజిన్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ తెలిపింది. ఇవి ఎగుమతి చేయడానికి మాత్రమే భారత్​లో ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. దీనిపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తామని స్పష్టం చేసింది.

Last Updated : Oct 6, 2022, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.