ETV Bharat / international

పుతిన్​కు ఏమైంది..? రంగులు మారిన చేతులు.. కారణం అదేనా!

author img

By

Published : Nov 25, 2022, 10:46 PM IST

vladimir putins hands turn purple
రంగులు మారిన చేతులు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోగ్యం మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల క్యూబా అధ్యక్షుడితో చర్చలు జరిపిన సమయంలో తీసిన ఫొటోల్లో ఆయన చేతులు రంగుమారాయి. దీనికి కారణం ఏంటని సామాజిక మాధ్యమాల్లో చర్చలు మొదలయ్యాయి.

ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, క్యూబా అధ్యక్షుడు మిగుయేల్‌ డియాజ్‌ కానెల్‌ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పశ్చిమ దేశాలకు తమ ఉమ్మడి శత్రువు అమెరికా ఇస్తోన్న అనుమతులపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశాల మాట పక్కన పెడితే.. ఇరు దేశాల అధ్యక్షులు కరచాలనం చేస్తున్న సందర్భంలో క్లిక్‌మనిపించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ ఫొటోల్లో పుతిన్‌ చేతులు రంగు మారడమే అందుకు కారణం. ఆయన చేతులు పర్పుల్‌ రంగులో కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై మరోసారి సామాజిక మాధ్యమాల వేదికగా చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ఆర్మీ మాజీ అధికారి, హౌస్‌ సభ్యుడు లార్డ్స్‌ రిచర్డ్‌ దనత్‌ స్పందించారు. చేతులపై ఉన్న మచ్చలను నిశితంగా పరిశీలిస్తే.. ఇంజక్షన్‌ సూదులు గుచ్చడం వల్ల ఏర్పడినట్లుగా కనిపిస్తోందని అన్నారు. దానివల్లే బహుశా చేతులు రంగుమారి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఇటీవల ఆయన చేతులపై నలుపు రంగు మచ్చలు కనిపించడం కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇవి నరాల్లోకి ఔషధాలు ఎక్కించడం వల్ల ఏర్పడిన మచ్చలేనని చాలా మంది పేర్కొన్నారు.

ఈమధ్య కాలంలో పుతిన్‌ ఆరోగ్యంపై రకరకాల వార్తలు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, వైద్యం చేయించుకునేందుకే కొన్ని వారాల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. వ్యాధి తీవ్రత అడ్వాన్స్‌ స్థాయికి చేరినట్లు వెల్లడించాయి. మరోవైపు, పుతిన్‌ అధ్యక్ష బాధ్యతలకు తాత్కాలికంగా స్వస్తి చెప్పనున్నారని, ఆయన స్థానంలో వేరే వ్యక్తి ఆ బాధ్యతలు అప్పగిస్తారని కూడా వదంతులు గుప్పుమన్నాయి. కానీ, కొన్ని రోజుల తర్వాత రష్యాలోని వివిధ అధికారిక కార్యక్రమాల్లో పుతిన్‌ ప్రత్యక్షమవ్వడంతో ఆ వార్తలకు బ్రేక్‌పడింది. కానీ, తాజాగా ఆయన చేతులు రంగు మారడంతో పుతిన్‌ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.