ETV Bharat / international

ఆకాశంలో మరో అనుమానిత వస్తువు.. కూల్చేసిన అమెరికా.. 10రోజుల్లో నాలుగో ఘటన

author img

By

Published : Feb 13, 2023, 7:53 AM IST

US shoots down fourth airborne object
US shoots down fourth airborne object

అమెరికా గగనతలంలో ఆదివారం అనుమానాస్పద వస్తువును ఫైటర్‌ జెట్‌ కూల్చేయగా.. ఇప్పుడు మిషిగన్​లో ఇలాంటి వస్తువు సంచారమే కలకలం రేపింది. దీన్ని అమెరికా ఫైటర్ జెట్ కూల్చేసింది. ఈ మేరకు వైట్​హౌస్ అధికారికంగా వెల్లడించింది.

అగ్రరాజ్యం అమెరికా గగనతలంలో మరోసారి అనుమానాస్పద వస్తువు కదలికలు కలకలం సృష్టించాయి. మిషిగన్​ రాష్ట్రంలోని హురాన్​ సరస్సు ప్రాంతంలో.. 20 వేల అడుగుల ఎత్తులో స్థూపాకార వస్తువు ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు వెంటనే దాన్ని యుద్ధవిమానంతో కూల్చేశారు. ఈ మేరకు వైట్​హౌస్ అధికారికంగా వెల్లడించింది.

"గగనతలంలో సుమారు 20వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న స్థూపాకార వస్తువును గుర్తించాం. అధ్యక్షుడు జో బైడెన్​ ఆదేశాల మేరకు ఎఫ్-16 ఫైటర్​ జెట్​ AIM9x ద్వారా కూల్చేశాం. ఈ ఘటన వల్ల పౌరులెవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఆర్మీ స్థావరాల సమీపంలో ఆ అనుమానాస్పద వస్తువు సంచరించింది. అయితే దాని వల్ల ఎటువంటి సైనిక ముప్పు లేదు. కానీ విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని భావించి కూల్చివేశాం. దానికి నిఘా సామర్థ్యం ఉందేమోనన్న అనుమానంతో ఈ పని చేశాం. దీనిపై మా బృందం పరిశోధనలు జరుపుతోంది" అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగ్ జనరల్ పాట్ రైడర్ తెలిపారు.

అంతకుముందు, ఆదివారం కెనడాలో కారు లాంటి వస్తువును అమెరికా ఫైటర్‌ జెట్‌లు కూల్చేశాయి. కెనడా-అమెరికా సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టగా.. అమెరికాకు చెందిన ఎఫ్-22 ఫైటర్‌ జెట్‌ ఆ వస్తువును పేల్చేసిందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ట్వీట్ చేశారు. ధ్వంసమైన వస్తువు శిథిలాలపై అమెరికా- కెనడా పరిశోధనలు జరుపుతున్నాయి. దీనిపై తాను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో మాట్లాడినట్లు ట్రూడో చెప్పారు.

శనివారం కూడా అలస్కా ఉత్తర తీరంలో 40వేల అడుగుల ఎత్తులో పేలోడ్లతో ఉన్న ఓ వాహనం ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన అమెరికా అధికారులు.. వెంటనే యుద్ధవిమానంతో దాన్ని కూల్చేశారు. ఈ వస్తువు గురువారమే అమెరికా గగనతలంలోకి ప్రవేశించినట్లు పెంటగాన్‌ మీడియా కార్యదర్శి బ్రిగేడియర్‌ జనరల్‌ పాట్రిక్‌ రైడర్‌ తెలిపారు.

కాగా, తమ గగనతలంలో చక్కర్లు కొడుతూ తమ అణు స్థావరాలపై నిఘా పెట్టిన చైనా బెలూన్​ను అమెరికా ఫిబ్రవరి 4న కూల్చివేసింది. దక్షిణ కరోలీనా తీరానికి దగ్గర్లో దాన్ని కూల్చేసినట్టు పెంటగాన్ తెలిపింది. అట్లాంటిక్ సముద్రంలో పడిపోయిన బెలూన్ శిథిలాలను, అందులోని పరికరాలను స్వాధీనం చేసుకొని.. వాటిని పరిశీలిస్తోంది. గతవారం అమెరికా కూల్చేసిన మొదటి నిఘా బెలూన్ తప్ప మిగతా మూడింటి గురించి అధికారులు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.