ETV Bharat / international

రిషి సునాక్‌ ముందు మరో సవాల్‌.. పన్నులకు వ్యతిరేకంగా 40 ఎంపీల లెటర్​

author img

By

Published : Dec 12, 2022, 6:23 PM IST

బ్రిటన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ప్రధాని రిషి సునాక్‌కు సవాల్‌ విసురుతోంది. తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితులను అధిగమించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సొంత పార్టీ ఎంపీలే ప్రశ్నిస్తున్నారు. దేశంలో పన్నులు ఎక్కువగా ఉన్నాయని వాటిని తక్షణమే తగ్గించాలని టోరీ ఎంపీలు బ్రిటన్‌ ఆర్థికమంత్రికి లేఖ రాయడం కలకలం రేపుతోంది.

rishi sunak news
rishi sunak news

బ్రిటన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్‌కు మరో సమస్య ఎదురైంది. పన్నుల విషయంలో సొంత పార్టీ నేతల నుంచే తిరుగుబాటు ఎదురైంది. దేశంలో పన్నులు అధికంగా ఉన్నాయని, వాటిని తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కన్జర్వేటివ్‌ వే ఫార్వార్డ్‌ గ్రూప్‌.. ఆర్థికమంత్రికి లేఖ రాసింది. ఈ లేఖపై 40 మంది టోరీ ఎంపీలు సంతకాలు చేశారు.

యూకేలో ప్రజలపై ప్రభుత్వం విధిస్తున్న పన్నులు అధికంగా ఉన్నాయని.. దేశంలో ఈ స్థాయిలో పన్నులు చూడటం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడేనని కన్జర్వేటివ్‌ ఎంపీలు ఆరోపించారు. "జీవన వ్యయ సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్న మా నియోజకవర్గ ప్రజలకు మేం భరోసా ఇవ్వగలగాలి. పన్ను చెల్లింపుదారుల డబ్బు నుంచి ఖర్చు చేసే ప్రతి పైసాకు విలువ ఉండాలి. ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి. పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయకుండా సమర్థంగా ప్రజా పథకాలకు వినియోగించాలి. ప్రజలపై పన్ను భారం తగ్గించాలి’’ అని ఎంపీలు కోరారు.

బ్రిటన్‌లో తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో రిషి సునాక్‌ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ఆహారం, ఇంధనం, గృహ కొనుగోలుపై పన్నులు తగ్గించడాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, రిషి సునాక్‌ తీసుకున్న కొన్ని విధానపరమైన నిర్ణయాల కారణంగా సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదురైంది. దీంతో కొన్ని నిర్ణయాలపై ఆయన యూటర్న్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజా లేఖ సునాక్‌ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశముంది.

ఇవీ చదవండి: ఆ ఇంట్లో వేలాది తేళ్లు.. లీటరు విషం 86 కోట్ల రూపాయలు

ఆ దేశంలో అందరి వయసూ రెండేళ్లు తగ్గుతుందట... అదెలాగంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.