ETV Bharat / international

పోర్న్​స్టార్​తో అలా పరిచయం.. అందుకే ట్రంప్​కు ఇప్పుడు ఇన్ని కష్టాలు!

author img

By

Published : Mar 31, 2023, 3:26 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అరెస్ట్‌ చేస్తారన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే పోర్న్‌ స్టార్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడికి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసిన కారణాలపై ఆసక్తి నెలకొంది. అస్సలు వీళ్లిద్దరికి ఎక్కడ పరిచయమైంది.. అది అనైతిక సంబంధానికి ఎలా దారి తీసింది.. చివరికి ఈ సంబంధం.. ట్రంప్‌ మెడకు ఎలా చిక్కుకుందన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే ట్రంప్‌తో తనకున్న సంబంధంపై డానియల్‌ ప్రతీ సంఘటనను అక్షరబద్ధం చేశారు. ఆమె రాసిన ఫుల్‌ డిస్‌క్లోజర్‌ పుస్తకంలో అన్ని విషయాలను సమగ్రంగా వివరించారు.

donald trump stormy daniels
డొనాల్డ్‌ ట్రంప్‌ స్ట్రోమీ డానియల్స్​

అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓ మాజీ అధ్యక్షుడిని అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధమవుతున్న వేళ.. బిజినెస్‌ టైకూన్‌ ట్రంప్‌.. పోర్న్‌ స్టార్‌ స్ట్రోమీ డానియల్స్‌ మధ్య పరిచయం ఎలా అయిందన్నది ఆసక్తి కలిగిస్తోంది. వీళ్లదరి మధ్య పరిచయం, వివాహేతర సంబంధం అనంతరం పరిణామాలు సినిమా కథను తలదన్నే రీతిలో కొనసాగాయి. ట్రంప్‌నకు తనకు మధ్య ఉన్న సంబంధం, దానికి దారి తీసిన పరిస్థితులు, తనకు వచ్చిన బెదిరింపులు ఇలా అన్ని విషయాలను పోర్న్‌ స్టార్‌ స్ట్రోమీ డానియల్స్‌ రాసిన పుస్తకం.. ఫుల్‌ డిస్‌క్లోజర్‌లో సమగ్రంగా వివరించారు. ఈ పుస్తకంలోనే తాను ట్రంప్‌తో లైంగిక సంబంధంలో ఉన్నట్లు డానియల్‌ తెలిపారు. ఆయితే ఆమె ఆరోపణలను ట్రంప్‌ ఖండించారు.

2006లో నెవాడాలోని గోల్ఫ్ కోర్స్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌- స్ట్రోమీ డానియల్స్‌కు తొలిసారి పరిచయమైంది. పోర్న్‌ స్టూడియోలో వీళ్లిద్దరూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో స్ట్రోమీ స్టూడియోలో గ్రీటర్‌గా పనిచేస్తున్నారు. వీళ్లద్దరికీ పరిచయం అయిన సమయంలో స్ట్రోమీ వయస్సు 27 ఏళ్లు కాగా ట్రంప్‌ వయస్సు 60 సంవత్సరాలు. ఈ పరిచయం అనంతరం ట్రంప్‌ అంగరక్షకులలో ఒకరు.. తనను ట్రంప్‌ పెంట్‌ హౌస్‌కు రావాలని ఆహ్వానించినట్లు స్ట్రోమీ తన పుస్తకంలో వివరించారు. తాను ట్రంప్‌ పెంట్‌ హౌస్‌కు వెళ్లినప్పుడు తొలిసారి తామిద్దరం లైంగికంగా కలిసినట్లు వెల్లడించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా గర్భవతిగా ఉన్న సమయంలో డానియల్స్‌తో ట్రంప్ వివాహేతర సంబంధం కొనసాగింది.

donald trump stormy daniels
స్ట్రోమీ డానియల్స్

ఈ వివాహేతర సంబంధం ముగిసిన చాలా కాలం తర్వాత 2016లో ట్రంప్‌ అధ్యక్ష బరిలో నిలిచినప్పుడు స్ట్రోమీ.. ట్రంప్‌తో తనకున్న అక్రమ సంబంధానికి సంబంధించిన కథనాన్ని ఓ పత్రికకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న ట్రంప్‌ న్యాయ బృందంలో ఒకరైన మైఖేల్ కోహెన్‌, స్ట్రోమీతో టచ్‌లోకి వచ్చి సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉండేందుకు స్ట్రోమీకి లక్షా 30 వేల డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ పేరును డేవిడ్‌ డెన్నిసన్‌.. స్ట్రోమీ డానియల్స్‌ పేరును పెగ్గి పీటర్సన్‌ అనే మారు పేర్లతో న్యాయవాది కోహెన్‌ కోర్టు బయట అనైతిక ఒప్పందం చేసుకున్నారు. అయితే ట్రంప్‌ తాను స్ట్రోమీతో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదని, ఆమెకు డబ్బు చెల్లించలేదని ఎన్నికల ప్రచారంలో చెప్పారు.

అనంతరం ఈ అనైతిక ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ.. పోర్న్‌ స్టార్‌ స్ట్రోమీ డానియల్‌ కోర్టును ఆశ్రయించారు. తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన డానియల్‌ను డబ్బుతో ప్రలోభపెట్టినట్లు ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలను న్యూయార్క్‌ గ్రాండ్ జ్యూరీ ధ్రువీకరించి అభియోగాలు మోపింది. ఈ అభియోగాలతో ట్రంప్ క్రిమినల్‌ ఛార్జ్‌లను ఎదుర్కోనున్నారు. అగ్రరాజ్య చరిత్రలోనే తనపై వచ్చిన నేరారోపణలకు క్రిమినల్‌ ఛార్జ్‌లను ఎదుర్కోనున్న తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. వచ్చే మంగళవారం నాటికి ట్రంప్‌ను కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.

donald trump stormy daniels
డొనాల్డ్‌ ట్రంప్‌
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.