ETV Bharat / international

ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీపై నిషేధం..! ఇప్పటికే 97 కేసులు నమోదు..

author img

By

Published : Mar 19, 2023, 8:10 PM IST

toshakhana corruption case
toshakhana corruption case

ఇస్లామాబాద్‌ కోర్టు కాంప్లెక్స్‌లో విధ్వంసకాండపై తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్‌ అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు డజన్‌కుపైగా పీటీఐ నేతలపై ఉగ్రవాదం కేసు నమోదైంది. శనివారం ఇస్లామాబాద్‌ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో పీటీఐ శ్రేణుల విధ్వంసం, భద్రతాదళాలపై దాడికి సంబంధించి ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీపై నిషేధం విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు పాక్‌ మంత్రి రాణా సనావుల్లా తెలిపారు.

తోషఖానా కేసులో విచారణకుగానూ శనివారం పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇస్లామాబాద్‌కు చేరుకున్న వేళ ఘర్షణ వాతారవణం తలెత్తింది. కోర్టు ప్రాంగణం వెలుపల ఆయన మద్దతుదారులు, పాకిస్థాన్ తెహ్రీక్- ఏ- ఇన్సాఫ్(PTI) పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో 25 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్ వెలుపల విధ్వంసం, భద్రతా సిబ్బందిపై దాడి, అలజడి సృష్టించడం వంటి చర్యలకు కారణమైనందుకుగానూ ఇమ్రాన్‌తోపాటు డజనుకు పైగా పీటీఐ నేతలపై పోలీసులు ఉగ్రవాద కేసు నమోదు చేశారు. దీంతో ఇమ్రాన్ పై ఇప్పటివరకు దాఖలైన కేసుల సంఖ్య 97కు పెరిగింది.

ఇమ్రాన్‌ ఖాన్‌ శనివారం ఇస్లామాబాద్‌కు బయల్దేరగా వేల సంఖ్యలో పోలీసులు లాహోర్‌లోని ఆయన నివాసంలోకి ప్రవేశించారు. పదుల సంఖ్యలో ఇమ్రాన్‌ మద్దతుదారులను అరెస్టు చేశారు. ఆయుధాలు, పెట్రోల్‌ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఇమ్రాన్ పార్టీని నిషేధిత సంస్థగా ప్రకటించే ప్రక్రియను ప్రారంభించేందుకుగానూ న్యాయ నిపుణులను సంప్రదించాలని పాక్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు పాక్ మంత్రి రాణా సనావుల్లా తెలిపారు. స్థానిక వార్తాసంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. జమాన్‌ పార్కులో ఉగ్రవాదులు దాక్కున్నారని.. ఇమ్రాన్ నివాసంలో ఆయుధాలు, పెట్రోల్ బాంబులు చిక్కాయని సనావుల్లా తెలిపారు. ఉగ్రవాద సంస్థగా PTI పై కేసు నమోదు చేయడానికి ఇవే సాక్ష్యాలు అని సనావుల్లా చెప్పారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ కోర్టులో హాజరు కావటానికి ముందు పోలీసులు, పీటీఐ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో 25మంది భద్రతా సిబ్బంది గాయపడటం వల్ల ఇమ్రాన్‌ కేసు విచారణను న్యాయమూర్తి ఈనెల 30కి వాయిదా వేయాల్సి వచ్చింది. అరెస్ట్‌ చేసిన వారితో పాటు పరారీలో ఉన్న పీటీఐ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 17 మంది పీటీఐ నేతల పేర్లు FIRలో చేర్చినట్లు జియో న్యూస్‌ ప్రకటించింది. పోలీస్‌ చెక్‌పోస్టు, కోర్టు కాంప్లెక్స్‌ గేటు, SHO అధికార వాహనం ధ్వంసం, 2 పోలీసు వాహనాలు, 7 మోటారు సైకిళ్లు దహనం చేసినట్లు FIRలో పేర్కొన్నారు.

మరోవైపు శనివారం రోజు తన ఇంటిపై జరిగిన పోలీసు దాడి కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. ఏ చట్టం ప్రకారం పోలీసులు తన ఇంటి గేటు పగలగొట్టి.. చెట్లను పడగొట్టారని మండిపడ్డారు. అంతేకాకుండా తన పార్టీ కార్యకర్తలను పోలీసులు చితకబాదారని ఆరోపించారు. ఇస్లామాబాద్ కోర్టుకు వెళ్లిన క్రమంలో జరిగిన ఈ ఘటనపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాని ఇమ్రాన్ చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకునేలా చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

ఇవీ చదవండి : 'ట్రంప్ అరెస్ట్'!.. అలా జరిగితే ఎన్నికల్లో గెలుపు ఆయనదేనని మస్క్ ట్వీట్

మరియుపోల్​కు పుతిన్​.. ఆక్రమించుకున్నాక తొలిసారి.. స్వయంగా కారు నడుపుతూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.