ETV Bharat / international

టైటానిక్ నౌక పక్కన శిథిలాలు.. గల్లంతైన సబ్​మెరైన్​వేనా? పర్యటకుల సంగతేంటి?

author img

By

Published : Jun 22, 2023, 10:58 PM IST

Updated : Jun 23, 2023, 6:05 AM IST

Titanic Tourist Submarine Debris : టైటానిక్ షిప్​ శిథిలాల పక్కన కొన్ని శకలాలు గుర్తించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ వెల్లడించింది. అట్లాంటిక్‌ మహా సముద్రంలో గల్లంతైన జలాంతర్గామి కోసం వెతుకున్న టీం.. టైటానిక్ షిప్​ శిథిలాల పక్కన ఈ శకాలాలు గుర్తించినట్లు పేర్కొంది.

titanic-tourist-submarine-update-us-coast-guard-said-submarine-debris-found
టైటానిక్ పర్యాటక జలాంతర్గామి ఆచూకీ లభ్యం

Titanic Tourist Submarine Update : సముద్రగర్భంలో గల్లంతైన 'టైటాన్‌' మినీ జలాంతర్గామి ఆచూకీ కోసం వెతుకుతున్న అమెరికా కోస్ట్‌ గార్డ్ కీలక ప్రకటన చేసింది. సబ్​మెరైన్​ కనుగొనేందుకు పంపిన రిమోట్‌ ఆపరేటెడ్‌ వెహికల్‌ (ఆర్ఓవీ) కొన్ని శకలాలను గుర్తించినట్లు ట్వీట్​ చేసింది. ఆర్‌ఓవీ పంపిన సమాచారాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారని వెల్లడించింది. టైటానిక్‌ ఓడ శిథిలాల పక్కనే శకలాలను గుర్తించినట్లు సమాచారం. అయితే, అవి టైటాన్​వేనా కాదా అన్నది తెలియలేదు. అందులోని ప్రయాణికుల గురించిన సమాచారం వెల్లడించలేదు.

ఆదివారం.. అట్లాంటిక్‌ మహా సముద్రంలో పన్నెండు వేల అడుగుల లోతులోని టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో ఓ మినీ జలాంతర్గామి బయల్దేరింది. న్యూఫౌండ్‌ల్యాండ్‌ నుంచి బయల్దేరిన ఈ టైటాన్‌ .. అనంతరం గల్లంతైంది. దీంతో విమానాలు, నౌకలు, రోబోలు.. సముద్రాన్ని జల్లెడ పడుతున్నా.. అట్లాంటిక్‌ మహా సముద్రంలో.. గల్లంతైన జలాంతర్గామి ఆచూకీ తెలియలేదు. సబ్‌మెరైన్‌ ఆచూకీ కోసం మూడు నౌకలను అమెరికా కోస్ట్‌ గార్డ్‌ రంగంలోకి దించింది. అమెరికా సైన్యానికి చెందిన మూడు సీ–17 రవాణా విమానాలను పంపించినట్లు యూఎస్‌ ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌ ప్రకటించింది.

టైటాన్‌ జలాంతర్గామి ప్రస్తుతం సముద్ర ఉపరితలం నుంచి 12 వేల 500 అడుగుల లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దాదాపు 4 కిలోమీట‌ర్ల లోతు వ‌ర‌కు రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి. ఇది సామాన్యమైన లోతు కాదు. టైటానిక్ నౌక శిథిలాల ఉన్న ప్రాంతాన్ని మిడ్‌నైట్ జోన్‌గా పిలుస్తారు. అక్కడ ఉష్ణోగ్రత‌లు శీత‌లంగా ఉంటాయి. అంతా చీక‌టే ఉంటుంది. అక్కడి వరకు సురక్షితంగా చేరుకోవడం కష్టమైన పని అని నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో శోధించేందుకు అండర్‌వాటర్‌ రోబోను పంపించినట్లు తెలుస్తోంది.

మునిగిపోయిన జలాంతర్గామిలో మొత్తం ఐదుగురు ఉన్నట్లు రియర్‌ అడ్మిరల్‌ జాన్‌ ముగెర్‌ పేర్కొన్నారు. అందులో ఉన్న వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జలాంతర్గామి యాత్రను మొదలుపెట్టిన గంటా 45 నిమిషాల్లో కమ్యూనికేషన్‌ను కోల్పోయిందని అమెరికా కోస్ట్‌గార్డ్‌ బృందం పేర్కొంది. పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలోకి దించారు. వాణిజ్య నౌకలను కూడా గాలింపులో భాగస్వాములను చేశారు. మునిగిన ఆ జలాంతర్గామిలో మొత్తం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ ఉంది. 10,432 కిలోల బరువున్న జలాంతర్గామి 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు.

Titanic Submarine Tour : టైటానిక్‌ శకలాలు చూపించేలా ఓషన్‌ గేట్‌ అనే సంస్థ నిర్వహిస్తున్న ఈ యాత్ర టికెట్‌ ధర రూ. 2 కోట్లు ఉంటుంది. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ మినీ జలాంతర్గామిలో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లున్నాయని ఓషన్‌ గేట్‌ కంపెనీ చెబుతోంది.

Last Updated : Jun 23, 2023, 6:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.