ETV Bharat / international

తీవ్ర ఆర్థిక మాంద్యం దిశగా బ్రిటన్‌.. రిషి సునాక్​కు అదో పెద్ద ఛాలెంజ్​!

author img

By

Published : Nov 5, 2022, 7:49 AM IST

britain-economic-recession
రిషి సునాక్

'ప్రధాని రిషి సునాక్‌కు అదే పెద్ద సవాల్‌' అని యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ మస్టిన్‌ అభిప్రాయపడ్డారు. బ్రిటన్​ మరి కొద్ది రోజుల్లో తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే ప్రమాదముందని ఆయన అంటున్నారు.

ఆర్థిక మాంద్యం దిశగా బ్రిటన్‌ పయనిస్తోందని.. వచ్చే ఏడాది తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని, ద్రవ్యోల్బణంతో ధరలు పెరగడం, ప్రజల జీవన వ్యయంలో కోత పడటం ప్రధాన సమస్యలుగా ఉన్నాయని లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌లో ఆర్థిక-పారిశ్రామిక సంబంధాల విభాగం ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ మస్టిన్‌ అభిప్రాయపడ్డారు. ఆర్థికరంగాన్ని గాడిలో పెట్టి ఈ సమస్యల నుంచి బయటపడేయటం నూతన ప్రధానమంత్రి రిషి సునాక్‌ ముందున్న అతిపెద్ద సవాల్‌ అని అన్నారు. కన్జర్వేటివ్‌ పార్టీలో ఐక్యత అంశం కూడా సునాక్‌ ఎదుర్కోనున్న మరో ప్రధాన సమస్య అని 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.

బ్రిటన్‌లో ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి కారణాలేంటి?
ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం, ఇంధన ధరలు అధికమవ్వడం. అయితే ఉక్రెయిన్‌ యుద్ధం, కొవిడ్‌ కారణంగా ఈ పరిణామాలు ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. ఈ సమస్యలు బ్రిటన్‌లో మరింత తీవ్రం కావడానికి ఇంకా అనేక కారణాలున్నాయి. ఇందులో బ్రెగ్జిట్‌ ప్రభావం, సంప్రదాయేతర ఇంధన వనరుల్లో తక్కువ పెట్టుబడులు, వీటన్నింటికి మించి ఇటీవల కాలంలో పన్నుల కోతపై ఫైనాన్షియల్‌ మార్కెట్ల నుంచి ప్రతికూల స్పందన, లిజ్‌ట్రస్‌ ప్రభుత్వం ఖర్చును అధికం చేయడం.. తదితర కారణాల వల్ల బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. వాస్తవానికి వరుసగా రెండు త్రైమాసికాలు ఆర్థికవృద్ధి తిరోగమనంలో ఉంటే మాంద్యం ఉన్నట్లు. సాంకేతికంగా చూస్తే బ్రిటన్‌ మాంద్యంలో ఉన్నట్లు కాదు. కానీ అందరి అంచనా ఏమిటంటే 2023 మార్చినాటికి మాంద్యంలోకి వెళ్తుందని. అది కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంచనా.

ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆదాయం తగ్గుతుంది..రోజువారీ వ్యయం పెరుగుతుంది.. ఈ ఇబ్బందులను సునాక్‌ ఎలా అధిగమిస్తారు?
ప్రస్తుతానికి ప్రభుత్వం వినియోగదారులు, వ్యాపారవర్గాలకు ఇచ్చే విద్యుత్తు సబ్సిడీకి అధిక మొత్తంలో ప్రజాధనాన్ని ఖర్చుచేస్తోంది. లిజ్‌ట్రస్‌ ప్రభుత్వం ఇది చేస్తూనే కార్పొరేషన్లకు పన్నుల కోత విధించడంతో ఫైనాన్షియల్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. అయితే మళ్లీ పన్నులు గతంలో ఉన్న స్థాయికి వచ్చే అవకాశం తక్కువ. ఇలా చేస్తే కన్జర్వేటివ్‌ పార్టీ మరింత అప్రతిష్ఠపాలవుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు చేయాలన్నా కొత్త ప్రధానికి చాలా కష్టం కాగా.. ఇవి భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధికి అడ్డంకయ్యే అవకాశం ఉంది.

సునాక్‌ ఎదుర్కొనే అయిదు ప్రధాన సవాళ్లేంటి? గట్టెక్కే అవకాశం ఉందా?
ద్రవ్యోల్బణం, పెరిగిన ప్రజల జీవన వ్యయం మొదటిది. ప్రస్తుతం బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం పదిశాతం ఉంటే, 20 శాతం మంది ప్రజలు పేదరికంతో ఉన్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంది. మరోవైపు ఇబ్బందులున్నా ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఆర్థికంగా, మిలటరీ పరంగా సాయం చేయాల్సి రావడం మరో సవాల్‌. లిజ్‌ట్రస్‌ తక్కువ రోజులు ప్రధానమంత్రిగా ఉన్నా, 2030 నాటికి మిలటరీపైన అదనంగా 150 బిలియన్‌ యూరోలు ఖర్చుచేస్తామని ప్రకటించారు. బ్రెగ్జిట్‌ వల్ల ఇప్పటికే తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది.

సెంటర్‌ ఫర్‌ యూరోపియన్‌ రిఫార్మ్‌ చేసిన విశ్లేషణ ప్రకారం యూరోపియన్‌ యూనియన్‌లో ఉంటే ఆర్థిక పరిస్థితి 5.2 శాతం మెరుగ్గా ఉండేది. ప్రస్తుత సమస్యలను అధిగమించడం సునాక్‌కు చాలా కష్టంతో కూడినపని. ఆయన చేయాలనుకొన్నా చేయలేరు. ఎందుకంటే ఆయన పార్టీలోని చాలా మంది బ్రెగ్జిట్‌కు సానుకూలంగా ప్రచారం చేశారు. ఇప్పుడు సునాక్‌ భిన్నంగా వ్యవహరిస్తే ద్రోహం చేశారని ఆరోపిస్తారు. 12 సంవత్సరాలు అధికారంలో ఉండి గ్రూపులుగా విడిపోయిన పార్టీకి నాయకుడిగా ఉండి విజయవంతం కావడం నాలుగో సవాలు కాగా, సాధారణ ఎన్నికలు ఎదుర్కోకుండా ఆయన ఎంతకాలం ప్రధానిగా కొనసాగుతారన్నది మరో సమస్య. ప్రస్తుతానికి ప్రతిపక్ష లేబర్‌పార్టీ కంటే కన్జర్వేటివ్‌ పార్టీ వెనుకబడి ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాబట్టి ఆయన పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ ప్రధాన సమస్యలను సునాక్‌ నాయకత్వంలోని ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోగలదా అన్నది చూడాలి.

ఈ సంక్షోభం ప్రభావం యు.కె, యూరప్‌ దేశాలకే పరిమితమా? ప్రపంచమంతా ఉందంటారా?
అంతర్జాతీయ అంశాలు ఇక్కడ కూడా ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలోని ఫెడరల్‌ రిజర్వ్‌బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం వల్ల.. చేసే రుణాలపై భారం పెరిగింది. ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీనివల్ల ఇతర అన్ని రకాల ధరలు రెట్టింపయ్యాయి.. ఆహార ధాన్యాల కొరత, మిలిటరీ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడంతో ప్రభుత్వ బడ్జెట్‌పై ఒత్తిడి పెరిగింది. కరోనా సమయంలోనూ, కొవిడ్‌ తర్వాత నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం భారీగా అప్పులు చేయాల్సి రావడం, లాక్‌డౌన్‌ వల్ల చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడం కూడా అంతర్జాతీయంగా చాలా ప్రభావం చూపింది. అయితే యు.కె.లో బ్రెగ్జిట్‌ వల్ల అప్పటి నుంచే ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి.2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పటి నుంచి ఆరోగ్య సంరక్షణ, విద్యతో సహా అనేక ప్రజాసర్వీసులకు నిధుల కోతలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండగా, ఇప్పుడు సంక్షోభం ప్రారంభమైంది.

బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నరెండు ప్రధాన ఆర్థిక సవాళ్లేంటి?
వడ్డీ రేట్లు పెరగడం వల్ల అప్పులకు చెల్లించే మొత్తం ఎక్కువవుతుంది. వినియోగదారులు అవసరమైన సర్వీసుల కోసం కూడా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి. దీనివల్ల ప్రజలు చేసే ఖర్చులో చాలా తేడా వస్తుంది. ఏడాదిలోనే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ 0.1శాతం వడ్డీరేటు పెంచింది. కొవిడ్‌ను ఎదుర్కోవడానికి వడ్డీ రేటు తక్కువగా ఉండగా, తర్వాత 2.25 శాతానికి పెరిగింది. త్వరలోనే మూడు శాతానికి పెంచుతూ ప్రకటన వెలువడే అవకాశం ఉండగా, మార్కెట్‌ అంచనాల ప్రకారం 2023 నాటికి సుమారు అయిదు శాతానికి చేరే అవకాశం ఉంది. యు.కె. ఆర్థిక వ్యవస్థ సేవారంగాలపై ఎక్కువగా కేంద్రీకరించి ఉంటుంది.

ప్రస్తుత నేపథ్యంలో ఈ రంగంపై ప్రభావం పడటంతో పాటు పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. వాప్యారరంగం దెబ్బతినడం, నిరుద్యోగ సమస్య పెరగడం మొదలైన సమస్యలొస్తాయి. దీంతోపాటు మార్టిగేజ్‌ చేసిన ప్రజలు డిఫాల్టర్లుగా మారే అవకాశం ఉంది. ఇది ఆర్థిక సేవారంగాన్ని (ఫైనాన్షియల్‌ సర్వీసు సెక్టార్‌) ఓ కుదుపు కుదిపే అవకాశం ఉంది. మరో రిస్క్‌ ఏమిటంటే వేతనాలు, సామాజిక భద్రతా ప్రయోజనాలు తగ్గుతుండగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇది ఎక్కువమంది ప్రజలను పేదరికం వైపు మళ్లిస్తోంది.

ప్రస్తుత సంక్షోభంలో పేద కుటుంబాల పరిస్థితి మరింత దయనీయంగా మారిందా?
ఆహారం, ఇంధనం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. పేదరికంతో అల్లాడుతున్న కుటుంబాల్లో ఎదిగే పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత సంక్షోభం పేద కుటుంబాలపై ఎక్కువ ప్రభావం చూపడమే కాదు, వారిని మరింత అప్పులపాలు చేస్తోంది. చాలా మంది మధ్యతరగతి ప్రజలు తమ ఆస్తులను తాకట్టుపెడుతున్నారు. అత్యంత ధనవంతులు మినహా మిగిలిన అందరూ ఇబ్బందులు పడుతోన్నారు.

కన్జర్వేటివ్‌ పార్టీలో ఐక్యత.. సునాక్‌కు సాధ్యమవుతుందంటారా?
కన్జర్వేటివ్‌ పార్టీ ముఠాల మధ్య సామరస్య వాతావరణం తేవడం చాలా కష్టం. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో పార్టీలో ఐక్యత లేకపోతే ఎన్నికల రేటింగ్స్‌పై చాలా వ్యతిరేక ప్రభావం పడుతుంది. పార్టీకి మరింత నష్టం కలిగిస్తోంది. సరళీకృత స్వేచ్ఛా మార్కెట్‌ను సమర్థించేవాళ్లు, ప్రజాకర్షక విధానాలు ఉండాలనుకొనేవారు, ఒకే దేశం అన్న నినాదం కలిగినవారు ఇలా అనేక గ్రూపులుగా విడిపోవడం, భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటం, వ్యక్తిగత శత్రువుల్లా వ్యవహరించడం జరుగుతోంది. వీటన్నింటిని సాధారణ ఎన్నికల నాటికి సునాక్‌ ఓ కొలిక్కి ఎలా తెస్తారో, మరింత నష్టం జరగకుండా ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.