ETV Bharat / international

లంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి రుణ ఎగవేత- డ్యూటీలకు రావొద్దంటూ ఆదేశాలు!

author img

By

Published : May 20, 2022, 5:45 PM IST

Srilanka Crisis
Srilanka Crisis

Srilanka Crisis: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. తీవ్ర ఆహార సంక్షోభం నెలకొనడం వల్ల లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆకాశాన్నంటుతున్న ధరలతో లంకేయులు సతమతమవుతున్నారు. భవిష్యత్తులో ఆకలి చావులు తప్పకపోవచ్చని అక్కడి ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి రుణాలు ఎగవేసింది శ్రీలంక. తీవ్రమైన ఇంధన కొరత వల్ల అత్యవసర విధులు నిర్వర్తించేవారు తప్ప మిగతా ప్రభుత్వ అధికారులు ఆఫీసులకు రావొద్దని ఆదేశించింది.

Srilanka Crisis: ద్వీప దేశం శ్రీలంక రావణ కాష్టంలా రగులుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన లంకలో ప్రజల కష్టాలు పతాకస్థాయికి చేరాయి. తినేందుకు తిండి లేక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యావసరాల ధరలు సుమారు 30 శాతం పెరగడం వల్ల సామాన్యులకు గుప్పెడు మెతుకులు కూడా దొరకడం లేదు. శ్రీలంకలో ఆహార సంక్షోభం ఇలాగే కొనసాగితే ఆకలి చావులు సంభవించే ప్రమాదం ఉందని ఆ దేశ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దేశంలో ఆకలి చావుల నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే.. గత ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్లే ఆహార సంక్షోభం తలెత్తిందని లంక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్న కొత్త ప్రధాని రణిల్‌ విక్రమసింఘే దీన్ని అధిగమించేందుకు ఉత్పత్తిని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆహార ఉత్పాదకతను పెంచడానికి ప్రభుత్వం ఎరువులు సమాకూరుస్తుందని హామీనిచ్చారు. పరిస్థితి తీవ్రతను ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. లంకలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా మందగించగా ప్రజల జీవితం దుర్లభంగా మారిందని స్వచ్ఛంద సంస్థలు తెలిపాయి.

ప్రజలందరూ చనిపోతారని.. ఆహార కొరతతో లంకలో ప్రజలందరూ చనిపోతారని ఇది నమ్మలేని నిజమని లంక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు ఈ విపత్తు నుంచి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రెండు నెలల్లో ద్రవ్యోల్బణం 40 శాతానికి పెరగవచ్చని అంచనా వేశారు. లంకలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు అదనపు నోట్లు ముద్రిస్తున్నారని.. ఇది మరింత ఆర్థిక సంక్షోభానికి దారి తీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే డాలర్‌తో శ్రీలంక రూపాయి మారక విలువ 355 రూపాయలుగా ఉంది

తొలిసారి రుణాల ఎగవేత.. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి రుణాలను ఎగవేసింది. ఆ దేశం చెల్లించాల్సిన 78 మిలియన్‌ డాలర్ల రుణానికి సంబంధించి గ్రేస్‌ పిరియడ్‌ కూడా బుధవారం ముగిసిపోవడం వల్ల అధికారికంగా ఎగ్గొట్టినట్లైంది. ఈ విషయాన్ని గురువారం రెండు క్రెడిట్‌ ఏజెన్సీలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం తమ దేశం ముందస్తు దివాలాలో ఉందని శ్రీలంక రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌ నందలాల్‌ వెల్లడించారు. "మా వైఖరి స్పష్టంగా ఉంది. వారు రుణాలను పునర్‌వ్యవస్థీకరించేంత వరకూ మేము చెల్లింపులు చేయలేం. దానిని ముందస్తు దివాలా అంటారు. వీటిల్లో సాంకేతిక నిర్వచనాలు ఉన్నాయి. వారి వైపు నుంచి దీనిని రుణ ఎగవేతగా భావిస్తారు" అని వెల్లడించారు.

చర్చలు జరుపుతున్న అధికారులు.. శ్రీలంక ఇప్పటికే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అవసరమైన బెయిల్‌ఔట్‌పై అంతర్జాతీయ ద్రవ్యనిధితో చర్చలు జరుపుతోంది. గురవారం ఐఎంఎఫ్‌ ప్రతినిధి మాట్లాడుతూ ఈ చర్చలు వచ్చే మంగళవారానికి పూర్తికావొచ్చని వెల్లడించారు. శ్రీలంక ప్రభుత్వం ఈ ఏడాది దేశాన్ని నడిపేందుకు 4 బిలియన్‌ డాలర్లు అవసరమని చెబుతోంది. శ్రీలంక 50 బిలియన్‌ డాలర్లు విలువైన రుణాలను చెల్లించేందుకు వీలుగా పునర్‌ వ్యవస్థీకరించాలని విదేశీ రుణదాతలను కోరుతోంది. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు విదేశీ మారకద్రవ్యం కొరత, ద్రవ్యోల్బణంలో పెరుగుదల కారణంగా ఔషధాలు, ఇంధనం కొరత ఏర్పడింది.

విధులకు రావొద్దని ఆదేశాలు.. శ్రీలంక అధికారులు శుక్రవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు తీవ్రమైన ఇంధన కొరత వల్ల ఉద్యోగులు.. విధులకు రావొద్దని ప్రభుత్వ అధికారులను కోరారు. అత్యవసరమైన విధులు నిర్వహించేవారు తప్ప మిగతా వారు రావొద్దని ఆదేశించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంక్​ల వద్ద వేలాది మంది ప్రజలు రోజుల తరబడి క్యూల్లో ఇంధనం కోసం వేచి ఉన్నారు. గ్యాస్, ఇంధనాన్ని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ప్రధాన రహదారులను దిగ్బంధిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు సరిపడా ఇంధనాన్ని సరఫరా లేనందున దేశవ్యాప్తంగా రోజుకు నాలుగు గంటలపాటు విద్యుత్ కోత విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

కొత్తగా 9 మంది మంత్రులు.. కొత్తగా తొమ్మిది మందిని మంత్రులుగా నియమించారు విక్రమసింఘే. పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటయ్యే వరకు వీరు కీలక కార్యకలాపాలను నిర్వహించనున్నారు. కొత్త మంత్రివర్గంలో ఫ్రీడమ్‌పార్టీకి చెందిన నిమాల సిరిపాల డిసిల్వా, ఇండిపెండెంట్‌ ఎంపీలు సుశీల్‌ పరమజయంత, విజ్యాదాస రాజపక్సా, తిరన్‌ ఎల్లెస్‌ ఉన్నారు. వీరితో అధ్యక్షుడు గొటబయ రాజపక్స శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీలంక కేబినెట్‌లో అధ్యక్షుడు, ప్రధానితో కలిపి అత్యధికంగా 25 మంది మంత్రులు ఉండొచ్చు. వీరిలో నిమాల సిరిపాల డిసిల్వా నౌకా, విమానయాన శాఖ, సుశీల్‌ పరమజయంతకు విద్యాశాఖ, ఖేలియా రంబుక్‌వెల్లాకు వైద్యశాఖ, విజ్యాదాస రాజపక్సాకు న్యాయ,జైళ్లు, రాజ్యాంగ సంస్కరణలు శాఖలు అప్పజెప్పినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. ఈ సారి కీలకమైన ఆర్థిక శాఖను భర్తీ చేయకపోవడం విశేషం.

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఏప్రిల్​ 9 నుంచి కొలంబోలోని గాలే ఫేస్​ గ్రీన్​లో గొటబాయకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే మహింద రాజపక్సను ప్రధాని పదవి నుంచి తొలగించిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. యునైటెడ్​ నేషనల్​ పార్టీ నేత రణిల్​ విక్రమ్​ సింఘేను (73) 26వ ప్రధానిగా నియమించారు. అందుకు పార్లమెంట్​లోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.

ఇవీ చదవండి: కశ్మీర్​ భారత్​లో అంతర్భాగం.. పాక్​ వ్యాఖ్యలకు స్ట్రాంగ్​ కౌంటర్​!

క్వాడ్ దేశాలకు చైనా సరికొత్త సవాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.