ETV Bharat / international

'టార్గెట్ కీవ్'.. ఉక్రెయిన్​పై దాడికి రష్యా నయా ప్లాన్.. ఆ దేశం నుంచి యుద్ధం!

author img

By

Published : Dec 17, 2022, 5:18 PM IST

russia missile attack
russia missile attack

వచ్చే ఏడాది ప్రారంభంలో రష్యా మరోసారి భారీ దాడులకు దిగే ప్రమాదం ఉందని ఉక్రెయిన్‌ అనుమానిస్తోంది. కీవ్‌ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ దాడులకు తెగబడే ప్రమాదం ఉందని భావిస్తోంది. కొన్నిరోజులుగా ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను తగ్గించిన మాస్కో శుక్రవారం మరోసారి విరుచుకుపడింది. ఒక్కరోజే దాదాపు 70 క్షిపణిలతో దాడులు చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది.

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం కనిపిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు భీకర దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు ఉక్రెయిన్ సైనికాధికారులు అంచనా వేశారు. ఈసారి కీవ్‌ను ఆక్రమించేందుకు రెండోసారి యత్నించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్‌ సైనికాధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది మెుదట్లో కీవ్‌పై దండెత్తిన మాస్కో సేనలు రాజధాని నగరాన్ని స్వాధీనం చేసుకోవడంలో విఫలమయ్యాయి. ఈసారి తూర్పు డాన్‌బాస్‌ నుంచి లేదా బెలారస్ నుంచి దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఉక్రెయిన్‌ సైనికాధికాలు అనుమానిస్తున్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు శుక్రవారం 70కిపైగా క్షిపణుల వర్షం కురిపించాయి. వరుస పరాజయాల తర్వాత అక్టోబర్ నుంచి వారానికోసారి ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తుండగా యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. కీవ్‌లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కల్పించి ఉక్రెయిన్‌ను ఎక్కడికక్కడ దిగ్బంధించాలననే కుట్రతో వైమానిక దాడులకు తెగబడినట్లు పేర్కొన్నారు. గతంలో రష్యా దాడులు చేసిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టినా... ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని ఉక్రెయిన్ అధికారులు నిస్సాహాయత వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన చిన్న, మధ్యతరహా వ్యాపారులు 5లక్షల జనరేటర్లను దిగుమతి చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రధాని తెలిపారు.

శుక్రవారం రష్యా జరిపిన దాడుల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత పట్టణంలో ముగ్గురు, ఖేర్సన్‌లో మరొకరు చనిపోయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌ సైనిక వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకే దాడులు చేస్తున్నామన్న రష్యా.. వాటిని ఉక్రెయిన్‌ యుద్ధ నేరాలుగా పిలుస్తోందని తెలిపింది. మరోవైపు, తమ దేశంపై మరిన్ని దాడులు చేసేందుకు రష్యా వద్ద సమృద్ధిగా క్షిపణులు ఉన్నాయని జెలెన్‌స్కీ ఆరోపించారు. రష్యా దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు మరిన్ని అధునాతన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు అందించాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.