ETV Bharat / international

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ మరో కీలక నిర్ణయం!.. మరో రెండేళ్ల పాటు!!

author img

By

Published : Oct 29, 2022, 8:44 PM IST

britain prime minister foreign fund news
బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌

మరో రెండేళ్లపాటు విదేశీసాయాన్ని నిలిపివేయాలని బ్రిటన్‌ యోచిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ పత్రిక వెల్లడించింది. బ్రిటన్‌లోని ఆర్థిక పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తప్పవని ఇప్పటికే స్పష్టం చేసిన బ్రిటన్‌ నూతన ప్రధాని రిషి సునాక్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ సాయాన్ని మరో రెండేళ్లపాటు నిలిపివేయాలని భావిస్తున్నట్లు టెలిగ్రాఫ్‌ పత్రిక తన కథనంలో వెల్లడించింది. మొత్తం జాతీయ ఆదాయంలో 0.5శాతం మొత్తాన్ని బ్రిటన్‌ విదేశీసాయం కోసం వినియోగిస్తుంది. అయితే కరోనా నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యూకే.. రెండేళ్ల క్రితం విదేశీ సాయాన్ని పూర్తిగా నిలిపివేసింది. తాజాగా రిషి సునాక్‌ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిని మరో రెండేళ్లపాటు పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. విదేశీ సాయానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను ప్రధానితోపాటు ఛాన్సలర్‌ ఉమ్మడిగా తీసుకుంటారని యూకే కోశాగారం అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

కరోనా విజృంభణకు ముందు బోరిస్‌ జాన్సన్ ప్రభుత్వంలో రిషి సునాక్‌ ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే 2024-2025 నాటికి విదేశీసాయాన్ని 0.7శాతానికి పెంచుతామని అప్పట్లో ఆయన పేర్కొన్నారు. కానీ, తాజాగా 2026-2027 వరకు విదేశీసాయాన్ని పూర్తిగా నిలిపివేయాలని రిషి ప్రభుత్వం యోచిస్తున్నట్లు టెలిగ్రాఫ్‌ వెల్లడించింది. బ్రిటన్‌ తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేవలం విదేశీ సాయాన్ని నిలిపివేయడమే కాకుండా ఇతర అంశాల్లోనూ మరో మూడేళ్లపాటు కోతలు పడే అవకాశముందని రాసుకొచ్చింది. దేశంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ఆహారం, ఇంధనం, గృహకొనుగోలుపై పన్ను తగ్గింపును రద్దు చేస్తూ బ్రిటన్‌ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.