ETV Bharat / international

పార్క్​లో అలా దొరికిపోయిన రిషి సునాక్.. వెంటనే స్పందించిన అక్షతామూర్తి!

author img

By

Published : Mar 15, 2023, 2:16 PM IST

rishi sunak dog nova
rishi sunak dog nova

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిబంధనలు ఉల్లంఘించారు. గత శనివారం ఓ పార్క్​కు వెళ్లిన ఆయన.. అక్కడి రూల్స్​కు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భార్య, కుటుంబంతో కలిసి ఓ పార్క్​కు వెళ్లిన ఆయన.. అక్కడి నిబంధనలను ఉల్లంఘించారు. అధికారులు వెంటనే అప్రమత్తమై ఈ విషయాన్ని సునాక్ దృష్టికి తీసుకెళ్లారు. గత శనివారం ఈ ఘటన జరిగింది. రూల్స్​కు వ్యతిరేకంగా ఆయన వ్యవహరించడం ఓ వీడియోలో రికార్డైంది.

అసలేమైందంటే?
శనివారం రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి కలిసి లండన్​లోని హైడ్ పార్క్​కు వెళ్లారు. తమ శునకాన్ని వెంట తీసుకొని వెళ్లిన ఆయన.. సెర్పెంటైన్ సరస్సుకు సమీపంలో కాసేపు వాకింగ్​ చేశారు. అయితే, ఆ పార్క్​లో కుక్కలకు గొలుసు కట్టకుండా తిప్పడం నిబంధనలకు విరుద్ధం. రిషి సునాక్.. తన శునకం మెడకు ఎలాంటి బెల్టు కట్టలేదు. దీంతో ఆ పెంపుడు శునకం అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. నిబంధనలను గుర్తు చేశారు. స్పందించిన రిషి సునాక్ భార్య అక్షతామూర్తి.. శునకానికి బెల్టు కట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో.. టిక్​టాక్​లో ప్రత్యక్షమైంది. పార్క్​లో శునకాలను అలా వదిలేయకూడదని చెప్పే సైన్ బోర్డ్​ సైతం ఆ వీడియోలో కనిపిస్తోంది. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది.

ప్రధానమంత్రి సునాక్.. పార్క్​లో విహరిస్తున్నప్పుడు ఆయన పక్కన భద్రతా సిబ్బంది ఉన్నట్లు బీబీసీ పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన గురించి ఆయన భద్రతా దళంలోని కీలక సభ్యుడైన ఓ పోలీస్ అధికారి.. సునాక్​కు వివరించినట్లు తెలిపింది. 'ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న అధికారి.. నిబంధనల గురించి ఓ మహిళకు గుర్తు చేశారు' అని మెట్రోపాలిటన్ పోలీస్ వెల్లడించింది. ఆ మహిళ రిషి సునాక్ భార్యేనని యూకే మీడియా పేర్కొంది. సునాక్ పెంచుకుంటున్న శునకం పేరు నోవా. అది లాబ్రడార్ జాతికి చెందినది.

శునకానికి బెల్టు కట్టిన తర్వాత తాము ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆ వీడియో ఎప్పుడు, ఎవరు తీశారనే విషయం తెలియలేదు. ఇదిలా ఉండగా.. నిబంధనలు ఉల్లంఘించినందుకు సునాక్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై విలేకరులు.. 10 డౌనింగ్ స్ట్రీట్ (యూకే ప్రధాని కార్యాలయం) ప్రతినిధిని ప్రశ్నించారు. అయితే, ఈ వ్యవహారంపై తాము కామెంట్ చేయలేమని ప్రధాన మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.

అయితే, రిషి సునాక్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇది తొలిసారేం కాదు. ఆయన నిబంధనలు ఉల్లంఘించినట్టు గతంలో పలు వీడియోలు బయటకు వచ్చాయి. రెండు నెలల క్రితమే ఆయనకు పోలీసులు ఫైన్ వేశారు. కారులో సీట్ బెల్టు పెట్టుకోకుండా వెళ్లినందుకు పోలీసులు జరిమానా విధించారు. రిషి సునాక్ ఓ అంశంపై మాట్లాడుతూ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్​లోడ్ చేశారు. దీంతో ఆయన సీటు బెల్టు పెట్టుకోలేదన్న విషయం బయటకు వచ్చింది. అప్పుడు ఆయన కారులో వెనక సీట్లో కూర్చున్నారు. ఆ వ్యవహారంపై అనేక విమర్శలు వచ్చాయి. చివరకు రిషి క్షమాపణలు చెప్పారు. పొరపాటున అలా జరిగిందని వివరణ ఇచ్చారు. దీనికి లాంకషైర్ పోలీసుల నుంచి ఆయనకు నోటీసులు వెళ్లాయి. సాధారణంగా ఇలాంటి అతిక్రమణలకు 500 పౌండ్ల వరకు జరిమానా విధిస్తారు. అయితే, ప్రధానికి ఎంత ఫైన్ పడిందన్న విషయంపై స్పష్టత లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.