'70 వేల స్టార్టప్​లు, 100 యూనికార్న్​లు.. త్వరలోనే తయారీ కేంద్రంగా భారత్!'

author img

By

Published : Sep 16, 2022, 2:22 PM IST

PM Narendra Modi at the SCO Summit in Uzbekistan's Samarkand

భారత్​లో 70,000 స్టార్టప్​లు, 100 యూనికార్న్​లు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్​ ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉజ్బెకిస్థాన్​లోని జరుగుతున్న ఎస్​సీఓ సదస్సులో పాల్గొన్న మోదీ.. ఇండియాను తయారీ కేంద్రంగా మార్చాలనుకుంటున్నట్లు తెలిపారు. ఎస్​సీఓ సభ్య దేశాలు.. పరస్పరం ట్రాన్సిట్ యాక్సెస్ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

Modi SCO Summit : ఉజ్బెకిస్థాన్‌లోని సమర్​ఖండ్​ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్​ ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నానని మోదీ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఎస్​సీఓ సభ్య దేశాలు.. ఒకదానికొకటి ట్రాన్సిట్ యాక్సెస్ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

"మేము దేశ ప్రజల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాం. ప్రతీ రంగంలో ఆవిష్కరణలకు మద్దతు ఇస్తున్నాం. నేడు భారత్​లో 70 వేల కంటే ఎక్కువ స్టారప్​ కంపెనీలు, 100కుపైగా యూనికార్న్​లు ఉన్నాయి. కొవిడ్ మహ్మమారిని ప్రపంచం అధిగమిస్తోంది. ఉక్రెయిన్​ సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాలకు సరఫరాల విషయంలో అనేక అంతరాయాలు ఏర్పడ్డాయి. కాబట్టి భారత్​ను ఓ తయారీ కేంద్రంగా మార్చాలని అనుకుంటున్నాం. గుజరాత్‌లో సంప్రదాయ ఔషధాల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది ఏప్రిల్​లో.. మొట్టమొదటి గ్లోబల్ సెంటర్‌ను ప్రారంభించింది."

-- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి

వచ్చే ఏడాది షాంఘై సహకార సంస్థ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్​ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందించారు. తాము సదస్సు విషయంలో పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.

PM Narendra Modi at the SCO Summit in Uzbekistan's Samarkand
పలు దేశాధినేతలతో ప్రధాని మోదీ

ఎస్​సీఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం సమర్‌ఖండ్‌ చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో ఆయనకు ఉజ్బెకిస్థాన్‌ ప్రధాని అబ్దుల్లా అరిపోవ్‌ ఘన స్వాగతం పలికారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ల తర్వాత దీన్ని నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తైవాన్‌ విషయంలో చైనా దూకుడు క్రమంలో జరుగుతున్న ఈ సదస్సు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకొంది.

సదస్సు తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడు షావత్‌ మిర్జియోయెవ్‌, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ప్రధాని మోదీ వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీపై స్పష్టత రాలేదు. తూర్పు లద్ధాఖ్‌లో సరిహద్దు సమస్య తలెత్తిన తర్వాత తొలిసారి మోదీ, జిన్‌పింగ్‌లు ప్రత్యక్షంగా కలుసుకోనున్నారు. ప్రాంతీయ శాంతి, భద్రతలు, వాణిజ‌్యం, కనెక్టివిటీ, సంస్కృతి, టూరిజం వంటి అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నట్లు విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి: పాపం పాక్ ప్రధాని.. హెడ్​ఫోన్స్​తో తంటా.. మీమర్స్​కు పంట

ఉక్రెయిన్​లో రష్యా సైనికుల ఊచకోత.. గోతిలో 440 మృతదేహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.