ETV Bharat / international

పాక్​ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్​​.. గెలుపు లాంఛనమే!

author img

By

Published : Apr 11, 2022, 5:13 AM IST

Updated : Apr 11, 2022, 6:56 AM IST

pakisthan-new-president-shehbaz-election
pakisthan-new-president-shehbaz-election

Pakisthan News: నెల రోజుల నాటకీయ పరిణామాల మధ్య పాకిస్థాన్‌ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ ఉద్వాసనకు గురైన వేళ ఆ దేశ జాతీయ అసెంబ్లీ నేడు(సోమవారం) భేటీ కానుంది. ప్రధాని పదవికి నామినేషన్‌ దాఖలు చేసిన విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి షెహబాజ్‌ షరీఫ్‌ ఆ పదవికి ఎంపిక కావడం లాంఛనమే కానుంది. జాతీయ అసెంబ్లీ భేటీ నేపథ్యంలో పాక్‌ విమానాశ్రయాల్లో నిఘా పెంచారు. కీలక అధికారులు ఎవరూ దేశం విడిచివెళ్లరాదని ఆదేశాలు జారీ అయ్యాయి.

Pakisthan New President: పాకిస్థాన్‌లో మార్చి8న మొదలైన రాజకీయ డ్రామాకు నేడు(సోమవారం) తెరపడనుంది. అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ను విపక్షాలు తొలగించిన నేపథ్యంలో కొత్త ప్రధాని ఎంపికకు వీలుగా ఆ దేశ జాతీయ అసెంబ్లీ నేడు భేటీ కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జాతీయ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ తరఫున మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ నామినేషన్ వేశారు. పాక్‌ జాతీయ అసెంబ్లీలో మొత్తం స్ధానాల సంఖ్య 342 కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్య 172. అయితే ఇమ్రాన్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశానికి అనుకూలంగా 174 మంది మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈ సంఖ్యా బలం ప్రకారం షెహబాజ్‌ షరీఫ్‌ పాక్‌ ప్రధాని కావడం లాంఛనమే కానుంది. షెహబాజ్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సోదరుడు. ఆదివారం షెహబాజ్‌ మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ, పాక్‌ పీపుల్స్‌ పార్టీ ఛైర్మన్‌ బిలావల్‌ బుట్టో జర్దారీతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కలిసి పని చేసే అంశం సహా ఎన్నికల సంస్కరణలపై చర్చలు జరిపారు.

ప్రత్యేక నిఘా.. పాక్‌ జాతీయ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆ దేశ విమానాశ్రయాల్లో నిఘా పెంచారు. ప్రధాన దర్యాప్తు సంస్ధ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది పలు చోట్ల మోహరించారు. ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారులు ఎవరూ నిరభ్యంతర పత్రం లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇమ్రాన్‌ మూడో భార్య స్నేహితురాలు ఫరాఖాన్‌పై అవినీతి ఆరోపణలు ఉండగా, భారీగా నగదుతో ఆమె వారం క్రితం దుబాయ్‌ పారిపోయిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అటు ఇమ్రాన్‌ సహా ఆయన మంత్రివర్గంలో పని చేసిన సభ్యులు దేశం విడిచివెళ్లరాదని ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ నేడే జరగనుంది. అటు ఇమ్రాన్‌ఖాన్‌ తొలగింపును వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు దేశంలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

భారత్​-పాక్​ సంబంధాలు మెరుగుపడేనా?.. దూకుడుగా వ్యవహరించే ఇమ్రాన్​ కంటే వాస్తవికత దృక్ఫథంతో వ్యవహరించే అనుభవజ్ఞుడైన షెహబాజ్​ షరీఫ్​ హయాంలో భారత్​-పాక్ సంబంధాలు ఎంతో కొంత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. షెహబాజ్​కు సన్నిహితుడైన పాకిస్థాన్​ ముస్లిం లీగ్​-ఎన్​ నేత సమీపుల్లా ఖాన్​ పీటీఐతో మాట్లాడుతూ.. భారత్​ విషయంలో తమ నేత బలమైన, ఆచరణాత్మకమైన ఓ కొత్త విధానాన్ని రూపొందిస్తారని తెలిపారు. షెహబాజ్​ సోదరుడైన నవాజ్​ షరీఫ్​ పాక్​ ప్రధాని హోదాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో స్నేహపూర్వకంగానే వ్యవహరించేవారు.

చైనాతో సంబంధాలు ఎలా?..: చైనా, పాకిస్థాన్‌ సంబంధాలు ఇమ్రాన్‌ఖాన్‌ హయాంలో కంటే షెహబాజ్‌ షరీఫ్‌ పాలనలో మరింత మెరుగ్గా ఉంటాయని బీజింగ్‌ అధికారిక పత్రిక పేర్కొంది. పాక్‌లో సోమవారం షెహబాజ్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో 'గ్లోబల్‌ టైమ్స్‌' పత్రిక ఆదివారం ఈ కథనాన్ని ప్రచురించింది. పాక్‌లో నాయకత్వ మార్పు ఆ దేశ అంతర్గత వ్యవహారమని, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయంలో పార్టీలన్నిటి వైఖరి ఒకేలా ఉంటుందని అభిప్రాయపడింది. ఇమ్రాన్‌ఖాన్‌ స్థానంలో అధికారం చేపట్టనున్న 'షరీఫ్‌' కుటుంబానికి చెందిన షెహబాజ్‌ గతంలో మాదిరిగా పాక్‌ - చైనా సంబంధాలను ముందుకు తీసుకువెళతారని తెలిపింది.

ఇదీ చదవండి: యుద్ధరంగంలోకి రష్యా కొత్త కమాండర్.. 'విక్టరీ డే' నాటికి..!

Last Updated :Apr 11, 2022, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.