ETV Bharat / international

పోర్న్ స్టార్ కేసులో ట్రంప్​కు చిక్కులు.. అరెస్ట్​ ఖాయం!

author img

By

Published : Mar 31, 2023, 8:06 AM IST

Updated : Mar 31, 2023, 9:14 AM IST

ప్రపంచం ఊహించిందే జరిగింది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌పై.. స్థానిక కోర్టు నేరాభియోగాలు మోపింది. అమెరికా అధ్యక్ష చరిత్రలో నేర అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ అపఖ్యాతి మూటగట్టుకున్నారు.

newyork Grand jury indicts Donald Trump for role in hush money payments to porn star
newyork Grand jury indicts Donald Trump for role in hush money payments to porn star

అమెరికా మాజీ అధ్యక్షుడు.. రిపబ్లికన్‌ తరఫున మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న డొనాల్డ్‌ ట్రంప్‌నకు.. భారీ షాక్‌ తగిలింది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు చెల్లింపుల కేసులో.. అమెరికా మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ అభియోగాలకు మాన్‌హట్టన్ గ్రాండ్ జ్యూరీ ఆమోదం తెలిపింది. ట్రంప్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు చేస్తారన్న దానిపై ఎలాంటి స్పష్టత లేకపోయినా.. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా నేరారోపణలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌ పేరు చరిత్రకెక్కింది.

ఈ తరుణంలో ట్రంప్‌ను అరెస్ట్‌ చేస్తారా.. లేక కోర్టులో ఆయనే లొంగిపోతారా.. కేవలం కోర్టు విచారణతో సరిపెడతారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. నేరారోపణలపై ట్రంప్‌ కోర్టులో లొంగిపోయే విషయంపై ఆయన లాయర్లతో చర్చలు జరిపినట్లు.. మాన్‌హాట్టన్ జిల్లా అటార్నీ ఆల్విన్ బ్రాగ్ కార్యాలయం ధ్రువీకరించింది.

విమర్శలు తిప్పికొట్టిన ట్రంప్​..
తనపై వచ్చిన ఆరోపణలను డొనాల్డ్​ ట్రంప్​ ఖండించారు. తనను రాజకీయ నాయకులు కావాలనే ఇరికిస్తున్నారని ఆరోపించారు. 'ఈ పాపం బైడెన్​ను వెంటాడుతుందని.. భారీగా ఎదురుదెబ్బ తగులుతుందని నేను నమ్ముతున్నాను' అని ట్రంప్​ అన్నారు. అంతకుకుముందు.. త్వరలోనే తనను అరెస్టు చేసే అవకాశాలున్నాయని ట్రంప్​ చెప్పారు.

'చరిత్రలో ఇదో చీకటి రోజు'.. విపక్షం మండిపాటు..
ట్రంప్‌పై నేరారోపణలను రిపబ్లికన్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నేరారోపణలు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించింది. ట్రంప్‌పై నేరారోపణ అమెరికాను కోలుకోలేని దెబ్బ తీసిందని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో టాప్ రిపబ్లికన్ మెక్‌కార్తీ అన్నారు. ట్రంప్‌పై క్రిమినల్ కేసులో అభియోగాల నమోదు కక్ష సాధింపే అని.. దేశ చరిత్రలో ఇదొక చీకటి రోజని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి స్థానానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి విమర్శించారు. డొనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణ హర్షణీయం కాదన్న బ్రూస్టర్.. న్యాయం మాత్రమే గెలవాలని అభిప్రాయపడ్డారు. ఇది చరిత్రలో అత్యున్నత స్థాయిలో రాజకీయ ప్రక్షాళన అని డెమోక్రటిక్‌ పార్టీ అభిప్రాయపడింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఈ ఘటనతో రుజువైందని తెలిపింది.

ఇదీ కేసు..
2016 ఎన్నికల ప్రచారం సమయంలో.. శారీరక సంబంధం బయటకు రాకుండా పోర్న్‌ స్టార్​ స్టార్మీ డేనియల్స్‌తో డొనాల్డ్‌ ట్రంప్‌ అనైతిక ఒప్పందం చేసుకున్నారని.. నేరాభియోగాలు నమోదయ్యాయి. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత స్టార్మీ కోర్టును ఆశ్రయించారు. తనతో సంబంధాన్ని బయటపెట్టవద్దంటూ ట్రంప్‌ బెదిరించారని.. ట్రంప్ లాయరు తనకు లక్షా 30 వేల డాలర్లు ఇచ్చారని స్మార్టీ డేనియల్స్‌ ఆరోపించారు. స్టార్మీ వ్యాఖ్యలు నిజమేనంటూ ట్రంప్ న్యాయ బృందంలోని ఓ న్యాయవాది ప్రకటించారు. అమెరికాలో ఇలా కోర్టు బయట ఒప్పందం చేసుకోవడం తప్పు కాకపోయినా.. స్టార్మీకి చెల్లించిన డబ్బును ట్రంప్‌ వ్యాపార ఖర్చుగా చూపించడం ఆయన మెడకు చుట్టుకుంది. ఇలా బిజినెస్ రికార్డులను తప్పుగా నమోదు చేయడం అమెరికాలో చట్టవిరుద్ధం. ఈ కేసు విచారణను ట్రంప్ ఇప్పటికే ప్రకటించగా.. వచ్చే వారం ట్రంప్ లొంగిపోవచ్చని ఆయన న్యాయ బృందం చెబుతోంది.

Last Updated : Mar 31, 2023, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.