ETV Bharat / international

5 రోజుల తర్వాత కూడా సజీవంగా బయటపడిన 67 మంది.. భారతీయుడు మృతి.. 25వేలకు చేరిన మృతుల సంఖ్య

author img

By

Published : Feb 11, 2023, 10:16 PM IST

turkey syria earthquake
turkey syria earthquake

ప్రకృతి ప్రకోపానికి శిథిలాల దిబ్బగా మారిన తుర్కియే, సిరియాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 25,000 దాటింది. అయితే ఐదు రోజుల తర్వాత కూడా పలువురు మృత్యువును జయించి ప్రాణాలతో బయటపడుతున్నారు. దీంతో ఆచూకీ లేకుండాపోయిన తమ వారిపై బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా, తుర్కియేలో అదృశ్యమైన ఓ భారతీయుడు శనివారం శిథిలాల కింద శవమై కనిపించాడు.

ప్రకృతి ప్రళయంతో తుర్కియే, సిరియాలు శిథిలాల దిబ్బగా మారాయి. భూకంపం సంభవించిన 5 రోజుల తర్వాత కూడా కొందరు బాధితులు ప్రాణాలతో బయటపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 67 మందిని సహాయ బృందాలు కాపాడాయి. తిండి తిప్పలు దేవుడురుగు కానీ.. శిథిలాల కింద కనీసం ఊపిరి తీసుకోవటమే కష్టమైన పరిస్థితుల్లో.. ప్రాణాలతో పలువురు మృత్యుంజయులుగా బయటపడుతున్నారు. ఇప్పటికే మరణించిన వారి సంఖ్య 25,000 దాటింది. తుర్కియేలో 21,848 మంది మృతి చెందగా.. సిరియాలో 3,553 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. తుర్కియేలో అదృశ్యమైన ఉత్తరాఖండ్​కు చెందిన వ్యక్తి శనివారం తొలగించిన శిథిలాల కింద శవమై కనిపించాడు.

భూకంపం సంభవించిన 5 రోజుల తర్వాత తుర్కియేలో 2 నెలల పసికందును సహాయక సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. అదియామెన్‌ ప్రావిన్సులో దంపతులను 128 గంటల తర్వాత శిథిలాల కింద నుంచి సజీవంగా కాపాడారు. హతాయ్‌ ప్రావిన్సులో 123 గంటల తర్వాత 13 ఏళ్ల బాలుడినీ, ఇద్దరు మహిళలను కాపాడినట్లు తుర్కియే అధికారులు తెలిపారు. ఖరామన్‌ మరాస్‌లో శిథిలాల కింద చిక్కుకుకున్న 13ఏళ్ల బాలుడు చేతిలో పెంపుడు చిలుకను 55 గంటలు పట్టుకుని.. చివరికి ప్రాణాలతో బయటపడ్డాడు. చిలుకను బంధువులకు అప్పగించిన తర్వాత.. బాధిత బాలుడిని సహాయక సిబ్బంది అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

సహాయక చర్యలు చేపడుతున్న ప్రావిన్సుల్లో శ్మశాన వాతావరణం నెలకొంది. శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు వీలుగా.. ఎలాంటి శబ్దం చేయకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిశ్శబ్దం వల్ల శిథిలాల కింద చిక్కుకున్నవారి అరుపులు వినిపిస్తాయనీ.. ఆ తర్వాత వారిని రక్షించవచ్చని అంటున్నారు. తుర్కియే, సిరియా భూకంపంలో ఇప్పటివరకు 25వేల మందికిపైగా చనిపోగా.. వేల సంఖ్యలో బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లక్షలాది మంది నిర్వాసితులుగా మారారు. కొందరు రోడ్ల వెంట, మరికొందరు ప్రార్థనా స్థలాలు, స్టేడియంలో తలదాచుకుంటున్నారు.

భూప్రళయానికి బలైన భారతీయుడు..
తుర్కియే, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపం కారణంగా అదృశ్యమైన ఓ భారతీయుడు మృతి చెందాడు. ఉత్తరాఖండ్​లోని పౌరీ జిల్లాకు చెందిన విజయ్​కుమార్​.. శనివారం ఉదయం తాను బస చేసిన మలట్య ప్రాంతంలోని ఓ హోటల్​​ శిథిలాల కింద శవమై కనిపించాడు. విజయ్​.. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆఫీస్ పనిమీద తుర్కియేకు వెళ్లాడు. విజయ్​​ చేతిపై ఉన్న "ఓం" అనే టాటు ఆధారంగా అక్కడి అధికారులు భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో ఉత్తరాఖండ్​లో ఉండే అతని కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దీంతో వారు భారత్​లో ఉన్న విజయ్​ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. విజయ్​ మృతదేహం భారత్​కు రావడానికి కనీసం మూడురోజులు సమయం పడుతుందని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

turkey syria earthquake
రోదిస్తున్న మృతుడు విజయ్​ కుమార్ కుటుంబసభ్యులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.