ETV Bharat / international

పుతిన్ పర్యవేక్షణలో రష్యా 'అణు ప్రయోగాలు'​.. అదే పరిష్కారం కాదన్న రాజ్​నాథ్​

author img

By

Published : Oct 26, 2022, 6:00 PM IST

Updated : Oct 26, 2022, 7:20 PM IST

russia nuclear drills today
russia nuclear drills today

డర్టీ బాంబు ప్రయోగానికి ఉక్రెయిన్‌ యత్నిస్తోందని ఆరోపణలు చేసిన రష్యా అణు విన్యాసాలు నిర్వహించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వీటిని పర్యవేక్షించారు. తాము ప్రయోగించిన బాలిస్టిక్‌, క్రూజ్‌ క్షిపణులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యాపై అణుదాడి జరిగితే.. ప్రత్యర్థులపై భారీగా అణ్వస్త్రాలు ప్రయోగించేందుకు ఈ విన్యాసాలను చేపట్టినట్లు మాస్కో వెల్లడించింది

రష్యా, పశ్చిమ దేశాలు పరస్పర అణు హెచ్చరికలు చేసుకుంటున్న వేళ.. మాస్కో వ్యూహాత్మక అణు బలగాలు విన్యాసాలు నిర్వహించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్వయంగా ఈ విన్యాసాలను పర్యవేక్షించారు. బాలిస్టిక్‌, క్రూజ్‌ క్షిపణులను ఈ విన్యాసాల్లో భాగంగా రష్యా ప్రయోగించింది. ఈ విన్యాసాల్లో భాగంగా అన్ని లక్ష్యాలను చేరుకున్నట్లు రష్యా ఓ ప్రకటన చేసింది. రష్యా-పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ రష్యా చేసిన ఈ అణు విన్యాసాలు అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. రష్యాపై అణుదాడి జరిగితే అందుకు ప్రతీకారంగా ప్రత్యర్థులపై భారీగా అణ్వస్త్రాలు ప్రయోగించేందుకే ఈ విన్యాసాలను చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వెల్లడించారు.

మరోవైపు అణు విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు రష్యా తమకు ముందే సమాచారం ఇచ్చినట్లు అమెరికా ప్రకటించింది. డర్టీ బాంబును తమపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌ యత్నిస్తున్నట్లు రష్యా ఆరోపించిన కొన్ని రోజులకే ఈ అణు విన్యాసాలను ఆ దేశం చేపట్టడం గమనార్హం. ఐతే రష్యా ఆరోపణలను ఇప్పటికే ఉక్రెయిన్‌, పశ్చిమ దేశాలు ఖండించాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై 9 నెలలు పూర్తికాగా చాలాసార్లు ఇరువర్గాలు అణు హెచ్చరికలు చేసుకున్నాయి. రష్యా అణుబాంబు ప్రయోగిస్తే అది ఆ దేశం చేసిన తీవ్ర తప్పిదమే అవుతుందని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు.

'అణు బాంబు ప్రయోగం పరిష్కారం కాదు'
మరోవైపు అణు బాంబు ప్రయోగాలు రష్యా, ఉక్రెయిన్​ ఇరుదేశాలకు శ్రేయస్కరం కాదని చెప్పారు భారత రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​. యుద్ధానికి అణుబాంబు ప్రయోగం పరిష్కారం కాదని తెలిపారు. చర్చలు, దౌత్య సంబంధాల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగుతో ఫోన్​లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డర్టీ బాంబు ప్రయోగంపై రష్యా, పశ్చిమ దేశాలు ఆరోపించుకున్న తరుణంలో రాజ్​నాథ్​సింగ్​.. షోయిగుతో మాట్లాడారు.

ఇవీ చదవండి: రష్యానే 'డర్టీబాంబ్‌' ప్రయోగానికి సిద్ధమవుతోంది: జెలెన్​స్కీ

భారత్‌తో పీటముడిని విప్పేనా?.. 'స్వేచ్ఛా వాణిజ్యం'పై రిషి నిర్ణయమేంటో?

Last Updated :Oct 26, 2022, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.