ETV Bharat / international

పాకిస్థాన్​లో జాక్​మా సీక్రెట్ టూర్.. చైనాకు సమాచారం ఇవ్వకుండానే మీటింగ్స్!

author img

By

Published : Jul 3, 2023, 1:22 PM IST

Jack Ma in Pakistan : చైనా కుబేరుడు జాక్ మా.. పాకిస్థాన్​లో ఆసక్మికంగా పర్యటించారు. దాదాపు ఒక రోజంతా లాహోర్​లో ఉన్న ఆయన.. పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచారు. చైనా దౌత్య కార్యాలయానికి కూడా ఈ సమాచారం ఇవ్వలేదని తెలిసింది.

jack ma in pakistan
jack ma in pakistan

Jack Ma in Pakistan : చైనా పాలకులపై విమర్శలు చేసి అక్కడి ప్రభుత్వ ఆగ్రహానికి గురైన అలీబాబా సంస్థల వ్యవస్థాపకుడు జాక్ మా పాకిస్థాన్​లో ప్రత్యక్షమయ్యారు. పలు దేశాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తున్న ఆయన.. ఇటీవల దాయాది దేశంలో కనిపించారు. ఈ మేరకు పాకిస్థాన్ స్థానిక వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే, జాక్ మా పర్యటన వివరాలు గోప్యంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ పర్యటనకు సంబంధించి అనేక ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.

Jack Ma Pakistan : పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్​మెంట్ (బీఓఐ) మాజీ ఛైర్మన్ మహమ్మద్ అజ్ఫర్ అహ్సాన్.. జాక్ మా పర్యటనను ధ్రువీకరించారు. చైనా బిలియనీర్ జాక్.. జూన్ 29న లాహోర్ వచ్చారని అజ్ఫర్ వివరించారు. 23 గంటల పాటు లాహోర్​లో ఉన్నారని తెలిపారు. తన పర్యటన సందర్భంగా పాకిస్థాన్ ప్రభుత్వ అధికారులు, ఆ దేశ మీడియాతో ఎలాంటి సంభాషణ జరపలేదు. ఓ ప్రైవేటు ప్రాంతంలో బస చేశారు. అనంతరం జూన్ 30న పాక్ నుంచి తిరిగి వెళ్లిపోయారు. జాక్ మా లాహోర్ పర్యటన వేళ ఆయన వెంట మరో వ్యాపారవేత్తలు సైతం ఉన్నారని తెలుస్తోంది. జాక్ మా నేపాల్ మీదుగా పాకిస్థాన్ చేరుకున్నట్లు సమాచారం.

అయితే, అధికారిక సమాచారమేమీ లేకపోవడం వల్ల జాక్ మా పర్యటనపై పాకిస్థాన్​లో అనేక ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. పాకిస్థాన్​లో వ్యాపార అవకాశాలను జాక్ మా అన్వేషించారని సమాచారం. అలాగే ట్రేడ్ సెంటర్​ను సందర్శించి, ప్రముఖ వ్యాపారవేత్తలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఏవైనా ఒప్పందాలు జరిగాయా లేదా అనే విషయం మాత్రం తెలియలేదు. జాక్.. ఆకస్మికంగా పర్యటించడానికి గల కారణాలు గోప్యంగా ఉన్నప్పటికీ.. రాబోయే రోజుల్లో ఇది పాకిస్థాన్​కు సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని అహ్సాన్ చెప్పుకొచ్చారు. అయితే, ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని సమాచారం. దీనికి సంబంధించి చైనా దౌత్య కార్యాలయానికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిసింది. అయితే, జాక్​మాతో పాకిస్థాన్ ప్రభుత్వం సమావేశాలు జరపాలని, ఆయనకు ఉన్న అనుభవాన్ని దేశ ప్రగతి కోసం ఉపయోగించుకోవాలని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Jack Ma missing : అలీబాబా గ్రూప్​ను స్థాపించిన జాక్ మా.. అపర కుబేరుడిగా ఎదిగారు. 2020లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చైనా ప్రభుత్వాన్ని విమర్శించారు. అప్పటి నుంచి ఆయనకు వరుసగా సమస్యలు ఎదురయ్యాయి. ఆయనకు చెందిన యాంట్ గ్రూప్​పై చైనా సర్కారు చర్యలు చేపట్టింది. దీంతో కొన్ని నెలల పాటు బయటి ప్రపంచం కంట పడలేదు. 2021 చివర్లో ఆయన చైనాను వీడారు. ఆ తర్వాతి నుంచి జాక్ మా బహిరంగంగా అరుదుగా కనిపించారు. థాయ్​లాండ్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల్లో ఆయన ఉన్నారని వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించి ఫొటోలు ఇంటర్నెట్​లో చక్కర్లు కొట్టాయి. అయితే, గత మార్చ్​లో జాక్​మా చైనాకు తిరిగి వచ్చారని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.