జాక్​ మా ఎక్కడ?.. 2 నెలలుగా బిలియనీర్ అదృశ్యం

author img

By

Published : Jan 4, 2021, 2:12 PM IST

jack ma

చైనా ప్రభుత్వంతో వివాదంలో చిక్కుకున్న ఆ దేశ బిలియనీర్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్​ మా కనిపించడం లేదు. జాక్​ బయటి ప్రపంచానికి కనిపించి దాదాపు రెండు నెలలయింది. ఆయన ఏమయ్యారు?

ప్రభుత్వానికి సలహాలివ్వబోయి కష్టాలు కొనితెచ్చుకున్న చైనా టెక్‌ బిలియనీర్‌, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా.. గత రెండు నెలలుగా బాహ్యప్రపంచానికి కనిపించట్లేదు. ప్రభుత్వంతో వివాదం నడుస్తున్న సమయంలో ఆయన అదృశ్యం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

దాదాపు రెండు నెలల క్రితం చైనా పాలకులకు సలహాలు ఇవ్వబోయి వారి ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నవంబరులో తాను నిర్వహిస్తున్న టాలెంట్‌ షో 'ఆఫ్రికాస్‌ బిజినెస్‌ హీరోస్‌' ఫైనల్‌ ఎపిసోడ్‌కు న్యాయమూర్తిగా వ్యవహరించాల్సి ఉండగా.. ఆయన రాలేదు. జాక్‌ మా స్థానంలో అలీబాబా ఎగ్జిక్యూటివ్‌ ఆ కార్యక్రమానికి న్యాయమూర్తిగా వ్యవహరించారు. అంతేగాక, ఆ షో వెబ్‌సైట్‌ నుంచి ఆయన ఫొటోలను తొలగించినట్లు టెలిగ్రాఫ్‌ పత్రిక వెల్లడించింది. ఆ తర్వాత నుంచి కూడా జాక్‌ మా ఎప్పుడూ బయటి ప్రపంచానికి కనబడలేదు. దీంతో ఆయన ఎక్కడున్నారన్నది మిస్టరీగా మారింది. అయితే, షెడ్యూల్‌ వివాదం కారణంగా ఫైనల్‌ ఎపిసోడ్‌కు జాక్‌ మా రాలేదని అలీబాబా అధికారి ప్రతినిధి చెప్పినట్లు తెలుస్తోంది.

గతేడాది అక్టోబరు 24న చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్‌ మా ప్రసంగిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని హితవు పలికారు. ఇంకేముంది.. జాక్‌ మా వ్యాఖ్యలపై మండిపడ్డ సర్కార్‌.. ఆయనపై ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. అంతేగాక, ఆయనకు చెందిన యాంట్‌ ఫైనాన్షియల్‌ ఐపీవోను అడ్డుకొంది. దీంతో ఆలీబాబా గ్రూప్‌ సంపదతో పాటు జాక్‌ మా ఆస్తులు కూడా కరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఆయన కనిపించకుండా పోవడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.