ETV Bharat / international

India Canada Diplomatic Crisis : టెర్రరిస్టులకు అడ్డాగా కెనడా : భారత విదేశాంగ శాఖ

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 6:39 PM IST

India Canada Diplomatic Crisis : ఖలిస్థానీ టెర్రరిస్టు నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలు రాజకీయ దురుద్దేశమేనని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు. కెనడా.. ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆయన దుయ్యబట్టారు.

India-Canada Diplomatic Row
India Canada Diplomatic Crisis

India Canada Diplomatic Crisis : ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్​ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలు దురుద్దేశపూర్వకమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలతోనే కెనడా ఇలా భారత్‌పై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి ఈ ఆరోపణలను కెనడా ప్రధాని ట్రూడో తేగా వాటిని మోదీ తోసిపుచ్చినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలనూ కెనడా భారత్‌కు ఇవ్వలేదని స్పష్టం చేశారు. సాక్ష్యాలు సమర్పిస్తే పరిశీలించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు. తాము మాత్రం కెనడాలో భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నేరపూరిత కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు ఎన్నో ఆధారాలను సమర్పించినా ఆ దేశం సరైన చర్యలు తీసుకోలేదని అరిందమ్‌ బాగ్చి విమర్శించారు.

"కెనడా నుంచి నిర్దిష్టమైన సమాచారం వస్తే దాన్ని పరిశీలించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే విషయాన్ని కెనడాకు కూడా చెప్పాం. అలాంటి స్పష్టమైన వివరాలు ఏమీ కెనడా నుంచి మాకు రాలేదు. కెనడాలో భారత్‌కు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు పాల్పడ్డ నేరాలకు సంబంధించి మేము సాక్ష్యాధారాలను ఎప్పటికప్పుడు కెనడాకు అందిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అంతేకాకుండా గత కొన్నేళ్లుగా దాదాపు 20-25 మంది వ్యక్తులను మన దేశానికి అప్పగించాలని కెనడాను కోరాం. అయితే, అటు వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. మన డిమాండ్లపై కెనడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. "

- అరిందమ్‌ బాగ్చి, విదేశాంగశాఖ అధికార ప్రతినిధి

'వీసా సర్వీసులను అందుకే ఆపాం..'!
కెనడాలో భారత దౌత్య కార్యాలయాలకు బెదిరింపులు వస్తున్నట్లు అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. "భద్రతాపరమైన కారణాలతోనే కెనడాలో వీసా దరఖాస్తు ప్రక్రియలను హైకమిషన్లు, కాన్సులేట్లు పూర్తిచేయలేకపోతున్నాయి. ఈ కారణంగానే అన్ని రాకాల వీసా సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాం" అని ఆయన ధ్రువీకరించారు. ఈ-వీసాలను కూడా తాత్కాలికంగా సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. "ఇతర దేశాల నుంచి దరఖాస్తులు చేసుకునే కెనడియన్లకు కూడా వీసాలు ఇవ్వలేం. కెనడియన్లు భారత్‌కు రాకుండా అడ్డుకోవాలనేది మా ఉద్దేశం కాదు. సరైన వీసాలతో (సస్పెన్షన్‌ ఉత్తర్వులకు ముందు జారీ అయిన వీసాలు) వారు ఎప్పుడైనా ఇండియాకు రావొచ్చు. కానీ, ఆ దేశంలోని పరిస్థితులు మన హైకమిషన్‌ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి" అని బాగ్చి వివరించారు.

వ్యవస్థీకృత నేరాలకు అడ్డాగా కెనడా!
అంతర్జాతీయ స్థాయిలో పరువు పోవడం విషయానికి వస్తే ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, వ్యవస్థీకృత నేరాలకు కెనడా స్వర్గధామంగా మారిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా తమ ఖ్యాతి దెబ్బతింటుందని కెనడా ఆందోళన చెందాల్సి ఉంటుందని బాగ్చి వ్యాఖ్యానించారు.

మేము భద్రత కల్పిస్తున్నాం.. మీరు కూడా..!
కెనడాలో ఉన్న భారత దౌత్య సిబ్బంది సంఖ్య కంటే భారత్‌లో ఉన్న కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉందని.. ఇది సమానత్వ సూత్రానికి వ్యతిరేకమని బాగ్చి అన్నారు. ఆ సంఖ్యను తగ్గించుకోవాల్సిన అవసరం కెనడాకు ఉందని, దీనిపై కూడా ఆ దేశాన్ని అభ్యర్థించినట్లు ఆయన తెలిపారు. అలాగే భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తలు తరచూ జోక్యం చేసుకుంటున్నారని అధికార ప్రతినిధి మండిపడ్డారు. ఇక మన దేశంలోని విదేశీ దౌత్యవేత్తలకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. కెనడా కూడా మన దౌత్యవేత్తల పట్ల ఇదే విధంగా నిబద్ధతతో ప్రవర్తించాలని భారత్​ కోరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు కెనడాలోని భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేశామని.. అక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా వారు కాన్సులేట్‌ను వెంటనే సంప్రదించొచ్చని అరిందమ్‌ బాగ్చి చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.