ETV Bharat / international

ఐరోపాపై మళ్లీ కొవిడ్‌ పడగ.. మూడింతలు పెరిగిన కేసులు

author img

By

Published : Jul 20, 2022, 4:14 AM IST

కొవిడ్‌
కొవిడ్‌

COVID: ఐరోపాలో మరోసారి కొవిడ్‌ విజృంభిస్తోంది. గత ఆరు వారాల వ్యవధిలో ఇక్కడ కరోనా కేసులు మూడింతలు పెరిగాయి. ఆస్పత్రుల చేరికల్లో సైతం రెండు రెట్లు పెరుగుదల నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం ఈ వివరాలు వెల్లడించింది.

COVID: ఐరోపాలో మరోసారి కొవిడ్‌ విజృంభిస్తోంది. గత ఆరు వారాల వ్యవధిలో ఇక్కడ కరోనా కేసులు మూడింతలు పెరిగాయి. ఆస్పత్రుల చేరికల్లో సైతం రెండు రెట్లు పెరుగుదల నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం ఈ వివరాలు వెల్లడించింది. అయితే, ఐసీయూల్లో చేరికలు మాత్రం స్వల్పంగా ఉన్నాయని తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో ఐరోపా డైరెక్టర్‌ డా.హన్స్‌ క్లూగే ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజలు మహమ్మారిని తక్కువగా అంచనా వేయకూడదు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్లు ఖండం అంతటా కొత్త వేవ్‌కు కారణమవుతున్నాయి. మళ్లీ మళ్లీ ఇన్‌ఫెక్షన్లు.. దీర్ఘకాల కొవిడ్‌కు దారితీస్తాయి’ అని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఐరోపాలోని 53 దేశాల్లో గత వారం దాదాపు 30 లక్షల కొత్త కేసులు బయటపడ్డాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ప్రతి వారం మూడు వేల మంది మరణిస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతోన్న కేసుల్లో దాదాపు సగం ఇక్కడే వెలుగుచూస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగానూ టెస్టులు తగ్గించినప్పటికీ.. గత ఐదు వారాలుగా కేసులు పెరిగాయని పేర్కొంది. ‘కేసులతోపాటు ఆస్పత్రుల్లో చేరికల్లోనూ పెరుగుదల నమోదవుతోంది. రానున్న శీతాకాల నెలల్లో పరిస్థితి మరింత దిగజారుతోంది’ అని క్లూగే చెప్పారు. ఈ పరిస్థితులు.. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న వైద్య వ్యవస్థకు సవాలేనన్నారు.

ఈ క్రమంలోనే ఐరోపాలో శీతాకాలంలో కరోనా నియంత్రణ కోసం డబ్ల్యూహెచ్‌వో మంగళవారం తన వ్యూహాలను ప్రకటించింది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ఐదేళ్లు, ఆపై వయస్సు ఉన్న వారికి బూస్టర్ డోస్‌ అందజేయాలని సూచించింది. పౌరులంతా బయట తిరిగినప్పుడు, ఇళ్లల్లో ఉన్నా తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించింది. పాఠశాలలు, కార్యాలయాలు, ఇతర ప్రదేశాల్లో మెరుగైన వెంటిలేషన్‌ ఏర్పాటు చేయాలని తెలిపింది. ‘ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మాస్క్ తప్పనిసరి కాదు అంటే.. దాన్ని నిషేధించినట్లు అర్థం కాదు’ అని క్లూగే తెలిపారు.

ఇవీ చదవండి: బ్రిటన్​లో భానుడి భగభగలు.. టెంపరేచర్ ఆల్​టైం హై.. అల్లాడుతున్న జనం

రిషి సునాక్ దూకుడు​.. మూడో రౌండ్​లోనూ టాప్​.. పెరిగిన ఆధిక్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.