ETV Bharat / international

మళ్లీ కరోనా కలకలం.. వేగంగా కొత్త వేరియంట్​ వ్యాప్తి.. W.H.O ఏమందంటే?

author img

By

Published : Aug 4, 2023, 10:50 PM IST

Coronavirus New Variant Uk
Coronavirus New Variant Uk

Coronavirus New Variant UK : కరోనా​ ఒమిక్రాన్​ వేరియంట్​ నుంచి పుట్టుకొచ్చిన మరో వేరియంట్​ యూకేలో కలకలం సృష్టిస్తోంది. ఈజీ.5.1గా వర్గీకరించిన ఈ వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్​ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Coronavirus New Variant Uk : కొవిడ్​ ఒమిక్రాన్​ వేరియంట్​ నుంచి ఈజీ.5.1 అనే పేరుతో మరో వేరియంట్​ పుట్టుకొచ్చింది. ఈ మేరకు యునైటెడ్​ కింగ్​డమ్​-యూకేలో ఆ కొత్త వేరియంట్​ కేసులు వమోదవుతున్నాయని.. ఆ వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతోందని యూకే ఆరోగ్య విభాగం అధికారులు వెల్లడించారు. ప్రతి ఏడు కరోనా కేసుల్లో ఈ కొత్త వేరియంట్​ కేసు ఒకటి ఉంటోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా ఆసియాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో యుకేలో ఈ వేరియంట్​ నమోదైందని యూకే హెల్త్​ సెక్యూరిటీ ఏజెన్సీ- యూకేహెచ్​ఎస్​ఏ వెల్లడించింది. ఈ వేరియంట్​ను జులై 31న EG.5.1గా వర్గీకరించారని చెప్పింది. దీన్ని ఎరిస్​ (Eris) అనే పేరుతో కూడా పిలుస్తున్నారని.. ఈ పరివర్తనాన్ని కొత్త వేరియంట్​గా ప్రకటించడం వల్ల.. డీటెయిల్డ్​ క్యారెక్టరైజేషన్, విశ్లేషణకు వీలు కలుగుతుందని పేర్కొంది.

మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ కొత్త వేరియంట్​పై అధ్యయనం చేస్తోంది. రెండు వారాలుగా ఈజీ.5.1ను ట్రాక్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ వైరస్​తో తీవ్రమైన ముప్పు ఏమీ లేదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ పేర్కొన్నారు. ప్రజలంతా కొవిడ్ టీకాల నుంచి రక్షణ పొందిన నేపథ్యంలో వైరస్ ప్రభావం అంతగా ఉండబోదని అన్నారు. అయితే, యూకే హెల్త్ అథారిటీ డేటా ప్రకారం.. ఆ దేశంలోని మొత్తం కేసుల్లో 14.6 శాతం కేసులు కొత్త వేరియంట్​వే ఉంటున్నాయి. అదేసమయంలో సాధారణ కొవిడ్ కేసుల సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతోంది.

"ఈ వారం మొత్తం కరోనా కేసులు పెరగడాన్ని గమనించాం. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా స్వల్పంగా పెరిగింది. అన్ని వయసుల వారూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో ఈ సంఖ్య అధికంగా ఉంది. అయితే, మొత్తంగా చూస్తే ఆస్పత్రి అడ్మిషన్లు చాలా తక్కువగానే ఉన్నాయి. ఐసీయూ అడ్మిషన్లలో పెరుగుదల కనిపించలేదు. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం."
--డాక్టర్ మేరీ రామ్​సే, యూకేహెచ్ఎస్ఏ ఇమ్యూనైజేషన్ హెడ్

కేసుల పెరుగుదల నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తరచుగా చేతులు కడుక్కోవాలని చెబుతున్నారు. కరోనా లక్షణాలు ఏవైనా కనిపిస్తే.. సాధ్యమైనంత వరకు ఇతరులకు దూరంగా ఉండాలని డాక్టర్ మేరీ రామ్​సే పేర్కొన్నారు. కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తే.. వాటి గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకుంటామని స్పష్టం చేశారు.

'కరోనా చైనా జీవాయుధం.. మనుషులకు సోకేలా తయారీ'.. వుహాన్​ సైంటిస్ట్ షాకింగ్ కామెంట్స్​

మళ్లీ ప్రాణాంతక 'మెర్స్‌' వైరస్​ కలకలం.. 28 ఏళ్ల యువకుడిలో లక్షణాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.