ETV Bharat / international

వాతావరణ మార్పులను ఈసారైనా 'కాప్‌' కాస్తారా?

author img

By

Published : Nov 6, 2022, 7:58 AM IST

ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాళ్లలో వాతావరణల మార్పులు ఒకటి. ఈ మార్పులతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విపత్తులు అధికమవుతున్నాయి. వీటిని అధిగమించడంపై ఈజిప్ట్​లో కాప్​-27 సదస్సు జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు బైడెన్‌ సహా అనేకమంది దేశాధినేతల హాజరు కానున్నారు.

Conference of Parties 27
కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ 27

యావత్‌ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వాతావరణ సవాళ్లను అధిగమించడంపై కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌-27 (కాప్‌27) సదస్సు ఆదివారం ఆరంభమవుతోంది. ఈజిప్ట్‌లోని షర్మ్‌ ఎల్‌ షేక్‌ పట్టణంలో నిర్వహిస్తున్న ఈ మేధోమథనం ఈనెల 18 వరకూ కొనసాగుతుంది. ఐరాస ఆధ్వర్యాన జరుగుతున్న ఈ సదస్సులో 200 దేశాల నుంచి 35 వేల మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, పర్యావరణ కార్యకర్తలు, వాణిజ్యవేత్తలు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా అనేకమంది దేశాధినేతలు పాల్గొంటున్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా ఇప్పటివరకూ చేసిన తీర్మానాలు, వాటి అమలు తీరును వీరంతా సమీక్షించి, కొత్త దిశదశను ప్రపంచానికి నిర్దేశిస్తారు.

ఏమిటీ సదస్సు?
వాతావరణ మార్పులతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విపత్తులు అధికమవుతున్నాయి. వీటిని అరికట్టడానికి, పర్యావరణ మార్పులపై కార్యాచరణ రూపొందించటానికి 'యునైటెన్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆఫ్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (యుఎన్‌ఎఫ్‌సీసీసీ)' పేరుతో ఐరాస ఓ వేదికను ఏర్పాటుచేసింది. ఇందులో భాగస్వామ్యమైన సుమారు 200 దేశాల వార్షిక సమావేశాన్ని కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ది పార్టీస్‌ (కాప్‌)గా పిలుస్తున్నారు. తొలి సదస్సు 1995లో బెర్లిన్‌లో జరగ్గా, నిరుడు కాప్‌-26ను యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని గ్లాస్గోలో నిర్వహించారు.

ఉష్ణోగ్రతలు పెరిగితే సగం మానవాళికి ముప్పు?
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడున్న ఉష్ణోగ్రతలు.. పారిశ్రామిక విప్లవానికి ముందునాటి సగటు ఉష్ణోగ్రతలకు ఎట్టిపరిస్థితుల్లోనూ 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మేర పెరగరాదని, అదే జరిగితే సగం మానవాళికి ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై కాప్‌లో చర్చించి, ఉష్ణోగ్రతల కట్టడికి కార్యాచరణ రూపొందిస్తారు. అయితే పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలను ఉన్నపళంగా పర్యావరణహిత చర్యలు చేపట్టడం మాత్రం అంత సులభంకాదు.

ఉదాహరణకు బొగ్గుపై ఆధారపడ్డ పరిశ్రమలనే చూసుకుంటే.. వాటిని ఇప్పటికిప్పుడు మూసేయడం కష్టం. అలాంటి దేశాలకు సంపన్న దేశాలు ఆర్థికంగా, సాంకేతికంగా ప్రత్యామ్నాయాల దిశగా సాయం చేయాల్సి ఉంటుంది. ఈసారి ఈజిప్టులో జరిగే సదస్సులో అభివృద్ధి చెందిన దేశాలు చేసే ఆర్థిక సాయంపై తీర్మానాలే కీలక అజెండా. గతంలో విచ్చలవిడిగా పర్యావరణాన్ని దెబ్బతీసిన అమెరికా, ఐరోపా వంటి సంపన్న దేశాలు.. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయం చేయాలని భారత్‌, బ్రెజిల్‌ తదితర దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

హామీలన్నీ నీటి మూటలే
'చెప్పేది కొండంత.. చేసేది గోరంత'- ఇదీ ఇప్పటివరకూ కాప్‌ సదస్సు తీర్మానాల అమలు తీరు! ఏటా పర్యావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం చేసి, వాటి కట్టడికి తీర్మానాలు చేయడం.. వాటిని తప్పకుండా అమలుచేస్తామని ప్రతిజ్ఞలు పూనటం, పేద దేశాలకు ఆర్థిక సాయం చేస్తామంటూ అమెరికా తదితర పెద్దన్నలు హామీలివ్వటం.. ఆ తర్వాత కొర్రీలు పెట్టి మాట తప్పటం షరా మామూలుగా మారింది.

  • గ్లాస్గోలో నిరుడు జరిగిన కాప్‌ సదస్సులో కర్బన, మీథేన్‌ ఉద్గారాలను క్రమంగా తగ్గించాలని, అడవుల నరకివేతను ఆపేయాలని తీర్మానించారు. సుమారు 200 దేశాలకుగాను కేవలం 24 మాత్రమే ఇప్పటిదాకా ఆ దిశగా ఏం చేస్తున్నాయో వెల్లడించాయి.
  • బొగ్గు వాడకం తగ్గించాలని తీర్మానించగా.. 2021లో ప్రపంచ వ్యాప్తంగా కార్బన్‌డై ఆక్సైడ్‌ ఉద్గారాలు గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 36.3 బిలియన్‌ టన్నులు పెరిగాయి. ప్రపంచంలో అత్యధికంగా గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌లను వెలువరించే చైనా, అమెరికాలు రాజకీయ గొడవల్లో పడి లక్ష్యాన్ని పట్టించుకోవటం లేదు. ఐరోపా దేశాలదీ అదే పరిస్థితి.
  • భూతాపాన్ని 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మేర నిలువరించేందుకు కృషి చేస్తామంటూ 151 దేశాలు కాప్‌-26లో ప్రతిజ్ఞ చేశాయి. కానీ, చేతల్లో ఇవి ఏమాత్రం ముందుకు సాగటంలేదని ఐక్యరాజ్యసమితి పెదవి విరిచింది
  • 2020 నాటికి అడవుల నరికివేతను 10% తగ్గిస్తామని 145 దేశాలు ప్రమాణం చేశాయి. కానీ, 2022 సెప్టెంబరు నాటికి అమెజాన్‌ అడవుల నరికివేత 23% పెరిగింది.
  • 2030 నాటికి మీథేన్‌ ఉద్గారాలను 30% తగ్గిస్తామని అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ సహా 117 దేశాలు మాటిచ్చాయి. తీరా చూస్తే 15 దేశాలే ఈ దిశగా తమ ప్రణాళికలను వెల్లడించాయి.
  • 2022 కల్లా శిలాజ ఇంధనాలకు ప్రభుత్వ పెట్టుబడిని ఆపేస్తామని 39 దేశాలు హామీ ఇవ్వగా.. కేవలం ఆరు దేశాలే అందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

పర్యావరణ మార్పుల కారణంగా దెబ్బతింటున్న పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా 100 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం చేస్తామంటూ సంపన్న దేశాలు 2009లో హామీ ఇచ్చాయి. ఇప్పటివరకూ 83.3 బిలియన్‌ డాలర్లు ఇచ్చినట్లు ఆ దేశాలు చెబుతున్నా.. ఆక్స్‌ఫామ్‌ వంటి సంస్థలు మాత్రం ఆ మొత్తం కేవలం 24.5 బిలియన్‌ డాలర్లేనని తేల్చిచెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.