ETV Bharat / international

చైనాలో జనాభా సంక్షోభం... పిల్లల్ని కనేందుకు ముందుకు రారే?

author img

By

Published : May 30, 2022, 6:48 PM IST

china population 2022
china population 2022

China Population crisis: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాలో పరిస్థితులు మారిపోతున్నాయి. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో చైనా జనాభా తగ్గుముఖం పడుతోంది. 2021లో చైనా జనాభా 4.80 లక్షలు మాత్రమే పెరిగింది. కార్మిక శక్తి తగ్గుతున్న వేళ డ్రాగన్ వన్‌చైల్డ్ పాలసీని రద్దుచేసి, పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించినా.. చైనీయులు మాత్రం పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదు. అసలేమైంది?

China Population 2022: తగ్గుతున్న చైనా జనాభా.. ఎన్నడూలేని స్థాయిలో జనాభా సంక్షోభం.. ఎందుకిలా.. అసలు ఏమవుతోంది..?
ప్రపంచం మొత్తం జనాభాలో చైనా ఆరింట ఒకవంతు వాటాను కలిగి ఉంది. అంటే ప్రతి ఆరుగురిలో ఒకరు చైనీయులే. ముఖ్యంగా గత నాలుగు దశాబ్దాల కాలంలో డ్రాగన్ జనాభా 66 కోట్ల నుంచి 140కోట్లకు చేరుకుంది.అలాంటి చైనాలో మునుపెన్నడూ లేని విధంగా జనాభా తగ్గుతోంది. 1959-1961 తర్వాత తొలిసారిగా డ్రాగన్ జనాభా తగ్గుముఖం పడుతోంది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్‌ ప్రకారం 2021లో చైనా జనాభా 141.21 కోట్ల నుంచి సుమారు 141.26 కోట్లకు పెరిగింది. చైనా జనాభా పెరుగుదల కేవలం నాలుగు లక్షల 80 వేలకు మాత్రమే పరిమితమైంది.

పిల్లల్ని వద్దనుకుంటున్న దంపతులు
పదేళ్ల కిందటి వరకు చైనా జనాభా ఏటా 80 లక్షల వరకు పెరుగుతూ ఉండేది. అయితే కొవిడ్ నిబంధనల కారణంగా పిల్లలను వద్దనుకునే దంపతుల సంఖ్య పెరగడం 2021లో జననాల తగ్గుదలకు కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. 1980 ఆఖర్లో చైనాలో సంతానోత్పత్తి రేటు 2.6శాతంగా ఉండేది. 1994 నాటికి అది కాస్తా 1.6 నుంచి 1.7శాతం మధ్యకు తగ్గింది. 2020నాటికి 1.3శాతానికి తగ్గిన సంతానోత్పత్తి రేటు గతేడాది 1.15కి తగ్గింది.

అప్పుడు.. 'ఒక్కరు ముద్దు'... ఇప్పుడు 'ముగ్గురైనా ఓకే'
2016కు ముందు వరకు 'ఒక్కరు ముద్దు లేదా అసలే వద్దు' అని అంటూ వచ్చిన చైనా సర్కారు.. 2016లో వన్‌చైల్డ్ పాలసీని రద్దు చేసింది. గతేడాది ఏకంగా పిల్లలను కనేవారికి పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు సైతం ప్రకటించింది. అయినప్పటికీ పిల్లలను కనేందుకు చైనీయులు ముందుకు రావటం లేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్న కుటుంబాల వైపు మొగ్గుచూపటం, జీవన వ్యయం పెరగడం, వివాహ వయస్సు పెంపుతో పాటుగా పిల్లలను కనాలనే కోరిక ప్రజల్లో తగ్గడం కూడా జననాల రేటు తగ్గడానికి కారణంగా చెబుతున్నారు.
ఇదీ చదవండి: జనాభా వృద్ధిలో క్షీణత- ఆ దేశాలకు ఇక కష్టాలేనా?

వన్‌చైల్డ్ పాలసీనే చైనా కొంపముంచిందా?
1980 నుంచి చైనాలో వన్‌చైల్డ్ పాలసీని అనుసరించడం వల్ల ఎక్కువమంది మగపిల్లల వైపు మొగ్గుచూపారు. 1980 వరకు ప్రతి వంద మంది అబ్బాయిలకు వంద మంది అమ్మాయిలు ఉన్నారు. వన్‌చైల్డ్‌ పాలసీతో ఎక్కువ మంది చైనీయులు మగపిల్లలవైపు మొగ్గుచూపగా.. ఈ నిష్పత్తి 120:100కి పడిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో 130:100గా మారిపోయింది. ఇది కూడా చైనా జనాభా తగ్గుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు, 2021 తర్వాత చైనా జనాభా సగటున 1.1 శాతం మేర తగ్గుతుందని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంచనా వేసింది. ఫలితంగా 2100 సంవత్సరానికి డ్రాగన్ జనాభా 58కోట్ల 70 లక్షలకు తగ్గుతుందని వెల్లడించింది. సంతానోత్పత్తి రేటు సైతం 2030 నాటికి 1.1శాతానికి తగ్గుతుందన్న షాంఘై అకాడమీ 2100సంవత్సరం వరకు ఇదే తగ్గుదల కొనసాగుతుందని పేర్కొంది.

జనాభా తగ్గుదల చైనా ఆర్థిక వ్యవస్థపై సైతం ప్రభావం చూపుతుందని.. షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంచనా వేసింది. చైనాలో పనిచేసేవారి సంఖ్య 2014లో గరిష్ఠస్థాయికి చేరగా.. 2100 నాటికి అదికాస్తా మూడింట ఒక వంతుకు క్షీణిస్తుందని అంచనా వేసింది. ఇదే సమయంలో 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య సైతం పెరుగుతుందని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ పేర్కొంది. 2080 నాటికి పనిచేసే జనాభాను వృద్ధుల జనాభా అధిగమిస్తుందని లెక్కగట్టింది. ప్రస్తుతం వంద మంది పనిచేస్తూ 20 మంది వృద్ధులకు చేయూతగా నిలుస్తుండగా.. 2100నాటికి వంద మంది పనిచేస్తే 120 మంది వారిపై ఆధారపడే పరిస్థితులు వస్తాయని పేర్కొంది. ఫలితంగా కార్మిక శక్తి తగ్గి కార్మికుల వ్యయం పెరుగుతుందని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ విశ్లేషించింది. వృద్ధుల జనాభా అవసరాలు తీర్చేందుకు ఆరోగ్యం, వైద్యం, సంరక్షణ సేవలను అందించడానికి చైనా తన ఉత్పాదక వనరులను మరింతగా పెంచవలసి ఉంటుందని అంచనావేసింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.