ముగ్గురు పిల్లలపై చైనీయుల విముఖత

author img

By

Published : Jun 9, 2021, 7:18 AM IST

new population policy in china
ముగ్గురు పిల్లలపై చైనీయుల విముఖత ()

కుటుంబ నియంత్రణపై ఆంక్షలను సడలించినప్పటికీ ముగ్గురు పిల్లలను కనేందుకు చైనీయులు ఆసక్తి చూపడం లేదు. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనే పేరున్నప్పటికీ చైనా జనాభాలో అధికశాతం అల్పాదాయ వర్గమే. జీవన వ్యయాల సమస్యతో పాటు.. మాతృత్వ సెలవులు లేకపోవడం వంటి అనేక అడ్డంకులు చైనా జనాభా తగ్గుదలపై ప్రభావం చూపుతున్నాయి.

దేశంలో జననాల రేటు నానాటికీ పడిపోతుండటం వల్ల చైనా ప్రభుత్వం ఒక్కో జంట ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చేందుకు అనుమతినిచ్చింది. అయితే, చాలా జంటలకు ఈ నిర్ణయం ఆనందాన్నేమీ ఇవ్వలేదు. 1980లో జనాభా వంద కోట్లకు చేరువవుతున్న తరుణంలో చైనా ఒకే సంతానం నిబంధన తీసుకొచ్చింది. పట్టణ ప్రాంతాల్లో చాలా కఠినంగా అమలు చేశారు. దీని ద్వారా దాదాపు నలభై కోట్ల జననాలను నిరోధించామని, దేశంలో తీవ్ర ఆహార, నీటి కొరతను నివారించామని చైనా చెప్పింది. ఆడశిశువుల భ్రూణహత్యలు, బలవంతపు గర్భస్రావాలు, పురుష జనాభా పెరుగుదల లాంటి వాటికి ఈ నిర్ణయం దారి తీసిందనే విమర్శలున్నాయి.

ఏక సంతాన నిబంధన వల్ల ఎంతో మంది ఆడపిల్లలు వీధులపాలై, అనాథ శరణాలయాలకు వెళ్లారని చెబుతారు. ముఖ్యంగా ఎంత జరిమానా అయినా చెల్లించి ఎక్కువ మంది పిల్లల్ని కనే సంపన్నులతో పోల్చితే పేదలకు ఇది మరింత అన్యాయం చేసిందనే విమర్శలున్నాయి. ఏక సంతానం నిబంధనతో జననాలు మరీ తగ్గిపోతుండటంతో 2016 నుంచి ఇద్దరు పిల్లల్ని కనేందుకు చైనా ప్రభుత్వం అనుమతించింది. దీనివల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదని తాజా జనాభా లెక్కలు స్పష్టంచేయడంతో సంతాన సంఖ్యను జిన్‌పింగ్‌ ప్రభుత్వం ముగ్గురికి పెంచింది.

పెరిగిన వృద్ధ జనాభా..

నిరుడు చైనాలో 1.2 కోట్ల మంది శిశువులు జన్మించారు. 2019తో పోలిస్తే జననాలు 18 శాతం తగ్గిపోయాయి. 1970లో చైనా మొత్తం సంతానోత్పత్తి రేటు 5.8 శాతం ఉంటే, 2020 నాటికి అది 1.3కి పడిపోయింది. తరాల మధ్య సమతుల్యత సక్రమంగా ఉండాలంటే ఈ రేటు 2.1గా ఉండాలి. చైనాలో 15-59 ఏళ్ల శ్రామిక జనాభా ప్రస్తుతం 89.43 కోట్లు. మొత్తం జనాభాలో ఇది 63.35 శాతం. 2010తో పోలిస్తే 6.79 శాతం తక్కువ. మరోవైపు దేశంలో 60 ఏళ్లు పైబడిన జనాభా సంఖ్య 5.4 శాతం పెరిగి 26.4 కోట్లకు చేరింది. ఏక సంతాన నిబంధన వల్ల చైనా జనాభా సగటు వయసు ఇతర దేశాలకన్నా పెరిగింది. ఇది దేశ వృద్ధి మీదా ప్రభావం చూపుతోంది.

దేశంలో యువ జనాభా తగ్గిపోతే శ్రామికశక్తి కొరతకు దారితీసి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. జపాన్‌, జర్మనీ లాంటి దేశాలూ ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. కానీ, అవి సాంకేతిక పరిజ్ఞానంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. చైనా మాత్రం తయారీ రంగం, వ్యవసాయంలో శ్రామికశక్తిపైనే అధికంగా ఆధారపడుతోంది. ఈ పరిస్థితుల్లో శ్రామిక జనాభా సమస్యను అధిగమించేందుకు ఉద్యోగ విరమణ వయసును పెంచాలని చైనా భావించింది. దీనికి మిశ్రమ స్పందన లభించింది.

మాతృత్వ సెలవులు కష్టమే..

పేరుకు ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా చైనాది అల్పాదాయ సమాజమే. జీవన వ్యయం, చదువు ఖర్చులు, అద్దెలు విపరీతంగా పెరగడం, సుదీర్ఘ పని గంటలు తదితరాలతో ఒకరి కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు పట్టణ ప్రాంత చైనీయులు (మొత్తం జనాభాలో 64 శాతం) ఆసక్తి చూపట్లేదు. దశాబ్దాల తరబడి ఏక సంతాన నిబంధన అమలులో ఉండటంతో చాలా మంది దానికి అలవాటుపడిపోయారు. యువతకు ఉద్యోగాల కొరత మరో సమస్య. అలాగే ముందు మహిళల మాతృత్వ హక్కుల సమస్యలు పరిష్కరించి తరవాత ముగ్గురు పిల్లల గురించి మాట్లాడాలనే వాదనలూ గట్టిగా వినిపిస్తున్నాయి. చైనాలో మాతృత్వ సెలవులు సరిగ్గా అమలు కావనే విమర్శ ఉంది. ముగ్గురు సంతానం ప్రకటన వెలువడగానే బాగా వార్తల్లోకి వచ్చిన అంశం '996' పని సంస్కృతి. వారంలో ఆరు రోజులు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు పనిచేయడం- పిల్లల్ని కనటానికి, పెంచడానికి అవరోధమని చాలా మంది పేర్కొంటున్నారు.

కొత్త నిర్ణయం నేపథ్యంలో చైనా ప్రభుత్వ వార్తాసంస్థ జిన్‌హువా నిర్వహించిన ఆన్‌లైన్‌ పోల్‌లో 31 వేల మందిలో 28 వేల మంది ముగ్గురు పిల్లల నిర్ణయానికి సమ్మతి తెలపలేదు. పిల్లల చదువు, సంరక్షణలో కుటుంబాలకు సాయపడతామని చెప్పే చైనా ప్రభుత్వం ఆ దిశగా చేసేది అరకొరే! కొత్త విధానం మేరకు ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చేవారికి ప్రోత్సాహకాలు అందిస్తామని సర్కారు చెబుతోంది. అలవిగాని జీవన వ్యయాల్ని అదుపులోకి తెస్తేనే చైనా ముగ్గురు పిల్లల ముచ్చట తీరుతుంది!

- వేణుబాబు మన్నం

ఇవీ చదవండి: ముగ్గురు పిల్లలా.. వద్దు బాబోయ్‌.!

ఒక్కో జంటకు ముగ్గురు పిల్లలు- చైనా అనుమతి

'కరెన్సీ'తో చైనా కొత్త స్కెచ్- అమలైతే అంతే..

చైనాకు మిత్ర దేశాలు లేవు: అమెరికా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.