ETV Bharat / international

కొవిడ్​తో చైనీయులు నరకయాతన.. శవాలతో శ్మశానాలు ఫుల్.. 25కోట్ల మందికి వైరస్

author img

By

Published : Dec 26, 2022, 8:47 PM IST

Etv Bharat
Etv Bharat

చైనాలో పరిస్థితులు ఊహించిన దానికంటే మరింత దారుణంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గుట్టలుగా పేరుకుపోయిన శవాలే కనిపిస్తున్నాయి. శ్మశానాల వద్ద ఎక్కడ చూసినా శవాలను మోసుకొస్తున్న వారితో క్యూలు దర్శనమిస్తున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు లేక..అంబులెన్స్‌ల్లోనే రోజుల తరబడి చికిత్స చేయాల్సి వస్తోంది. రాజధాని బీజింగ్‌తో సహా ఎక్కడ చూసినా ఆత్మీయులను పోగొట్టుకున్న వారి రోదనలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ మరణాలను చైనా కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోంది. చైనా ఆరోగ్య కమిషన్‌ నుంచి లీక్‌ అయిన రహస్య సమాచారం ఇప్పటికే 25కోట్ల మంది వైరస్‌కు సోకినట్లు బయటపెట్టింది.

చైనాలో కొవిడ్‌ పరిస్థితులు నరకాన్ని తలపిస్తున్నాయి. రాజధాని బీజింగ్‌తో అన్ని ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో పడకలు నిండిపోయాయి. కొత్తగా కరోనా సోకిన వారికి బెడ్లు లేకపోవడంతో అంబులెన్సులు, ఆస్పత్రుల ప్రాంగణాల్లోనే..చికిత్స అందిస్తున్నారు. ఏ ఆస్పత్రిలో అయినా బెడ్‌ దొరక్కపోదా అని ఆశతో రోగుల బంధువులు వందల కిలోమీటర్లు తిరుగుతున్నారు. బాధితులను వీల్‌ ఛైర్‌లలో కూర్చోబెట్టి చికిత్స అందించాలంటూ ఆస్పత్రి వర్గాలను వేడుకుంటున్నారు. హెబెయ్‌ ప్రావిన్స్‌లోని జువాఝౌలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సరిపడక అత్యవసర చికిత్సకు వైద్యులు చేతులెత్తేస్తున్నారు.

చైనాలోని చాలా ప్రాంతాల్లో శ్మశాన వాటికల్లో శవాలు 24 గంటలూ మండుతున్నాయి. దహనం చేసేందుకు శవాలతో బంధువులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. బీజింగ్‌, హెబెయ్‌ సహా దాదాపు చైనా అంతా ఇదే పరిస్థితి నెలకొంది. బీజింగ్‌లో శ్మశాన వాటికలు చాలక గంటల తరబడి ప్రయాణించి ఇతర చోట్లకు చేరుకుంటున్నారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు వందల మీటర్ల మేర క్యూలు కట్టిన దయనీయమైన దృశ్యాలను ఓ చైనా ఆరోగ్యాధికారి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

CHINA COVID NEWS
శ్మశానం వద్ద మృతదేహాలు

ఈ దారుణ పరిస్థితులపై చైనా ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. ఆరోగ్య కమిషన్‌ నుంచి లీకైన పత్రాల్లో మాత్రం ఒక్క డిసెంబర్‌లోనే 25కోట్లమందికి వైరస్‌ సోకినట్లు ఉంది. డిసెంబర్‌ ఏడున సడలింపులు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు 7 కొవిడ్‌ మరణాలు మాత్రమే సంభవించినట్లు అధికారికంగా చైనా ప్రకటించింది. అయితే కోవిడ్‌ సోకి శ్వాససంబంధిత కారణాలతో మరణించిన వారినే అక్కడి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటున్నట్లు ఓ మీడియా సంస్థ వివరించింది. చైనా దాస్తున్న కోవిడ్‌ మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఉన్నతాధికారి అసహనం వ్యక్తం చేశారు. మరణాల సంఖ్యపై కచ్చితమైన సమాచారం ఇవ్వాలని చైనాకు సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.